Sunday, 19 February 2017

ఫిబ్రవరి 2017 రాష్ట్రీయం

రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ప్రారంభంహైదరాబాద్‌లోని పరిశోధనశాలలు, అత్యున్నత విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఒక దగ్గరకు చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH)ను ఫిబ్రవరి 24న ఏర్పాటు చేసింది. శాస్త్ర పరిశోధనలకు విలువలు జోడించడం, వాటిని ఉత్పత్తులు, సేవలుగా మార్చడంతో పాటు వాటిని సామాన్య ప్రజల చెంతకు చేర్చడమే దీని ప్రధాన లక్ష్యం.

విజయవాడలో మేధోసంపత్తి, వాణిజ్య చట్టాల సదస్సు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో "మేధో సంపత్తి, వాణిజ్య న్యాయాలు-చట్టాలు"అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఫిబ్రవరి 24 నుంచి 25 వరకూ జరిగిన ఈ సదస్సుని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, జస్టిస్ రోహిణి, జపాన్ న్యాయమూర్తి జస్టిస్ అకిర కటసే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్, ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు, జపాన్ విదేశీ వాణిజ్య సంస్థ- జెట్రో సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహించాయి. 

ఆంధ్రప్రదేశ్‌తో వీసా అవగాహనా ఒప్పందం విశాఖపట్నం దేశంలోనే తొలి నగదు రహిత నగరంగా మారనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థ వీసాతో ఫిబ్రవరి 23న అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలో ప్రస్తుతం 70 శాతంగా ఉన్న ఎలక్ట్రానిక్ చెల్లింపులను 100 శాతానికి చేర్చేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. 

హైదరాబాద్‌లో అంతర్జాతీయ బౌద్ధ సదస్సుఅంతర్జాతీయ బౌద్ధ సదస్సును తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 15 దేశాల నుంచి 63 మంది ప్రతినిధులు సహా జాతీయ, స్థానిక ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో సిర్పూర్ పట్టణ శివారులోని నాగమ్మ చెరువులో 40 అడుగుల బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణలో వీఆర్‌ఏల వేతనం పెంపు రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు-VRAల వేతనాన్ని 64.61 శాతం పెంచుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 24న నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం నెలకు రూ.6,500గా ఉన్న వీరి వేతనం రూ.10,500 పెరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన జీతాలు అమల్లోకి వస్తాయి. అలాగే వీఆర్‌ఏలకు గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించిన సీఎం వీఆర్‌వో, అటెండర్, డ్రైవర్ తదితర నియామకాల్లో 30 శాతం ఉద్యోగాలు వీరికి రిజర్వు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలోని 19,345 వీఆర్‌ఏలు ప్రయోజనం పొందుతారు. 

తెలంగాణ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ సలీం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ మహ్మద్ సలీం ఎన్నికయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లోని హజ్‌హౌస్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఆయన అభ్యర్థిత్వానికి సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వక్ఫ్‌బోర్డ్ సీఈవో అసదుల్లా ప్రకటించారు. 

ఏఎన్‌యూలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అండ్ బుద్ధిజం సదస్సు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అండ్ బుద్ధిజం అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఫిబ్రవరి 24 నుంచి 25 వరకూ జరిగిన సదస్సుకి మంగళూరు విశ్వవిద్యాలయం అధ్యాపకుడు, తత్వవేత్త ప్రొఫెసర్ వలీరియన్ రోడ్రిగస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు బుద్ధిజం తత్వవేత్తలు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణలో వైద్య విద్య పరిశోధనలకు మెరిట్ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వెద్య విద్య, పరిశోధన (మెరిట్) అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో చదివే ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు, అధ్యాపకులు వ్యక్తిగతంగా లేదా బృందాలుగా వివిధ అంశాలపై పరిశోధన చేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకోసం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ ఆర్థిక సహాయం అందిస్తారు. కార్యక్రమ అమలు కోసం ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించింది. 

చంచల్‌గూడ్ జైళ్ల్లో ఈ-ములాఖత్ ప్రారంభం హైదరాబాద్ చంచల్‌గూడ్ కేంద్ర కారాగారంలో ఈ-ములాఖత్ సేవలను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫిబ్రవరి 25న ప్రారంభించారు. ఖైదీలను కలవాలని అనుకునే వారుeprisons.nic.in వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీలో గిరిజనుల స్థితిగతులపై నివేదిక విడుదలరాష్ట్రంలో ఎస్టీలు అక్షరాస్యత, మాతా శిశుమరణాలు, కనీస సౌకర్యాల విషయంలో చాలా వెనుకబడ్డారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వారి స్థితిగతులపై అధ్యయనం చేసిన ఎస్టీ విభాగం గణాంకాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్లకు అందజేసింది. 
సర్వే ముఖ్యాంశాలు
  • రాష్ట్రంలో సాధారణ అక్షరాస్యత 67.61 శాతం. ఎస్టీల్లో 48.63 శాతం.
  • రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న ఎస్టీల పిల్లలు 33 శాతం.
  • రాష్ట్రంలో 26.83 శాతం మంది పిల్లలు పదో తరగతిలోపు బడి మానేస్తుండగా ఎస్టీల్లో ఆ శాతం 60.37గా ఉంది.
  • మాతా, శిశు మరణాలు సాధారణంగా ప్రతి లక్ష మందికి 92 ఉంది. అదే ఎస్టీల్లో 195గా నమోదైంది. శిశు మరణాలు ప్రతి వెయి్య మందికి సాధారణంగా 39 ఉండగా ఎస్టీల్లో 68గా ఉంది.
  • రాష్ట్రంలో 44 శాతం ఎస్టీ కుటుంబాలకు మాత్రమే ఇళ్లు ఉన్నాయి.
  • 29 శాతం మంది పిల్లలు సమీకృత శిశు అభివృద్ధి కేంద్రాలకు దూరంగా ఉన్నారు.
  • రక్షిత మంచినీటి సరఫరా లేని ఎస్టీ నివాస ప్రాంతాలు 47 శాతం.
  • 44 శాతం ఎస్టీ నివాస ప్రాంతాలకు రహదారులు లేవు.

తెలంగాణలో అంగన్‌వాడీల వేతనాలు 50 శాతం పెంపు తెలంగాణలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలను 50 శాతం పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 27న ప్రకటించారు. ఈ పెంపుతో ప్రస్తుతం రూ.7 వేలుగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం రూ.10,500కు పెరిగింది. మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనం రూ.4,500 నుంచి రూ.6,000 వేలకు పెరిగింది. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తల హోదాను అంగన్‌వాడీ టీచర్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో 67,411 మంది అంగన్‌వాడీలు పనిచేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు తెలంగాణ ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మేరకు ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆడ పిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని తెలిపారు. మాతా శిశు సంక్షేమంలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు. 

కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కన్నుమూతకేంద్ర మాజీ మంత్రి పుంజల శివశంకర్(87) ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లో కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మామిడిపల్లిలో 1929 ఆగస్టు 10న జన్మించిన శివశంకర్ ఇందిరాగాంధీ హయాంలో కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు. హైకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. దశాబ్దకాలంపాటు వివిధ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేశారు. కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు.

సుప్రీంకోర్టులో శివశంకర్ న్యాయ పోరాటంతో బీసీ రిజర్వేషన్లలో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ విధానంతో పాటు రాష్ట్రంలో బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు వచ్చాయి. 

ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా అజేయ కల్లంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న ఆయన బాధ్యతలు చేపట్టారు. 2016 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్య ప్రకాశ్ టక్కర్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. 

నెల రోజుల పాటు సీఎస్‌గా పనిచేయనున్న అజేయ కల్లం మార్చి నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దినేశ్ కుమార్ చేపడతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌గా వెంకటేశ్వరరెడ్డితెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌గా ఎ.వెంకటేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 27న ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సెషన్‌‌స జడ్జిగా పనిచేస్తున్నారు. ఇటీవల వరకు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా ఉన్న షమీమ్ అక్తర్ పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో వెంకటేశ్వరరెడ్డిని నియమించిన హైకోర్టు రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సెషన్‌‌స జడ్జి స్థానాన్ని వై.రేణుకతో భర్తీ చేసింది. 

కొలనుపాకను దత్తత తీసుకున్న దత్తాత్రేయప్రధాన మంత్రి సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన కింద యాదాద్రి జిల్లాలోని కొలనుపాకను కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రెండేళ్ల పాటు దత్తత తీసుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 27న ప్రకటించారు. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన రెండు వేల ఏళ్ల నాటి జైన దేవాలయం ఉంది.

తొలి మహిళా ఐపీఎస్ అరుణా బహుగుణ పదవీ విరమణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన తొలి మహిళా ఐపీఎస్ అరుణా బహుగుణ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె 38 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. సర్దార్ వల్లభ్‌బాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా, సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా అధికారిగా అరుణా బహుగుణ గుర్తింపు పొందారు. అంతకుముందు ఆమె సిటీ జాయింట్ పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్)గా, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారిగానూ పనిచేశారు. 

జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా డోలే బర్మన్ సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ-NPA కొత్త డెరైక్టర్‌గా డీఆర్ డోలేబర్మన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. 1986 జమ్మూకశ్మీర్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన డోలేబర్మన్ ఈ నియామకానికి ముందు మేఘాలయ రిబోయి జిల్లాలోని ఉమియాం నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా పనిచేశారు. 2008లో గౌహతిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సమాచారాన్ని ముందుగానే గుర్తించినందుకు ఆమె ఎస్‌ఎస్‌బీ డీజీపీ అవార్డు అందుకున్నారు. సేవలకు గుర్తింపుగా షేర్-ఈ-కశ్మీర్ పతకం, ఇండియన్ పోలీసు మెడల్, ప్రెసిడెంట్ మెడల్‌ను పొందారు. 

డీఆర్ డోలేబర్మన్ జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా నియమితులైన రెండో మహిళా అధికారి కాగా ఈ సంస్థకు మొదటి మహిళా డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ఐపీఎస్ అరుణ బహుగుణ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. 

అర్బన్ ప్లానింగ్‌లో హైదరాబాద్‌కు నాలుగో స్థానం ‘పట్టణ ప్రణాళిక’ (అర్బన్ ప్లానింగ్)లో హైదరాబాద్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మేరకు జనాగ్రహ అనే సంస్థ ఫిబ్రవరి 28న ఓ నివేదిక విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 21 ప్రధాన నగర మున్సిపాలిటీల్లో పాలన, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రణాళిక, సాధికారత వంటి అంశాల ఆధారంగా ఆ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలవగా భువనేశ్వర్, కోల్‌కతా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రాష్ట్రపతి విందుకు నారాయణఖేడ్ యువకుడు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మార్చి 6న జరిగే ‘ప్రజెంటేషన్ ఆఫ్ విజి టర్స్ అవార్డు-17’ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన పాండురంగారావు వెళ్లనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న రాష్ట్రపతి భవన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. బైక్ మెకానిక్ అయిన పాండురంగారావు పంక్చర్‌కాని ట్యూబ్‌లెస్ టైర్‌ను తయారు చేశారు. దీంతో పాటు విద్యుత్ స్తంభాలను సులభంగా ఎక్కేందుకు క్లచ్చర్స్ తయారు చేశారు. ఈ ఆవిష్కరణలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కింది. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలో పాండురంగారావు రూపొందించిన పరికరానికి గుర్తింపు లభించింది.

