Friday, 1 December 2017

నవంబర్ 2017 రాష్ట్రీయం

గోదావరి-కావేరీ నదుల అనుసంధానానికి ప్రణాళిక గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు ప్రణాళిక రూపకల్పన కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నవంబర్ 23న చెప్పారు. మిగులు జలాల్ని గోదావరి నది నుంచి కృష్ణకు, అక్కడి నుంచి పెన్నా.. చివరకు కావేరీకి తరలించాలని జల వనరుల శాఖ నిర్ణయించిందని ఆయన వివరించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, వారి అనుమతితో ప్రణాళికను ఖరారు చేస్తామని.. ఈ ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా పరిగణించి.. 90 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని తెలిపారు. అలాగే.. చెన్నై - బెంగళూరుల మధ్య రూ. 20 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తామని ప్రకటించారు. 


పళని-పన్నీర్‌లకు ‘రెండాకుల’ గుర్తు కేటాయింపుఅన్నాడీఎంకే పార్టీ అధికారిక చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంల వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నవంబర్ 23న నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల్లో అత్యధికులు పళనికే మద్దతు ఇస్తున్నందున ఆ వర్గానికే గుర్తు కేటాయించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రెండాకుల గుర్తును పళని వర్గానికి కేటాయిస్తున్నట్లు పేర్కొంది. రెండాకుల గుర్తు కోసం ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ, దినకరన్ తీవ్రంగా పోరాడారు. 
ఇది రెండోసారి..!అన్నా డీఎంకే పార్టీ ఎన్నికల చిహ్నంగా రెండాకుల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) పునరుద్ధరించడం ఇది రెండోసారి. ఒక పార్టీ ఎన్నికల చిహ్నాన్ని రెండుసార్లు నిలిపివేసి మళ్లీ కేటాయించడం ఏఐఏడీఎంకే విషయంలోనే జరిగింది. 


కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ స్టేజ్ - 2 అనుమతులు ఇచ్చింది. దీంతో.. అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తయింది. ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లు, టన్నెళ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా రెవెన్యూ భూముల బదలాయింపు.. ఆ భూముల్లో నిర్దేశించిన మేర తిరిగి మొక్కల పెంపకానికి సంబంధించి ప్రభుత్వం రూ.722.30 కోట్లు మంజూరు చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంది. డిసెంబర్ నాటికి పర్యావరణ తుది అనుమతులు వచ్చే అవకాశముంది. 
రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లోని సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతోపాటు 18.82 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా రూ.80,499.71 కోట్ల వ్యయ అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. 


ఏపీలో సునామీ మెగా మాక్ డ్రిల్ సునామీల సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది కోస్తా జిల్లాల్లో నవంబర్ 24న మెగా మాక్ డ్రిల్ నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ విపత్తుల శాఖ, రాష్ట్ర విపత్తుల శాఖ, ఇన్కొయిస్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సునామీ వస్తున్నట్టుగా ఇన్కొయిస్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, రాష్ట్ర విపత్తుల శాఖ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ 9 కోస్తా జిల్లాల్లో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మాక్ ఎక్సర్‌సైజ్ చేపట్టారు. 
కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ మెగా మాక్ డ్రిల్ జరిగింది. 

అవయవదానంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అవయవదానంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇందుకు గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్‌‌సప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌వోటీటీవో) ఈ అవార్డును ప్రకటించింది. నవంబర్ 27న ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’ సందర్భంగా ప్రభుత్వం తరఫున జీవన్‌ధాన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్నారు. 
తమిళనాడును దాటేసి.. తమిళనాడు జనాభా 8 కోట్లు కాగా.. తెలంగాణ జనాభా 3.5 కోట్లు. తమిళనాడులో గత 11 ఏళ్లలో 5,367 అవయవాలను సేకరించి దేశంలోనే తొలి స్థానంలో ఉంది. తెలంగాణలోని నిమ్స్ జీవన్‌దాన్ ఆధ్వర్యంలో 2013 నుంచి 2017 అక్టోబర్ వరకు 414 మంది దాతల నుంచి 1,675 అవయవాలను సేకరించారు. గతేడాది వరకు రెండోస్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి తొలిస్థానంలో నిలిచింది. కేరళ ఇప్పటివరకు 701 అవయవాలు సేకరించి మూడోస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 


మధ్యప్రదేశ్‌లో చిన్నారులపై రేప్‌కు మరణశిక్షమధ్యప్రదేశ్‌లో ఇటీవల అత్యాచార ఘటనలు పెరిగిపోతుండటంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12 ఏళ్లు అంతకన్నా తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా చట్టం రూపకల్పనకు అంగీకరించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో నవంబర్ 26న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. 


హైదరాబాద్‌లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుభారత్‌లో తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు 2017 నవంబర్ 28న హైదరాబాద్‌లో ప్రారంభమయింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు, కూతురు ఇవాంకా ట్రంప్‌తో కలిసి ప్రారంభించారు.
బెంగళూరుకు చెందిన కంపెనీ తయారు చేసిన ‘మిత్ర’ రోబో సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్వాగతోపన్యాసం చేయగా మోదీ, ఇవాంకా సదస్సును ఆరంభించి మాట్లాడారు. అంనతరం ‘బీ ద చేంజ్.. విమెన్‌‌స ఎంట్రప్రెన్యురల్ లీడర్‌షిప్’ అంశంపై పలువురు చర్చించారు. 


హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభంహైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో కలసి నవంబర్ 28న ప్రారంభించారు. అనంతరం మెట్రో పైలాన్, మెట్రో జర్నీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘టి-సవారీ’ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. తర్వాత మెట్రో రైలులో ప్రయాణించిన మోదీ అక్కడి నుంచి ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు(జీఈఎస్) జరిగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)కి బయల్దేరి వెళ్లారు.
మెట్రో తొలిదశలో నాగోల్-అమీర్‌పేట్ (17 కి.మీ), మియాపూర్-అమీర్‌పేట్ (13 కి.మీ) మొత్తంగా 30 కి.మీ. మార్గంలో రవాణా సేవలు ప్రారంభమయ్యాయి. ఈ మార్గాల్లో మొత్తం 24 స్టేషన్లున్నాయి. మెట్రో రైలులో ప్రయాణించేందుకు స్మార్ట్‌కార్డు నెబ్యులా, టికెట్, టోకెన్‌లను ప్రవేశపెట్టారు.
మెట్రో రైలు ప్రారంభంలో లోకో పైలట్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేపరాల గ్రీష్మ ఉన్నారు. దీంతో ఆమె దేశంలోనే మెట్రో తొలి మహిళా లోకోపైలట్‌గా రికార్డులకెక్కారు.


దేశంలోనే తొలిసారి చెన్నైలో జీఐఎస్ సర్వేదేశంలోనే తొలిసారిగా చెన్నైలో భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) మ్యాపింగ్ సర్వే 2017 నవంబర్ 21న ప్రారంభించారు. రెండు డ్రోన్లతో 120 రోజుల్లో నగరంలోని రహదారులు మొదలు వీధి దీపాల వరకు అన్ని వివరాలను ఈ సర్వేలో నమోదు చేస్తారు.

లక్కంపల్లిలో పతంజలి’ యూనిట్నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లిలో పతంజలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు బాబా రామ్‌దేవ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ, తెలంగాణ టీఎస్‌ఐఐసీ ఎండీ ఇ.వి.నర్సింహారెడ్డి నవంబర్ 15న ఎంఓయూ కుదుర్చుకున్నారు. తెలంగాణలో విత్తనాభివృద్ధి, జంతువుల దాణా ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కూడా పతంజలి సంస్థ ఆసక్తి కనబరిచింది.
లక్కంపల్లిలో ఏర్పాటు చేయనున్న ఆహార శుద్ధి కర్మాగారంలో పసుపు, మిర్చి, మక్కలు, సోయా తదితర సుగంధ ద్రవ్యాలు, తృణ ధాన్యాల్ని సేకరించి శుద్ధి చేస్తారు. యూనిట్‌కు కావలసిన పసుపు, మిరప, సోయా, మక్కలు ఆ ప్రాంతంలోనే కొనుగోలు చేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరకడంతో పాటు ఆ ప్రాంత రైతులకు పంటలను ఒకేసారి అమ్ముకోడానికి వీలవుతుంది.


గోదావరి పుష్కరాలు’ డాక్యుమెంటరీకి అవార్డుతూర్పు గోదావరి జిల్లా గోదావరి పుష్కరాలు’ పేరుతో తీసిన డాక్యుమెంటరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవార్టు ప్రకటించింది. అమరావతిలో నవంబర్ 14న వివిధ పేర్లతో ప్రకటించిన వివిధ కేటగిరీల్లో గోదావరి పుష్కరాలు’కు 2015 ఏడాదికిగాను ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ అవార్డు వరించింది. ఈ డాక్యుమెంటరీ తీసిన నిర్మాత, దర్శకుడి పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. 


ఏపీకి మరో 28 ఐఏఎస్ పోస్టులుఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఏఎస్ పోస్టుల సంఖ్య పెరిగింది. కేడర్ రివ్యూలో భాగంగా కొత్తగా 28 ఐఏఎస్ పోస్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ నవంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 239కి పెరిగింది. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెండు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులు ఉండగా కేడర్ రివ్యూలో భాగంగా మూడు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులు వచ్చాయి. 


తెలంగాణకు ఇండియా టుడే అవార్డులు ఆర్థిక రంగం, స్వచ్ఛతలో పురోగతికి గుర్తింపుగా తెలంగాణకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఇండియా టుడే ఏటా నిర్వహిస్తున్న స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్-2017 సదస్సు నవంబర్ 16న ఢిల్లీలో జరిగింది. ఆర్థిక, స్వచ్ఛత రంగాల్లో పురోగతికి రాష్ట్రానికి రెండు బెస్ట్ పెర్ఫార్మింగ్ లార్జ్ స్టేట్ అవార్డులు ప్రదానం చేసింది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మంత్రులు కేటీఆర్, జోగు రామన్న అందుకున్నారు. 


ఈ-నామ్‌లో తెలంగాణకు అగ్రస్థానంఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.7,454 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని కేంద్ర వ్యవసాయశాఖ నవంబర్ 16న ప్రకటించింది. 18.71 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్ ద్వారా వ్యాపారులకు అమ్ముకున్నారని పేర్కొంది. ఇలా రాష్ట్రంలో 44 మార్కెట్ల ద్వారా ఈ-నామ్‌ను విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాలను పోల్చుతూ తెలంగాణలో ఈ-నామ్ అమలు తీరును కేంద్రం తన నివేదికలో ప్రస్తావించింది. 
ఒడిశాలో ఈ-నామ్ మార్కెట్లకు వచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల్లో కేవలం 2 శాతం మాత్రమే ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించగా, తెలంగాణలో ఏకంగా 85 శాతం ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారానే విక్రయించారు. ఏ రాష్ట్రంలోనూ ఆన్‌లైన్ ద్వారా ఈ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరగలేదని కేంద్ర నివేదికలో ప్రస్తావించారు. 


అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ షరతులుఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పలు షరతులు విధించింది. సుస్థిరమైన అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ కూడా ఒక భాగమనే విషయం గుర్తించాలని పేర్కొంది. నదుల సహజ ప్రవాహ దిశను మార్చడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. వరద ముంపు ప్రాంతాల్లో మార్పులు చేపట్టాలంటే అందుకు సంబంధించి అధ్యయనం చేయాలని తెలిపింది. పర్యావరణ అనుమతి (ఈసీ)కి అదనంగా పలు షరతులు విధించింది. తమ ఆదేశాల అమలుకు వీలుగా, పర్యావరణ పరిరక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ తెలిపింది. ఈ మేరకు ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం 145 పేజీల తీర్పును నవంబర్ 17న వెలువరించింది. 
ఈసీకి అదనంగా విధించిన ముఖ్యమైన షరతులు..
  • నది గానీ, సహజ వరద నీటి ప్రవాహ పద్ధతిని గానీ, ప్రవాహ దిశను గానీ మార్చేందుకు అనుమతి లేదు. ప్రవాహ దిశను స్ట్రెయిట్‌గా చేయడానికి అనుమతించడం లేదు. అలాంటి మార్పుల వల్ల నేల కోతకు గురవుతుంది. భూగర్భ నీరు తగ్గుతుంది.
  • కొండవీటి వాగు, దాని ఉప వాగులు, ఇతర వరద కాలువల పరీవాహక ప్రాంతంలో నీటి సంరక్షణ దిశగా చర్యలు చేపట్టాలి. ఉపరితలంపై ప్రవాహ వేగం తగ్గించేందుకు, భూగర్భ నీటి నిల్వ పెంచేందుకు అటవీకరణ చేపట్టాలి.
  • రాజధాని నగరంలో ఉన్న 251 ఎకరాల అటవీ స్థలాన్ని సంరక్షించాలి. అటవీయేతర అవసరాలకు వినియోగించరాదు. కనీసం పార్కులు, వినోద కార్యక్రమాలకు ఆ భూమిని వినియోగించరాదు.


ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ సమావేశం - 2017 ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ శిఖరాగ్ర సమావేశం - 2017 విశాఖపట్నంలో నవంబర్ 15-17 వరకు జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయరంగంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేస్తామని బిల్‌గేట్స్ ప్రకటించారు. భారత్‌లో మూడు అంశాల్లో తమ ఫౌండేషన్ ఆసక్తి చూపుతోందని చెప్పారు. సామాజికాభివృద్ధి, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం, ప్రపంచానికి ఎంతో అవసరమైన ఆహార ఉత్పత్తిని పెంచడం తమ ఫౌండేషన్ లక్ష్యాలన్నారు.


తెలంగాణలో రెండో అధికార భాషగా ఉర్దూ రాష్ట్రవ్యాప్తంగా ఇకపై రెండో అధికార భాషగా ఉర్దూ చలామణిలోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ అధికార భాషల చట్ట సవరణకు శాసనసభ నవంబర్ 16న ఆమోదముద్ర వేసింది. 1966లోనే ఉర్దూను రెండో భాషగా ప్రకటించినా అప్పట్లో ఇది జిల్లా యూనిట్‌గా అమలైంది. పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 31 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యూనిట్‌గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా ఉర్దూను రెండో అధికార భాషగా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది.


బొటానికల్ గార్డెన్‌లో పాలపిట్ట సైక్లింగ్ పార్కు హైదరాబాద్ కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌ను రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా సైక్లింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని అన్నారు.


ఏపీలో స్థానికత మరో రెండేళ్లు పెంపుఉద్యోగ, విద్య రంగాల్లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలి వచ్చిన వారికి మరో రెండేళ్ల పాటు స్థానికతకు అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి మూడేళ్లలోగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి మాత్రమే స్థానికతకు అర్హత ఉంటుందని గతంలో ఉత్తర్వులిచ్చారు. అయితే, ఉద్యోగ సంఘాల నుంచి మరో రెండేళ్ల పాటు స్థానికతకు అర్హత కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మరో రెండేళ్లలోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి స్థానికత అర్హత కలిగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌లో ఐటీ వరల్డ్ కాంగ్రెస్ప్రతిష్టాత్మక వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సుకు హైదరాబాద్ వేదికవుతోంది. ఫిబ్రవరి 19- 21 తేదీల్లో హెచ్‌ఐసీసీలో ఈ కార్యక్రమం జరుగనుంది. 80 దేశాల నుంచి 5,000 మంది వివిధ రంగాల నిపుణులు హాజరవుతారని టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నాని నవంబర్ 19న తెలిపారు. భారత సిలికాన్ వ్యాలీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ప్రోత్సహించేందుకు ఈ సదస్సులు జరుపుతున్నట్టు వెల్లడించారు. 


ఏపీలో ఆంధ్రాబ్యాంకు ఎస్‌బీజీ పథకం ప్రారంభం ఆంధ్రాబ్యాంకు రూపొందించిన పట్టాభి సీతారామయ్య స్వయం వ్యాపార సంఘాల పథకం’ (ఎస్‌బీజీ)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 21న విజయవాడలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య పేరుతో స్వయం సహాయక సంఘాల తీరుతెన్నులను మార్చే విధంగా పథకం ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ఎస్‌బీజీ పథకం ద్వారా 184 గ్రూపులకు చెందిన 1100 మంది మహిళలకు రూ.13.14 కోట్ల మేర రుణాలు అందించామన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను మ్యారేజ్ మిత్రలుగా నియమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 

మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్మత్స్యకారులందరికీ 50 ఏళ్లకే పింఛను సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఈ మేరకు ప్రకటించారు. 