పీఎస్‌సీల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణిరాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నేషనల్ కాన్ఫరెన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ఫిబ్రవరి 19న ఏకగ్రీవ ంగా ఎన్నికయ్యారు. గుజరాత్‌లో జరిగిన రెండు రోజుల పీఎస్‌సీల నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఈ ఎంపిక జరిగింది. రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసులైన గ్రూప్-1, 2 పరీక్షలకు దేశ వ్యాప్తంగా ఒకే పద్ధతిని అమలు చేయాలని అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు నిర్ణయించారు. ఈ విధానంలో.. సిలబస్‌లో 70 శాతం ఒకే విధంగా, మిగిలిన 30 శాతం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలుంటాయి.
భూమిలేని కుటుంబాలకు ప్యాకేజీ 
నీటిపారుదల ప్రాజెక్టుల అవసరాలకు జీవో 123 కింద చేపట్టిన భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే భూమిలేని కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 14న ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ భూమిలేని కూలీలు, వృత్తికళాకారులు, కౌలుదార్లకు వర్తిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం అర్హులను గుర్తించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజావ సరాల కోసం భూ సేకరణకు తెలంగాణ ప్రభుత్వం 2015, జూలై 30న జీవో 123ను జారీ చేసింది.
TSIICలో మూడు కొత్త జోన్లుతెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ-TSIICలో 3 కొత్త జోన్లు ఏర్పాటయ్యాయి. నిజామాబాద్, ఖమ్మం, యాదాద్రి కేంద్రంగా వీటిని ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 15న సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధిపేట కేంద్రంగా సబ్ జోన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో TSIIC జోన్ల సంఖ్య 9కి చేరింది. 
హైదరాబాద్‌లో ఏరోనాటికల్ నైపుణ్యాల అభివృద్ధి కేంద్రంఏయిర్‌బస్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, ఏరో స్కూల్ ఆక్విటైన్ ఆఫ్ ఫ్రాన్స్ సంస్థలు హైదరాబాద్ బేగంపేటలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేయనున్నాయి. బెంగళూరులో ఫిబ్రవరి 15న ముగిసిన ఏరో ఇండియా-2017 సదస్సులో ఆయా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థలో ఏరోనాటికల్ పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా కోర్సుల రూపకల్పన చేసి శిక్షణ ఇస్తారు. ప్రపంచంలో ప్రముఖ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వర్సిటీల్లో ఒకటైన యూకేలోని క్రాన్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయంతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
తెలంగాణ డిస్కంలకు రూ.1,700 కోట్లు 
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,700 కోట్లను పెట్టుబడి మూలధనంగా విడుదల చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ-TSSPDCL, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ-TSNPDCLలకు 70:30 నిష్పత్తిలో ఈ పెట్టుబడులను మంజూరు చేస్తూ ఫిబ్రవరి 16న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ రెండింటిలో కలిపి రాష్ట్ర మూలధనం వాటా రూ.998 కోట్ల కాగా తాజా కేటాయింపులతో అది రూ.2,698 కోట్లకు పెరిగింది.
విజయవాడ మెట్రోకు జర్మనీ నుంచి రూ.2,600 కోట్ల రుణం 
విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు జర్మనీ రూ.2600 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చించింది. ఈ ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం కేంద్రం భరించనుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. 
తెలంగాణలో ఎంబీసీలకు కార్పొరేషన్తెలంగాణలో అత్యంత వెనుకబడ్డ తరగతుల అభివృద్ధి సంస్థ-MBC (Most Backward Classes Development Corporation)ని ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎంబీసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఫిబ్రవరి 20న నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ ఈ మేరకు వెల్లడించారు. కార్పొరేషన్ కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని వాటిని ఎలా ఖర్చు చేయాలన్నది కూడా ఎంబీసీ ప్రతినిధులే నిర్ణయించే విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. 
మహాదాత మట్టపల్లి చలమయ్య కన్నుమూతపారిశ్రామికవేత్త, ప్రముఖ దాత మట్టపల్లి చలమయ్య (94) ఫిబ్రవరి 20న విశాఖపట్నంలో కన్నుమూశారు. 1923 నవంబర్ 19న తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో జన్మించిన చలమయ్య తండ్రి బాటలోనే పయనిస్తూ వ్యాపార రంగంలో ఎదిగారు. 1941లో బర్మా నుంచి వలస వచ్చి సామర్లకోట రైల్వేస్టేషన్‌కు చేరుకున్న 5 వేల మంది శరణార్థులకు చలమయ్య ప్రతి రోజూ అన్నం పెట్టారు. తద్వారా మహాదతగా ఆయన గుర్తింపు పొందారు. 
విశాఖ విమానాశ్రయానికి ఏ గ్రేడ్ హోదావిశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ గ్రేడ్ హోదా దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. 2016-17లో విశాఖ ఎయిర్‌పోర్టు ప్రయాణికుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఏడాదిలో 20 లక్షల ప్రయాణికులు దాటిన అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఏ గ్రేడ్ హోదా కల్పిస్తారు.
దేశంలో ఏ గ్రేడ్ హోదా పొందిన విమానాశ్రయాలు: శ్రీనగర్, గోవా, కోచి, పుణె, విశాఖపట్నం


‘గోదావరి జలాల పరిపూర్ణ వినియోగం’ పుస్తకావిష్కరణ
కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె రచించిన 'గోదావరి జలాల పరిపూర్ణ వినియోగం-తెలంగాణ, జాతీయ దృక్పథం' ఆంగ్ల పుస్తక ఆవిష్కరణ ఫిబ్రవరి 8న ఢిల్లీలో జరిగింది. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ఉమాభారతి, బండారు దత్తాత్రేయ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీరాం వెదిరె ప్రస్తుతం రాజస్తాన్ నదీ జలాల అథారిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సువిజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద తొలి జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా, ప్రముఖ గాంధేయవాది ఈలా భట్, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ శిరిన్ షార్మిన్ చౌదరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చట్టసభల్లోని మహిళా సభ్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు సదస్సులో పాల్గొన్నారు. మహిళా సాధికారతకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చిస్తారు. 

టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా నారాయణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం-TTDపాలక మండలి సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 9న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఐటీ దాడుల్లో పట్టుబడిన శేఖర్‌రెడ్డిని టీటీడీ పాలకమండలి నుంచి తప్పించారు. ఖాళీ అయిన ఆ స్థానంలో సుధా నారాయణమూర్తిని నియమించారు. 

తెలంగాణకు ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి All india institute of medical sciences-AIIMS ను మంజూరు చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 9న లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక వైద్య సేవల సంస్థను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. 2017-18 కేంద్ర బడ్జెట్‌లో గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలకూ ఎయిమ్స్ మంజూరైంది. 

ఏపీ క్రీడా విధానానికి ఆమోదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం కొత్తగా ప్రతిపాదించిన క్రీడా విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్పోర్ట్స్ పాలసీ పేరుతో పిలిచే ఈ విధానం 2022 మార్చి 31 వరకూ అమల్లో ఉంటుంది. కొత్త క్రీడా విధానంలో మౌలిక సౌకర్యాల కల్పన, కోచ్‌ల నియామకం, ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు, టోర్నీల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి.

62 శాతం మంది గర్భిణీల్లో పోషకాహార లోపం తెలంగాణ రాష్ట్రంలో సగటున వంద మంది గర్భిణీల్లో ఏకంగా 62 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య లక్ష్మీ పథకం కింద జనవరిలో పోషకాహార పంపిణీపై మహిళా శిశు సంక్షేమ చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మొత్తంగా బాలామృతం, ఆరోగ్య లక్ష్మి పథకాల కింద నమోదైన వారిలో కేవలం 20.80 శాతం మాత్రమే లబ్ధిపొందుతున్నారని సర్వేలో తేలింది. 

హైదరాబాద్‌లో దలైలామా నైతిక విలువల కేంద్రంభారత్ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 12న హైదరాబాద్‌కు వచ్చిన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా.. మాదాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న దలైలామా నైతిక విలువల కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఇది దక్షిణాసియా హబ్‌గా వ్యవహరించనుంది. దలైలామా ఫిబ్రవరి 10 నుంచి 12 వరకూ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులోనూ పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మరో 33 కరువు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో మరో 33 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఖరీఫ్‌లో తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో 268 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. క్షేత్రస్థాయి పరిస్థితులపై కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మరోసారి పరిశీలించిన ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో 13, ప్రకాశంలో 10, శ్రీకాకుళంలో 4, విజయనగరం జిల్లాలో 6 మండలాలను కరువు ప్రాంతాల జాబితాలో చేర్చింది. దీంతో 2016 ఖరీఫ్‌లో ప్రకటించిన దుర్భిక్ష మండలాల సంఖ్య 301కి చేరింది.

టీటీడీ బడ్జెట్ రూ.2,858 కోట్లుతిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ. రూ.2,858.48 కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆమోదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో హుండీ కానుకల ద్వారా రూ.1,110 కోట్లు రావచ్చని అంచనా వేసింది. 2016-17 టీటీడీ బడ్జెట్ రూ. రూ.2,678 కోట్లు. 

ఏపీలో మూడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటు
ఫిబ్రవరి 14న సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రాష్ట్రంలో కొత్తగా 3 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అనంతపురం, కర్నూలు, గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. చంద్రన్న బీమా కింద కార్మికులకు అదనంగా రూ.30 వేల పరిహారమివ్వాలని కేబినెట్ నిర్ణయించింది. 

కేబినెట్ నిర్ణయాలు 
  • 3,098.46 చ.కి.మీ. పరిధితో అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు. దీని పరిధిలోకి 8 మండలాల్లోని 177 గ్రామాలు.
  • కాకినాడ 2,215.50 చ.కి.మీ. విస్తీర్ణంలో గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు. దీని పరిధిలో 6 మున్సిపాల్టీలు, 26 మండలాల్లోని 280 గ్రామాలు.
  • కర్నూలు కేంద్రంగా 2,414.69 చ.కి.మీ. విస్తీర్ణంలో కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు. దీని పరిధిలో 8 మండలాల్లోని 111 గ్రామాలు.
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్బన్ ప్రాంతాల్లో 3 కేటగిరీల్లో 1,20,106 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.
  • ఏపీ సైబర్ సెక్యూరిటీ విధానం-2017కు ఆమోదం.
  • 2017-18ను ఇ-ప్రగతి సంవత్సరంగా పరిగణించాలని తీర్మానం.
  • మాతృ మూర్తులపై గౌరవం పెంపొందేలా ‘అమ్మకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం.

హైదరాబాద్‌లో 14వ బయో ఏసియా సదస్సు 14వ బయో ఏసియా సదస్సు ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. HICC వేదికగా మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుని గవర్నర్ నరసింహన్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శామీర్‌పేట మండలం తుర్కపల్లి పారిశ్రామిక వాడ జీనోమ్ వ్యాలీకి మరో రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కార్యక్రమంలో పాల్గొన్న నోబెల్ అవార్డు గ్రహీత, స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త కర్ట్ వుట్రిచ్ (2002, రసాయన శాస్త్రం), జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పాల్ స్టౌఫెల్స్‌లను జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులతో సత్కరించారు. 

భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ప్రారంభంఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా వద్ద నిర్మించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జనవరి 31న ప్రారంభించారు. దీన్ని కేవలం 10 నెలల వ్యవధిలోనే పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి, డోర్నకల్ (మహబూబాబాద్ జిల్లా) మండలాల్లోని మొత్తం 60 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది.

చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతతెలంగాణలో చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి సమంత ఎంపికైంది. జనవరి 31 చేనేత వస్త్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కె.తారకరామారావు ఈ మేరకు ప్రకటన చేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేనేత లక్ష్మీ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. 

మొదటి మహిళా రేడియో న్యూస్ రీడర్ మంగమ్మ మృతిఆలిండియా రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్ డాక్టర్ జోలెపాళెం మంగమ్మ(92) చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఫిబ్రవరి 1న కన్నుమూశారు. మంగమ్మ సుబ్బన్న, లక్ష్మమ్మ దంపతులకు 1924 సెప్టెంబర్ 12న జన్మించారు. 1952లో ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్‌గా చేరి పదేళ్ల పాటు ఆ ఉద్యోగంలో ఉన్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనేక పుస్తకాలు రాసిన ఆమె 2002లో తెలుగు అకాడమీ నుంచి ఉగాది పురస్కారం అందుకున్నారు. కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం, సిద్ధార్థ కళాపీఠం విశిష్ట పురస్కారాలూ పొందారు. 

బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లుఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో రైల్వేలకు రూ.1.31 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం జోన్లు, ప్రాజెక్టుల వారీ వివరాలను ఫిబ్రవరి 3న వెల్లడించింది. ఈ సారి కొత్త రైళ్లేవి లేకుండా కొత్త లైన్ల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించిన ప్రభుత్వం రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. 
ఏపీ, తెలంగాణకు కేటాయింపులు 
  • దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు.
  • ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు.( కొత్తపల్లి-మనోహరాబాద్‌కు రూ. 350 కోట్లు, బల్షారా-కాజీపేట- విజయవాడ మూడో లైన్‌కు రూ.260 కోట్లు).
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు రూ.3,406 కోట్లు.
  • ఇందులో విజయవాడ-అమరావతి-గుంటూరులను కలుపుతూ 106 కి.మీ. మేర నిర్మించే అమరావతి రైలు మార్గానికి రూ.2,680 కోట్లు.

తెలంగాణలో మహిళలకు స్త్రీ నిధి ఫోన్లుగామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు మొబైల్ ఫోన్లు అందించాలని స్త్రీ నిధి బ్యాంకు నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది రూ.50 కోట్లతో రాష్ట్రంలోని 84 వేల మందికి డిజిటల్ ఫోన్లను అందించనుంది. మొబైల్ ఫోన్ సమకూర్చుకునేందుకు స్త్రీ నిధి బ్యాంకు తరపున ఒక్కో మహిళకు రూ.6 వేల చొప్పున రుణం ఇవ్వనున్నారు. 

విజయవాడలో నౌకాదళ విన్యాసాలు విజయవాడ పున్నమి ఘాట్‌లో ఫిబ్రవరి 2 నుంచి 4 వరకూ మూడు రోజుల పాటు తొలిసారి నౌకాదళ విన్యాసాలు జరిగాయి. తూర్పు నావికాదళం, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ విన్యాసాలు నిర్వహించాయి. నౌకాదళంపై యువతలో ఆసక్తి పెంచే ఉద్దేశంతో ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. 