హైదరాబాద్‌లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్‌లో నవంబర్ 14న ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిత్రోత్సవ చైర్మన్ ముకేష్ ఖన్నా, సీఈవో శ్రావణ్‌కుమార్, ప్రత్యేక అతిథి శ్రద్ధాకపూర్ (బాలీవుడ్ నటి) తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరంపై ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులు రద్దు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నింటినీ ఆపేయాలంటూ గత నెల 5న ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ప్రధాన బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు రద్దు చేసింది. పనులు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే పర్యావరణ అనుమతులు వచ్చేంత వరకు కాలువలు, పిల్ల కాలువల నిర్మాణ పనులతోపాటు ఇతర అనుబంధ పనులను మాత్రం చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటవీ అనుమతులు వచ్చేంత వరకు అటవీ భూములను తాకరాదని సూచించింది. ఈ ప్రాజెక్టు కారణంగా అటవీ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా కూలరాదని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఇప్పటికే ఏవైనా పనులు చేపట్టి ఉంటే కేవలం తాగునీటి అవసరాలకే వాటిని పరిమితం చేయాలని స్పష్టం చేసింది. 


ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూతఒగ్గు కథా పితామహుడు, పల్లె సుద్దులకు జీవం పోసిన మహనీయుడు చుక్క సత్తయ్య (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నవంబర్ 9న జనగామ జిల్లాలోని తన స్వగ్రామం మాణిక్యాపురంలో తుదిశ్వాస విడిచారు. 
జనగామ జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురంలో ఆగయ్య-సాయమ్మ దంపతులకు 1935 మార్చి 29న సత్తయ్య జన్మించారు. కులవృత్తి అయిన ఒగ్గు కళను నేర్చుకుని 14 ఏళ్ల నుంచే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఒగ్గుకళను సరికొత్త తీరాలకు చేర్చారు. ఒగ్గు కథల రూపంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కుటుంబ నియంత్రణ, వరకట్న నిషేధం, వయోజన విద్య, మద్యపాన నిషేధం, కేంద్ర ప్రభుత్వం 20 సూత్రాల పథకాలపై ప్రదర్శనలు ఇచ్చారు.
అవార్డులు.. 
  • 2004లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
  • 2005లో అప్పటి గవర్నర్ సుశీల్‌సుమార్ షిండే చేతుల మీదుగా కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
  • తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్
  • ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వెంగళరావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నర్సింహరావు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా చేతుల మీదుగా సన్మానాలు
  • తమిళనాడు ప్రభుత్వం నుంచి కళాసాగర్ అవార్డు
  • 2014లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం
  • 2014లో తానా అవార్డు
  • ఏపీ ప్రభుత్వం నుంచి రాజీవ్ సాగర్ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం నుంచి కీర్తి పురస్కార్
  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015లో ఉత్తమ కళాకారుడి అవార్డు


ప్రయాణికుల సదుపాయాల్లో సికింద్రాబాద్ స్టేషన్ నంబర్ 1 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రయాణికుల సదుపాయాల కల్పనలో దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ మేరకు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన కేంద్ర రైల్వే ప్రయాణికుల సదుపాయాల కమిటీ కితాబు నిచ్చింది. తాము ఇప్పటివరకు పరిశీలించిన 600 రైల్వేస్టేషన్‌లలో సికింద్రాబాద్ చాలా బాగుందని, విమానాశ్రయం తరహాలో సదుపాయాలు ఏర్పాటు చేశారని కమిటీ ప్రతినిధులు ప్రశంసించారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికులకు అందజేసే సదుపాయాలపై ఈ కమిటీ విసృ్తతస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తుంది. 

తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా మహేందర్‌రెడ్డిరాష్ట్ర ఇన్‌చార్జ్ డీజీపీగా మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. అనురాగ్ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో డీజీపీగా హైదరాబాద్ పోలీసు కమిషనర్, 1986 బ్యాచ్‌కు చెందిన ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావును హైదరాబాద్ ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. 
అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహదారుగా నియమిస్తూ సంబంధిత ఫైల్‌పై సీఎం సంతకం చేశారు. 


కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌లలో ఐటీ హబ్స్కరీంనగర్‌లో ఐటీ హబ్ ఏర్పాటు కోసం రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదముద్ర వేశారు. కరీంనగర్‌తోపాటు ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌లకు కూడా ఐటీ టవర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. 

కృష్ణా నది బోటు ప్రమాదంలో 17 మంది మృతి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో నవంబర్ 12న బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. ఏడుగురి జాడ తెలియకుండా పోయింది. ప్రమాద సమయంలో 15 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మృతుల్లో ఎక్కువ మంది ప్రకాశం జిల్లా ఒంగోలు రంగరాయ చెరువు వాకర్స్ క్లబ్‌కు చెందినవారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతులను చూసేందుకు వెళుతుండగా బోటు బోల్తా పడింది. అనుమతిలేకుండా నిర్వహిస్తున్న బోటు మితిమీరిన సంఖ్యలో పర్యాటకులను ఎక్కించుకోవడం.. బోటు సిబ్బందికి తగిన నైపుణ్యం లేకపోవడం, నదీ మార్గంపై డ్రైవర్‌కు అవగాహన లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు.