స్వాతంత్య్ర సమర యోధురాలు సామ్రాజ్యం కన్నుమూతవిశాఖకు చెందిన స్వాతంత్య్ర సమర యోధురాలు రాచర్ల సామ్రాజ్యం (98) ఫిబ్రవరి 6న కన్నుమూశారు. రాజమహేంద్రవరంలో గోపరాజు వెంకట సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు 1919లో జన్మించిన సామ్రాజ్యం 1932లో కాకినాడ రామారావుపేటకు చెందిన రాచర్ల రామచంద్రరావును వివాహమాడారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1944లో విజయవాడలో అరెస్టయి 6 నెలల పాటు రాయవెల్లూరు జైళ్లో ఉన్నారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ఆమెను తామ్రపత్రంతో సత్కరించింది.

ఏపీలో మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభంఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ సంస్కరణల్లో భాగంగా గుంటూరులో రూ.1.10 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్‌ను ఫిబ్రవరి 6న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇందులో పనిచేసే కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు ఖాకీ డ్రెస్ కాకుండా ముదురు నీలిరంగు ప్యాంటు, లేత నీలిరంగు షర్టు డ్రెస్‌కోడ్‌ను పాటిస్తారు. వారి షర్టుపై ‘ఐయామ్ ఏ కాప్’ అనే రేడియం స్టిక్కర్ ఉంటుంది. మహిళా కానిస్టేబుల్ ఖాకీ చీరపై ముదురు నీలి రంగు కోటు ధరిస్తారు. సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలు అందించారు.

ఎస్వీయూలో జాతీయ వీసీల సదస్సు అసోషియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ 91వ వార్షిక సదస్సు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 5 - 7 వరకు జరిగింది. సదస్సులో దేశవ్యాప్తంగా 300 మంది వీసీలు పాల్గొని ‘స్వాతంత్య్రం అనంతరం ఉన్నత విద్యారంగంలో మార్పులు, సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై చర్చించారు. టిబెట్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ స్టడీస్ మాజీ వీసీ ప్రొఫెసర్ సాంథోంగ్ రిన్‌పచీ సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చిన్నారులకు టెన్నిస్ అకాడమీ ఏర్పాటు చేసిన సానియా మీర్జాభారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చిన్నారుల కోసం ప్రత్యేక టెన్నిస్ శిక్షణ కేంద్రంను ప్రారంభించింది. ఫిబ్రవరి 6న జూబ్లిహిల్స్‌లో ప్రారంభమైన ఈ కేంద్రంలో 3 నుంచి 8 ఏళ్ల చిన్నారులకు శిక్షణ ఇస్తారు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ-SMTA 2013లో ఏర్పాటైంది.

2015లో ఏపీలో ప్రజల స్థితిగతులపై సెస్ నివేదిక 2015లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల స్థితిగతులపై సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ-SES నివేదిక విడుదల చేసింది. నెలవారీగా తలసరి వ్యయం, శిశు మరణాలు, 15 ఏళ్లలోపు పిల్లల అక్షరాస్యత, 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు పాఠశాలల్లో ఉండటం, నిరుద్యోగం వంటి అంశాల ఆధారంగా మానవాభివృద్ధి సూచీని ‘సెస్’ లెక్కగట్టింది. ఈ అంశాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు మినహా మిగతా జిల్లాల్లో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని వివరించింది. 
.
సెస్ మానవాభివృద్ధి సూచీలో జిల్లాల స్థానం 
జిల్లా
ర్యాంకు
కృష్ణా
1
పశ్చిమ గోదావరి
2
నెల్లూరు
3
చిత్తూరు
4
తూర్పు గోదావరి
5
గుంటూరు
6
వైఎస్సార్ కడప
7
ప్రకాశం
8
విశాఖపట్నం
9
విజయనగరం
10
కర్నూలు
11
శ్రీకాకుళం
12
అనంతపురం
13

జనవరి 2017 రాష్ట్రీయం

1.ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.1,07,532 ::
1) 2015-16లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,07,532 గా నమోదైంది. 
2) ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ నివేదిక విడుదల చేసింది. నివేదిక ప్రకారం రూ.1,40,628 తలసరి ఆదాయంతో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా రూ. 74,638 లతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది.
3) విశాఖపట్నం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలు రాష్ట్ర తలసరి ఆదాయం కన్నా ముందంజలో ఉన్నాయి.

2.హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ - 2017::
1) 7వ హైదరాబాద్ సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభమమయ్యాయి. 
2) జనవరి 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. 
3) ప్రముఖ హిందీ రచయిత అశోక్ వాజ్‌పేయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
4) హైదరాబాద్ లిటరరీ ట్రస్టు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తోంది. 

3.విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ::
1) విశాఖపట్నంలో 23వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII- Partnership Summit-2017) ప్రారంభమైంది. 
2) జనవరి 27 నుంచి 28 వరకు రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. 
3)50 దేశాలకు చెందిన అధికారులు, 2,500 మందికిపైగా పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో తొలిరోజు రూ.4.25 లక్షల కోట్ల విలువైన 128 ఒప్పందాలు కుదిరాయి.

4.తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు ::

1) తెలంగాణలోని బ్రాహ్మణుల సంక్షేమానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసింది. 
2) ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఛైర్మన్‌గా 17 మంది సభ్యులతో పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ జనవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది.

5.పాస్‌పోర్టుల జారీలో హైదరాబాద్‌కు రెండో స్థానం ::

1) 2016లో పాస్‌పోర్టుల జారీలో హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం దేశవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. 
2) గతేడాది దేశంలో 1.3 కోట్ల పాస్‌పోర్టులు జారీగా కాగా 6.6 లక్షల పాస్‌పోర్టుల జారీతో హైదరాబాద్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. 
3) లక్నో కార్యాలయం అత్యధిక పాస్‌పోర్టుల జారీతో మొదటి స్థానంలో నిలిచింది.

6.డాక్టర్ అబ్బూరి గోపాల కృష్ణ మృతి ::

1) బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అబ్బూరి గోపాల కృష్ణ (81) విశాఖపట్నంలో జనవరి 31న కన్నుమూశారు. 
2) విశాఖలో పుట్టిన ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నాటక విభాగం అధిపతిగా పని చేసి పదవీ విరమణ పొందారు.
3) నటన, రచన, రంగస్థల దర్శకత్వం, చిత్రలేఖనం, సాహిత్యం, సంగీతం వంటి విభిన్న రంగాల్లో అబ్బూరి రాణించారు


7.భక్త రామదాసు ఎత్తిపోతల ప్రారంభం ::
1) ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. 
2) ఈ మేరకు కొత్తూరు పంచాయతీ ఎర్రగడ్డ తండా వద్ద జనవరి 31న పథకాన్ని ప్రారంభించారు. 
3) ఈ ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని 60 వేల ఎకరాలకు నీరు అందుతుంది.

8.హైదరాబాద్‌లో ఫ్రాన్స్ వైమానిక నైపుణ్య శిక్షణ కేంద్రం ::
1) హైదరాబాద్‌లో వైమానిక నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం ఫ్రాన్స్‌కు చెందిన బోర్డ్‌యాక్స్ అనుబంధ సంస్థ ఏరో క్యాంపస్ ఆక్విటెన్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 27న ఒప్పందం కుదుర్చుకుంది. 
2) ఈ ఒప్పందంపై తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్; ఆక్విటెన్ సంస్థ జనరల్ మేనేజర్ జెరేమ్ వర్చేవ్ లు సంతకాలు చేశారు. 
3) ఈ శిక్షణ కేంద్రాన్ని రూ.200 కోట్ల వ్యయంతో బేగంపేట విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు.


9.టీఎస్‌లో చిన్న విమానాశ్రయాల అభివృద్ధికి ఒప్పందం::

1) తెలంగాణలో విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీతో జనవరి 18న ఒప్పందం చేసుకుంది. 
2) ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారకరామారావుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 
3) దీంతో 2016, అక్టోబర్‌లో పౌరవిమానయాన శాఖ ప్రారంభించిన ప్రాంతీయ అనుసంధాన పథకంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి అయింది. 
4) ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో విమానాశ్రయాలను నెలకొల్పుతారు. తద్వారా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లోని ప్రజలకు తక్కువ ధరకే విమానయాన అవకాశం లభిస్తుంది. 
5) ఆర్థికంగా, సాంకేతికంగా అనువుగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లను వినియోగంలోకి తీసుకొచ్చి.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ద్వారా చిన్న పట్టణాలకు విమాన సర్వీసులను నడుపుతారు.
6)  కొత్తగూడెం, వరంగల్‌తోపాటు మరో తొమ్మిది విమానాశ్రయాలను వినియోగంలోకి తేనున్నారు.

10.ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ పరిధి పెంపు ::
1) ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ- సీఆర్‌డీఏ పరిధిని రాష్ట్ర ప్రభుత్వం మరింత పెంచింది. 
2) అదనంగా 7 గ్రామాల్లోని 311.19 చదరపు కి. మీ.ను సంస్థ పరిధిలోకి చేర్చింది. 
3) దీంతో సీఆర్‌డీఏ పరిధి 8,914.51 చదరపు కి.మీ. లకు చేరింది. 

11.అమరావతిపై నేషనల్ జియోగ్రఫీ ఛానల్ డాక్యుమెంటరీ ::

1) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంపై నేషనల్ జియోగ్రఫీ ఛానల్ డాక్యుమెంటరీ తీయనుంది. 
2) ఈ మేరకు ఛానల్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జనవరి 18న నిర్ణయం తీసుకుంది.

12.మాంసం వినియోగంలో హైదరాబాద్ 'టాప్' ::

1) మాంసాహార వినియోగంలో హైదరాబాద్ దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. 
2) దేశవ్యాప్తంగా సగటున ఒక్కొక్కరు ఏడాదికి 5 కిలోల మాంసం వినియోగిస్తుండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 31 కిలోలు తీసుకుంటున్నారని తేలింది.
3) పౌల్ట్రీ ఫెడరేషన్, బ్రీడర్స్ అసోసియేషన్లు నిర్వహించిన సర్వే ఈ వివరాలు వెల్లడించింది.

13.2017-18 తెలంగాణ రుణ ప్రణాళిక రూ.65,590 కోట్లు ::
1)2017-18 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రుణ ప్రణాళికను జనవరి 20న నాబార్డు విడుదల చేసింది. 
2) మొత్తం రుణ ప్రణాళికను రూ.65,590 కోట్లుగా లెక్కించిన సంస్థ ఇందులోరూ.32,830 కోట్లను వ్యవసాయ రుణాల కింద చేర్చింది. ఇది 2016-17కన్నా 17 శాతం అధికం. 

14.కస్టమ్స్ కమిషనరేట్‌కు ఐఎస్‌వో గుర్తింపు ::

1) విజయవాడలోని కస్టమ్స్ కమిషనరేట్‌కు దేశంలోనే తొలిసారిగా ప్రతిష్టాత్మక ఐఎస్‌వో 15700: 2005 గుర్తింపు లభించింది. 
2) ఈ మేరకు జనవరి 20న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉత్తర్వులు జారీ చేసింది. 
3) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఎస్‌ఎం భట్నాగర్ ఈ గుర్తింపు పత్రాన్ని ఆవిష్కరించారు.

15.ఉమ్మడి హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు ::

1) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. 
2) ఈ మేరకు జిల్లా జడ్జీల కోటాలో డాక్టర్ షమీమ్ అక్తర్, జవలకర్ ఉమాదేవి, నక్కా బాలయోగి, తెల్లప్రోలు రజనీ లను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. 
3) వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 27కు చేరింది. నల్గొండకు చెందిన డాక్టర్ షమీమ్ ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు రిజిష్ట్రార్(జ్యుడీషియల్)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 
4) అనంతపురానికి చెందిన జె.ఉమాదేవి హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 
5) తూర్పుగోదావరికి చెందిన నక్కా బాలయోగి ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి కాగా, ప్రకాశం జిల్లాకు చెందిన టి.రజని హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్‌‌స జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

16.హైదరాబాద్‌లో అంతర్జాతీయ నృత్యోత్సవాలు ::

1) ప్రథమ ఏషియన్ బ్రాడ్ కాస్టింగ్ యూనియన్ (ఏబీయూ) ఇంటర్ నేషనల్ డ్యాన్‌‌స ఫెస్టివల్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు జనవరి 15న హైదరాబాద్‌లో ప్రారంభించారు. 
2) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నృత్యమనేది విశ్వవ్యాప్త భాష, ఇది మానసికోల్లాసాన్ని ప్రసాదిస్తుంది. 
3) సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం మన కర్తవ్యం అన్నారు. ఈ ఉత్సవాల్లో సుమారు పది దేశాలకు చెందిన 47 మంది కళాకారులు పాల్గొన్నారు.