ఆంగ్ల వెబ్‌సైట్‌లో సింగరేణి ఉద్యోగి పదాలుసింగరేణిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న యార్లగడ్డ పోలీస్ రాసిన పదాల (Words)కు ప్రఖ్యాత ఆంగ్ల వెబ్‌సైట్‌లో చోటు దక్కింది. అమెరికాకు చెందిన ఎ కలెక్షన్ ఆఫ్ వరల్డ్ అడిటీ అండ్ ట్రివియా (A COLLECTION OF WORLD ODDITY AND TRIVIA) వెబ్‌సైట్ ఆయన రాసిన పది పదాలు ప్రచురించేందుకు సమ్మతించింది. ఈ పదాలు పోటీ పరీక్షలు, సినిమాలు, క్విజ్, స్క్రాబుల్, ఫన్‌విత్ వర్డ్స్, ప్యాన్‌గ్రామ్, క్రాస్‌వర్డ్ ఫజిల్, రేబస్ వంటి ఆటలకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
యార్లగడ్డ గతంలో ఆసియాలో అతిపొడవైన పాలిన్‌డ్రోమ్, క్రాస్‌వర్డ్ పజిల్(పదకేళి) తయారు చేసినందుకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, చైనా బుక్ ఆఫ్ రికార్డు, నేపాల్ బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ సింగపూర్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. 


కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర అనుమతికాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అంతర్రాష్ట్ర అనుమతులు (ఇంటర్ స్టేట్ క్లియరెన్‌‌స) ఇస్తూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నవంబర్ 3న ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ, హైడ్రాలజీ అనుమతులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో 2016 ఆగస్ట్ 23న ఒప్పందం కుదుర్చుకుంది. దీంతోపాటు తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత, ప్రాజెక్టులో చేపట్టే రిజర్వాయర్ల సామర్థ్యంపై కేంద్ర జల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా చేపట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మరియు 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరగడంతో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 45 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. తమ్మిడిహెట్టితో తెలంగాణలో రెండు లక్షల ఎకరాలకు, మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చంద్రాపూర్ జిల్లాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర అంతరాష్ట్ర ఒప్పందం చేసుకుంది.


హైదరాబాద్‌లో అర్బన్ మొబిలిటీ ఇండియా సదస్సునగరీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో సుస్థిర రవాణా వ్యసవ్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో నవంబర్ 4 నుంచి 6 వరకు జరిగిన అర్బన్ మొబిలిటీ ఇండియా సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన కీలకోపన్యాసం చేశారు. 
సదస్సులో 56 దేశీయ నగరాలు, 30 విదేశీ నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థ తీరుతెన్నులపై ప్రదర్శనలిచ్చారు.
ఈ సదస్సును కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పనిచేసే Institute of Urban Transport (India) 2006 నుంచి ఏటా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక పరిణామాలతో నగరాల్లో మెరుగైన రవాణా వ్యవస్థలను కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇండియా తర్వాతి సదస్సును 2018 నవంబర్ 2 నుంచి 4 వరకు నాగపూర్‌లో నిర్వహించనున్నారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాపై అవార్డులు
బెస్ట్ సిటీ
:సూరత్ మున్సిపల్ కార్పొరేషన్
బెస్ట్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్‌‌సపోర్ట్
: మైసూర్
బెస్ట్ అర్బన్ ట్రాన్‌‌సపోర్ట్ ప్రాక్టీసెస్
: జీహెచ్‌ఎంసీ, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్


తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ విడుదలనవంబర్ 4న ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా-2017 సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసెంగ్ పాలసీని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విడుదల చేశారు. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు లక్షా 25 వేల ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
ఈ సదస్సులో కేటీఆర్ వివిధ సంస్థలతో సుమారు రూ.7,200 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బికనీర్‌వాలా, ప్రయాగ్ న్యూట్రియన్‌‌స ఫుడ్, అన్నపూర్ణ ఫుడ్‌‌స, కరాచీ బేకరీస్, బ్లూక్రాఫ్ట్ ఆగ్రో, సంప్రీ గ్రూప్, క్రీమ్‌లైన్ డైరీ, పుష్య ఫుడ్‌‌స సంస్థలు తదితర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
పాలసీలోని ముఖ్యాంశాలు
  • పాలసీ కాలపరిమితి ఐదేళ్లు. సగటు ఫుడ్ ప్రాసెసింగ్ స్థాయిని 20 శాతం పెంచడం
  • ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ
  • 1,25,000 ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక
  • రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం. దీని కోసం గొర్రెలు, చేపల పెంపకం, పశుసంపద పంపిణీ కార్యక్రమాలను అనుసంధానం చేయడం
  • అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయం-ఆహార ఉత్పత్తుల వ్యాల్యూ చైన్ ఏర్పాటు చేయడం. దీని కోసం ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు, ఫుడ్ పార్కుల అభివృద్ధి
  • పాలసీలో భాగంగా స్టార్టప్స్ కోసం అగ్రి నిధి ఏర్పాటు


అధిక బరువు సమస్యలో ఆంధ్రప్రదేశ్ టాప్దేశంలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళలు, పురుషుల్లో (నగరాలు/పట్టణాలు, గ్రామాలు) అధిక బరువు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఏపీలోని పట్టణాల్లోని 45.6 శాతం మంది మహిళలు, 44.4 శాతం మంది పురుషులు అధిక బరువు సమస్య కలిగి ఉండగా తెలంగాణలోని పట్టణాల్లో మహిళలలో 39.5 శాతం మంది, పురుషులలో 31 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. 