17.రూర్బన్ పథకానికి ఏపీ నుంచి ఆరు మండలాల ఎంపిక ::

1) గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి వసతుల కల్పనకు ఉద్దేశించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తాజాగా ఆరు మండలాలు ఎంపికయ్యాయి. 
2) 2016-17 ఆర్థిక సంవత్సరానికి నందలూరు (వైఎస్సార్ జిల్లా), ఆలూరు (కర్నూలు), గరివిడి (విజయనగరం), సోంపేట (శ్రీకాకుళం), నూజెండ్ల (గుంటూరు), చందర్లపాడు (కృష్ణా)ను ఎంపిక చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అదనంగా మూడేళ్ల కాలంలో మండలానికి రూ.30 కోట్ల నిధులను సమకూర్చుతారు.
3)2015-16 సంవత్సరంలో ఈ పథకానికి కంబదూరు (అనంతపురం), కుప్పం(చిత్తూరు), సింగరాయకొండ(ప్రకాశం), వెంకటాచలం(నెల్లూరు), అరకు(విశాఖపట్నం) ప్రాంతాలు ఎంపికయ్యాయి.

18.పశ్చిమ గోదావరిలో బొగ్గు నిక్షేపాలు ::
1) పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) అన్వేషణలో తేలింది. 
2) జీఎస్‌ఐ ఆధ్వర్యంలో సౌత్ వెస్ట్ పినాకిల్, మహేశ్వరి సంస్థలు చింతలపూడి, శెట్టివారిగూడెం ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేసి 50-70 మీటర్ల లోతులోనే బొగ్గు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. 
3) చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల పరిధిలో భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపు 2 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా.

19.ప్రముఖ ఇరిగేషన్ ఇంజనీర్ టి. హనుమంతరావు కన్నుమూత ::

1) ప్రముఖ నీటిపారుదల శాఖ ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ), ఐక్యరాజ్యసమితి మాజీ సలహాదారు టి.హనుమంతరావు (86) జనవరి 8న హైదరాబాద్‌లో మరణించారు. 
2) ఆయన 1988లో ఏపీ రాష్ట్రానికి సాగునీటి శాఖ ఈఎన్‌సీగా వ్యవహరించారు. తక్కువ వ్యయంతో సత్ఫలితాలను ఇచ్చే చతుర్విధ జల ప్రక్రియను అభివృద్ధి చేశారు. 
3) 2000-2004 మధ్య ఏపీ రాష్ట్ర జలసంరక్షణ మిషన్ సాంకేతిక కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు.

20.తెలంగాణ వృద్ధి రేటు 10.02 శాతం ::
1) 2016-17 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 10.02 శాతంగా (రూ.2,14,608 కోట్లు) నమోదయింది. 
2) జాతీయ వృద్ధి రేటు 7.2 శాతం (రూ.54,70,837) కంటే ఇది ఎక్కువ. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ రూపొందించిన వృద్ధి రేటు నివేదికను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ జనవరి 7న విడుదల చేశారు.
3) జాతీయ స్థాయితో పోల్చినప్పుడు ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రాష్ట్రం 4.7 శాతం వృద్ధి సాధించింది. జాతీయ వృద్ధి రేటు 2.5 శాతం.
4) ద్వితీయ రంగాలైన ఉత్పత్తి రంగంలో జాతీయ వృద్ధి రేటు 8.1 శాతం కంటే ఎక్కువగా 8.3 శాతం వృద్ధి నమోదైంది.
5) తృతీయ రంగాలైన ఆర్థిక, స్థిరాస్తి, వృత్తి సేవల రంగాల్లో రాష్ట్రం అత్యధికంగా 13.1 శాతం వృద్ధి రేటు సాధించింది. ఈ రంగాల్లో జాతీయ వృద్ధి రేటు 8.8 శాతమే.
6) వ్యాపారం, రవాణా, హోటల్, కమ్యూనికేషన్, ప్రసార సేవల రంగాల్లో రాష్ట్రం 10.4 శాతం వృద్ధి రేటును నమోదు చేయగా, జాతీయ వృద్ధి 7.6 శాతంగా నమోదైంది.


21.పరిశ్రమల సంఖ్యలో తెలంగాణకు 6వ స్థానం ::
1) పరిశ్రమల సంఖ్య పరంగా తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. స్థూల పారిశ్రామిక ఉత్పత్తుల పరంగా రూ.35,985 కోట్లతో 9వ స్థానం సంపాదించింది. 
2) ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012-13, 2013-14 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతం సాధించిన పారిశ్రామిక పురోగతిపై ప్రణాళిక శాఖ రూపొందించిన నివేదికను జనవరి 7న ఆవిష్కరించారు. 
3) 2012-13లో రాష్ట్రంలో 10,279 పరిశ్రమలుండగా 2013-14లో 11,068 కి పెరిగాయి. మొత్తం 7.45 లక్షల మంది వీటిల్లో పనిచేస్తున్నారు.

4) పారిశ్రామిక ఉత్పత్తి పరంగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. పారిశ్రామికపరంగా అన్ని అంశాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, మెదక్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 
5) రంగారెడ్డి జిల్లాలో 36.58 శాతం పరిశ్రమల్లో 34.25 శాతం మంది కార్మికులు, మెదక్ జిల్లాలో 12.84 శాతం పరిశ్రమల్లో 15.51 శాతం మంది కార్మికులు పనిచేస్తున్నారు. 

22.తెలంగాణలో అనాథ పిల్లలకు ఎస్సీ హోదా ::

1) తెలంగాణ రాష్ట్రంలోని అనాథ పిల్లలకు ఎస్సీ హోదాతో పాటు ఎస్సీ రిజర్వేషన్‌ను కలించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జనవరి 5న ప్రకటించారు. 
2) ఎస్సీ రిజర్వేషన్లు తగ్గించకుండానే వారికి అదనపు కోటా కల్పిస్తామని తెలిపారు. 
3) ఈ సందర్భంగా ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందడంలో అనాథలు ఎదుక్కొంటున్న ఇబ్బందులను కూడా తొలగించనున్నట్లు తెలిపారు.

23.తిరుపతిలో చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ::

1) తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ను జనవరి 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 
2) ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నోబెల్ పురస్కారాన్ని సాధించే తెలుగు శాస్త్రవేత్తలకు ప్రభుత్వం తరుపున రూ.100 కోట్ల నగదు పారితోషికాన్ని అందిస్తామని ప్రకటించాడు. 
3) ఈ కార్యక్రమానికి జపాన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత టకాకి కజిటా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

24.ఒంటరి మహిళలకు రూ.1000 జీవన భృతి ::

1) సంపాదించే అండలేని ఒంటరి పేద మహిళలకు ఆర్థిక చేయూతనందించే కొత్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. 
2) ఒంటరి జీవితం గడుపుతున్న పేద మహిళలకు జీవన భృతిగా నెలకు రూ.1000 చొప్పున అందించనున్నట్లు సీఎం కేసీఆర్ జనవరి 6న అసెంబ్లీలో ప్రకటించారు. 
3) ఈ పథకానికి మార్చిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. 