రాష్ట్రాల వారీగా నగర/పట్టణ ప్రాంతాల్లో స్థూలకాయుల శాతం
రాష్ట్రం
మహిళలు
పురుషులు
ఆంధ్రప్రదేశ్‌
45.6
44.4
తెలంగాణ
39.5
31.9
గోవా
36.3
35.3
తమిళనాడు
36.2
30.6
సిక్కిం
34.1
41.5
పశి్చమబెంగాల్‌
30.6
20.7
కర్ణాటక
31.8
28.6
ఉత్తరఖండ్‌
28.4
23.0
హర్యానా
24.3
21.0
మధ్యప్రదేశ్‌
23.8
17.6
బీహార్‌
23.5
20.1
త్రిపుర
23.5
18.2
మేఘాలయ
18.4
17.1


వాస్తుశిల్పి బీఎన్ రెడ్డి కన్నుమూతప్రముఖ వాస్తు శిల్పి, రచయిత మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి(86) నవంబర్ 6న కన్నుమూశారు. బీఎన్ రెడ్డిగా సుపరిచితులైన నర్సింహారెడ్డి 1931 జూన్ 21న నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జన్మించారు. ఉస్మానియా వర్సిటీలో బీటెక్, అమెరికా కొలరాడో విశ్వ విద్యాలయంలో ఎంటెక్ పూర్తి చేశారు.
ఓయూలో కొంతకాలం లెక్చరర్‌గా పని చేసిన ఆయన 1989, 1996, 1998లో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు మిర్యాలగూడ ఎంపీగా గెలిచారు. 1968లో విర్గో పేరుతో ఆర్కిటెక్ట్ సంస్థను స్థాపించారు. 1979లో చైతన్య భారతి విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన ఆయన వాటికి మూడుసార్లు చైర్మన్‌గా పని చేశారు.
రచయిత కూడా అయిన బీఎన్‌రెడ్డి సామాజిక అంశాలపై ‘సామాన్యుడి సందేశం’, ‘బీఎన్ భాషితాలు’, ‘బీఎన్. భావతరంగిణి’ వంటి కవితలు రాశారు. ఆయన రాసిన ‘పెళ్ళికాని పెళ్ళి’ కథకు ఉత్తమ కథకుడిగా నంది పురస్కారం, రాజీవ్‌గాంధీ పురస్కారం లభించాయి. 1994లో బీఎన్ సాహితీ పురస్కారం స్థాపించారు. వాస్తు శాస్త్రానికి సంబంధించిన ‘గ్లిమ్‌సెస్ ఆఫ్ వాస్తు’ అనే గ్రంథం రాశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.


హైదరాబాద్‌లో ఇమేజ్ టవర్‌కు శంకుస్థాపన యానిమేషన్, గేమింగ్ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఇమేజ్ టవర్‌కు నవంబర్ 4న శంకుస్థాపన జరిగింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో 10 ఎకరాల్లో ఇమేజ్ టవర్‌ను రూ.946 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. దాదాపు 15 లక్షల మందికి ఉపాధి కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. హైదరాబాద్‌కు మకుటాయమానంగా నిలుస్తున్న చార్మినార్ స్ఫూర్తితో ఇమేజ్ సౌధం నమూనాను సిద్ధం చేశారు. ఎటు చూసినా టీ ఆకారంలో ఈ నిర్మాణం ఉంటుంది. టీ అంటే తెలంగాణ. టీ అంటే టెక్నాలజీ. దీని నిర్మాణాన్ని మూడేళ్లలో (2020 నాటికి) పూర్తి చేస్తారు. 

విశాఖ నుంచి మూడు పోర్టులకు జల రవాణా ప్రారంభం విశాఖ ఉక్కు ఉత్పత్తులను ఇక్కడి నౌకాశ్రయం నుంచి సముద్ర మార్గం మీదుగా ముంబై, కొచ్చి, అహ్మదాబాద్‌కు రవాణా చేసే ఎస్.ఎస్.ఎల్. శబరిమలై నౌకను నవంబర్ 1న ప్రారంభించారు.




అక్టోబర్ 2017 రాష్ట్రీయం

తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీతెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. రైల్వే లోకోమోటివ్‌‌స తయారీలో ఖ్యాతి గడించిన ప్రముఖ హైదరాబాదీ కంపెనీ మేధా సర్వో డ్రైవ్‌‌స రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లాలోని కొండకల్ గ్రామంలో ఈ పరిశ్రమను స్థాపించనుంది. ఈ పరిశ్రమతో 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో మేధా సర్వో డ్రైవ్‌‌స సంస్థ యాజమాన్యం అక్టోబర్ 27న హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 


‘మిషన్ కాకతీయ’తో వ్యవసాయాదాయంలో పెరగుదలతెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ వల్ల చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయాధారిత ఆదాయం పెరిగిందని నాబార్డ్ కు చెందిన ‘నాబ్కాన్’ సంస్థ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో సాగు, పంటల విస్తీర్ణం, దిగుబడి, రసాయన ఎరువుల వినియోగం, చేపల పెంపకం, రైతుల ఆదాయం తదితర అంశాలపై రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
సర్వే ముఖ్యాంశాలు 
  • 2016 ఖరీఫ్‌లో పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో 51.5% సాగు విస్తీర్ణం పెరగగా వ్యవసాయ ఆదాయంలో 47.4 శాతం పెరుగుదల కనిపించింది.
  • చెరువుల నుంచి తీసిన పూడిక మట్టితో రసాయనిక ఎరువుల వాడకం 35 నుంచి 50 శాతం తగ్గగా రసాయనిక ఎరువుల కొనుగోళ్లపై 27.6 శాతం ఆర్థిక భారం తగ్గింది.
  • చెరువు ఆయకట్టు పరిధిలోని కుటుంబాల సరాసరి ఆదాయం 78.5 శాతం పెరగ్గా.. వ్యవసాయ ఆదాయం 47.4 శాతం పెరిగింది.
  • భూగర్భ జల మట్టాల్లో సరాసరి పెరుగుదల 2013-14లో 6.91 మీటర్లు ఉంటే.. 2016-17లో అది 9.02 మీటర్లకు పెరిగింది. 17 శాతం ఎండిపోయిన బావులు, బోరు బావులు పునర్జీవం పొందాయి.
  • చెరువుల్లో చేపల ఉత్పత్తి 2013-14లో పోలిస్తే 2016-17లో 36 నుంచి 39 శాతానికి పెరిగింది.
  • పథకం అమలుకు ముందు 63% మంది చెరువులు బాగా లేవని చెప్పగా మొదటి దశ తర్వాత 46.7 శాతం మంది చెరువులు చాలా బాగున్నాయన్నారు.