25.కృష్ణా జిల్లాలో ఎన్డీఆర్‌ఎఫ్ బెటాలియన్ ఏర్పాటు ::

1) జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్) పదో బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌కు జనవరి 9న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేశారు. 
2) దీనిని కృష్ణా జిల్లా కొండపావులూరులో 50 ఎకరాల్లో నిర్మించనున్నారు. 
3) విపత్తుల సమయంలో జరిగే నష్టాన్నిపూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో National Disaster Response Force ను 2006లో ఏర్పాటు చేశారు. 

26.విశాఖపట్నంలో ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు ::

1) విశాఖపట్నంలో 20వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును జనవరి 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 
2) రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశ నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

27.‘హాక్-ఐ’ యాప్‌కు జాతీయ అవార్డు::

1) బాధితులకు తక్షణ సహాయం అందించడానికి హైదరాబాద్ పోలీసులు రూపొందించిన మొబైల్ యాప్ ‘హాక్-ఐ’ నేషనల్ ఈ- గవర్నెన్‌‌స గోల్డ్ అవార్డు గెల్చుకుంది. 
2) జనవరి 10న విశాఖపట్నంలో జరిగిన ట్రాన్‌‌సఫార్మింగ్ ఇండియా సదస్సులో కేంద్ర మంత్రి పీపీ చౌదరి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి ఈ అవార్డును అందచేశారు. 
3) ‘ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ మొబైల్ టెక్నాలజీ’ అనే అంశంలో ఈ అవార్డు దక్కింది. 
4) ‘హాక్-ఐ’ యాప్‌కు గత ఏడాది మార్చిలో ‘సోషల్ మీడియా ఫర్ ఎంపవర్‌మెంట్-2016’ అంతర్జాతీయ అవార్డు లభించింది.

28.తెలంగాణ కొత్త సీఎస్‌గా ఎస్‌పీ సింగ్ ::

1) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనూతన ప్రధాన కార్యదర్శిగా శేఖర్ ప్రసాద్ సింగ్ జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. 
2) నవంబర్ 30న సీఎస్‌గా ఎంపికైన ప్రదీప్ చంద్ర డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అయిన ఎస్‌పీ సింగ్‌ను సీఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
3) 1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎస్పీ సింగ్ బీహార్‌కు చెందిన వారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేశారు.
4) స్పెషల్ సీఎస్ హోదా కూడా పొందారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ‘మిషన్ భగీరథ’ప్రాజెక్టు పురోగతిలో ముఖ్య పాత్ర పోషించారు.

29.ఏపీలోని మోరి గ్రామంలో ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభం
::
1) తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఫైబర్‌గ్రిడ్ పెలైట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 29న ఆవిష్కరించారు. 
2) తద్వారా ఏపీలో తొలి ఫైబర్ గ్రిడ్ గ్రామంగా, తొలి డిజిటల్ గ్రామంగా మోరి నిలవనుంది. 
3) To Home scheme ద్వారా రూ.149 కే ఇంటర్‌నెట్, 250కి పైగా చానళ్లు, ప్రపంచంలో ఎక్కడికైనా వీడియో కాల్ వంటి సదుపాయాలు కల్పిస్తారు.
4) ఈ సందర్భంగా రాష్ర్టంలో తొలి బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా మోరిని ప్రకటించారు.


30.నెల్లూరు జిల్లాలో ఎన్‌సీఈఆర్‌టీ కేంద్రానికి భూమి పూజ ::

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెంలో 55 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) కేంద్రానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిసెంబర్ 27న భూమి పూజ చేశారు.

31.కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్స్ సభ్యురాలిగా కవిత ::

1) కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్స్ (సీడబ్ల్యూపీ) సభ్యురాలిగా నిజామాబాద్ ఎంపీ కవిత నియమితులయ్యారు. 
2) ఈ మేరకు కామన్వెల్త్ పార్లమెంటరీ సంఘం భారత చైర్‌పర్సన్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ డిసెంబర్ 28న నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 
3) సీపీఏలో భాగమైన సీడబ్ల్యూపీలో సభ్యురాలిగా కవిత.. నియామక తేదీ నుంచి మూడేళ్లపాటు కొనసాగనున్నారు. 
4) అలాగే ఏపీ నుంచి ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరో సభ్యురాలిగా నియమితులయ్యారు.

32.ఏపీలో ‘ఆరోగ్య రక్ష’ బీమా పథకం ప్రారంభం::

1) రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ‘ఆరోగ్య రక్ష’ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 1న విజయవాడలోని తుమ్మలపల్లిలో ప్రారంభించారు. 
2) ఈ పథకంలో భాగంగా నెలకు రూ.100 చొప్పున ఏటా 1200 చెల్లించిన వారికి రూ.2 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తారు. 
3) ఇది ప్రభుత్వం అందించే ఏ ఆరోగ్య పథకంలో లేని వారికి వర్తిస్తుంది. పథకంలో చేరాలనుకునేవారు ఫిబ్రవరి 28 లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి.

33.హైదరాబాద్‌లో నుమారుష్ 2017 ప్రారంభం ::

1) 77వ అఖిల భారత పారిశ్రామిక వస్తుప్రదర్శన-2017 హైదరాబాద్‌లో జనవరి 1న ప్రారంభమైంది. 
2) ఇది ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. ఇందులో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా తయారయ్యే వస్తువులను ప్రదర్శిస్తారు. 
3) ఏటా తెలంగాణ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహించే నుమాయిష్ 77 సంవత్సరాల కింద ప్రారంభైమైంది.

34.తిరుపతిలో భారత ఆర్థిక సదస్సు::

99వ భారత ఆర్థిక సంఘం వార్షిక సదస్సును తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు డిసెంబర్ 27న ప్రారంభించారు.

35.తిరుపతిలో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్::

1) తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 3న ప్రారంభించారు.
2)  ‘దేశాభివృద్ధికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం’ (Science & Technology for National Development) అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
3) జనవరి 7 వరకు జరగనున్న సదస్సుకు దేశ విదేశాల నుంచి 12,000 మంది ప్రతినిధులు, 500 మంది శాస్త్రవేత్తలు, 6 మంది నోబెల్ గ్రహీతలు హాజరవుతున్నారు.