ఆధార్ నమోదులో హైదరాబాద్ టాప్ఆధార్ నమోదులో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానాన్ని కై వసం చేసుకుంది. నగరంలో ఉన్న జనాభా కంటే దాదాపు 17.66% అధికంగా ఆధార్ యూఐడీలు జారీ అయినట్లు యూఐడీఏఐ వెల్లడించింది. 2011 నాటికి హైదరాబాద్ జనాభా 93 లక్షలుకాగా.. 2017 సెప్టెంబర్ చివరి నాటికి ఆధార్ జారీ అయిన వారి సంఖ్య 1.09 కోట్లకు చేరింది.
ఆధార్ నమోదు శాతంలో దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో నిలవగా.. ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలు వరుసగా తర్వాతి స్థానాలు పొందాయి. ఢిల్లీలోనూ జనాభా కంటే 16 శాతం అధికంగా ఆధార్ నమోదైంది. 
మెట్రో నగరాల్లో ఆధార్ నమోదు తీరు
నగరం
జనాభా
ఆధార్ నమోదు
శాతం
హైదరాబాద్
93,06,636
1,09,50,043
117.66
ఢిల్లీ
1,81,10,349
2,10,95,906
115.00
ముంబై
1,24,78,447
1,20,57,231
96.62
బెంగళూర్
95,88,910
78,71,589
82.09
చెన్నై
46,81,087
38,34,893
81.92
కోల్‌కతా
44,86,679
35,74,553
79.67


ఎమ్మేల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామాతెలుగుదేశం పార్టీ నేత అనుముల రేవంత్‌రెడ్డి శాసనసభ సభ్యత్వంతో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు అక్టోబర్ 28న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని కలిసి రాజీనామా లేఖలను అందించారు. కేసీఆర్ నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేందుకు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణలో భాగంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.


ఖమ్మంలో రైతుల కోసం కో ఆపరేషన్ స్టార్ ఆస్పత్రిఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో.. కార్పొరేట్ స్థాయిలో రైతుల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. పూర్తి మల్టీ స్పెషాలిటీ వసతులతో కో ఆపరేషన్ స్టార్ (సీ-స్టార్) పేరుతో నెహ్రూనగర్‌లో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల్లో ఈ ఆస్పత్రిని నిర్మించారు. పూర్వపు ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాల్లో ఉన్న 1.60 లక్షల మంది సభ్యులు స్వచ్ఛంద వాటా ధనం రూ.5 కోట్ల నిధులతో ఆస్పత్రి నిర్మితమైంది. 


ఏపీ స్థానికత మరో రెండేళ్లు పెంపురాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి ఉన్న గడువును మరో రెండేళ్లు పెంచే ప్రతిపాదనకు రాష్ట్రపతి అక్టోబర్ 30న ఆమోదముద్ర వేశారు. తొలుత విధించిన గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియగా మరో రెండేళ్లు పెంచాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. 

ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల విభజనఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియలో భాగంగా న్యాయమూర్తుల పోస్టులు, కేటాయింపులను కేంద్రం అక్టోబర్ 24న ఖరారు చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రభుత్వాధికారులను జనాభా ప్రాతిపదికన 58ః42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు కేటాయించారు. కాగా, న్యాయాధికారులు, న్యాయమూర్తుల విభజనకు 60ః40 నిష్పత్తిని తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏపీకి 37, తెలంగాణకు 24 న్యాయమూర్తుల పోస్టులు మంజూరయ్యాయి.

కొత్తగా 3 పట్టణాభివృద్ధి సంస్థలుతెలంగాణలో కొత్తగా మూడు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చే సింది. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరపాలక సంస్థల పరిధిలోని గ్రామాలను కలిపి వీటిని ఏర్పాటు చే శారు.

ప్రయాణికుల సేవల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ టాప్ 
అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్‌లో జీఎంఆర్ సంస్థ నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) ఏఎస్‌క్యూ సర్వే(ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ)-2016లో ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సేవల విభాగంలో కోటిన్నర మంది ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించడం ద్వారా ఈ గుర్తింపు సాధించింది. ఈ మేరకు అక్టోబర్ 18న జరిగిన 27వ ఆఫ్రికా వరల్డ్ యాన్యువల్ జనరల్ అసెంబ్లీలో ఎయిర్‌పోర్ట్ సీఈవో జీకే కిషోర్ ట్రోఫీని అందుకున్నారు. ఈ ట్రోఫీని 2016 నుంచి అందిస్తున్నారు. 
ఏఎస్‌క్యూ సర్వే గణాంకాల ప్రకారం జీహెచ్‌ఐఏఎల్ స్కోరు 2009లో 4.4గా ఉండగా 2016 నాటికి 4.9 కి పెరిగింది. 


నెల్లికల్ అడవిలో పర్యాటక వ్యూ పాయింట్నాగార్జునసాగర్ సందర్శకుల కోసం మరో పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. గతవారం శ్రీశైలం దగ్గర ఆక్టోపస్ వ్యూ పాయింట్‌ను ప్రారంభించిన రాష్ర్ట అటవీ శాఖ ఈసారి నాగార్జున సాగర్ సమీపంలో వాచ్‌టవర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణ అనుకూల పర్యాటక రంగం(ఎకో టూరిజం) అభివృద్ధిలో భాగంగా ఈ వాచ్‌టవర్‌ను నిర్మించింది. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ రోడ్డులో సాగర్ చేరుకోవడానికి ఐదు కిలోమీటర్ల ముందే.. నెల్లికల్ అడవి బ్లాక్‌లో దీనిని ఏర్పాటు చేశారు. సముద్రమట్టానికి 1,050 అడుగుల ఎత్తులో ఉండే ఈ వాచ్‌టవర్ నుంచి అడవి, కృష్ణా నదీ అందాలను, నాగార్జునసాగర్ డ్యామ్ బ్యాక్‌వాటర్‌ను కూడా చూడవచ్చు. 


నవంబర్ రెండో వారంలో అరకులో బెలూన్ ఫెస్టివల్విశాఖ జిల్లాలోని అరకులోయ ‘హాట్ బెలూన్ ఫెస్టివల్’కు వేదిక కానుంది. రాష్ట్రంలో తొలిసారిగా నవంబర్ 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఫెస్టివల్‌లో పాల్గొనడానికి 10 నుంచి 12 విదేశీ సంస్థలు రానున్నాయి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, యువతకు అడ్వెంచర్స్ (సాహసాల) వైపు ఆసక్తి పెంచడానికి వీటిని విదేశాల్లో నిర్వహిస్తుంటారు. మన దేశంలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ప్రదేశాల్లో కొన్నేళ్ల నుంచి ఈ బెలూన్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. దీనికి పర్యాటకుల నుంచి ఆదరణ లభించడంతో ఏపీలోనూ బెలూన్ ఫెస్ట్ నిర్వహించాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. 


కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 22న సీఎం శంకుస్థాపన చేశారు. ఐటీ టవర్స్, వరంగల్ ఔటర్ రింగురోడ్డు, కాజీపేట ఆర్వోబీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ పనులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. టెక్స్‌టైల్ పార్కుకి శంకుస్థాపన జరిగిన రోజే 22 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయని సీఎం తెలిపారు. వీటి ద్వారా 3,900 కోట్లు పెట్టుబడులు రాబోతున్నట్లు వివరించారు. 27,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా మరో 50,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 


ఏపీలో పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్‌లో ముడి చమురు శుద్ధి కేంద్రం, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ను ఏర్పాటు చేసేందుకు కువైట్‌కు చెందిన ఆల్ ఆర్ఫాజ్ గ్రూప్ అంగీకారం తెలిపింది. అబుదాబిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా అక్టోబర్ 23న ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీబీ), ఆల్ ఆర్ఫాజ్ గ్రూప్ హోల్డింగ్ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. 


దేశంలో తొలి ‘హరిత’ స్టేషన్‌గా సికింద్రాబాద్ 
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దేశంలోనే తొలి ‘హరిత రైల్వేస్టేషన్’గా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, భారత పరిశ్రమల సమాఖ్య (ఐజీబీసీ-సీఐఐ)ల గుర్తింపు పొందింది. దేశంలో ఈ తరహా గుర్తింపు విధానాన్ని ఈ ఏడాదే ప్రవేశపెట్టగా.. తొలిసారే సికింద్రాబాద్ స్టేషన్ దాన్ని సొంతం చేసుకుంది. నిర్దేశిత ప్రామాణికాల ఆధారంగా సిల్వర్ రేటింగ్ సాధించి... దేశంలోనే ఉన్నత ప్రమాణాలతో కొనసాగుతున్న రైల్వేస్టేషన్లలో ఒకటిగా నిలిచింది. ఈ మేరకు ఆక్టోబర్ 5న జైపూర్‌లో జరిగిన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2017లో ఈ గుర్తింపును ప్రకటించారు. 
ఎందుకీ అవార్డు?
  • స్టేషన్‌లో కొంతకాలంగా పర్యావరణ అనుకూల చర్యలు
  • పదో నంబర్ ప్లాట్‌ఫారంవైపు ఉండే మార్గాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దిన అధికారులు. సేంద్రియ ఎరువుల వినియోగంతో 408 రకాల మొక్కలు పెంపకం.
  • సౌర విద్యుత్ వినియోగం పరిధిలోకి 41.2 శాతం స్టేషన్ స్థలం.
  • 2016లో 500 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసి రోజుకు 2,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి. ఫలితంగా ఏటా రూ.73 లక్షలు ఆదా.


జేఎన్‌టీయూహెచ్‌లో నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ల్యాబ్ జేఎన్‌టీయూహెచ్ సెంటర్ ఫర్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రయోగశాలను వైస్‌చాన్‌‌సలర్ వేణు గోపాల్‌రెడ్డి, నోవాటెల్ సాఫ్ట్‌వేర్ డెరైక్టర్ మైఖెల్ కినాహాన్‌లు అక్టోబర్ 12న ప్రారంభించారు. జేఎన్‌టీయూహెచ్, హెక్సాగన్ కేపబిలిటీ సెంటర్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ప్రకృతి వనరుల నిర్వహణలో ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించేందుకు నూతన ప్రయోగశాల ఉపయోగపడుతుంది. 


నల్లమలలో ‘ఆక్టోపస్’ పర్యాటక ప్రాంతం ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో కొత్త పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. నల్లమల అటవీ అందాలు, కృష్ణా తీర సొగసులు, లోయల అందాలను తిలకించేందుకు వీలుగా ఆక్టోపస్ వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే కృష్ణా నదీ ఆక్టోపస్‌లా మెలికలు తిరిగి కనిపిస్తుండటంతో ఆ పేరు పెట్టినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్-శ్రీశైలం హైవే మార్గంలో మన్ననూర్ నుంచి 42 కి.మీ. దూరంలో, దోమలపెంటకు 5 కి.మీ. ముందు ఈ వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. 


‘గోరటి’కి సుద్దాల పురస్కారం కలం యోధుడు సుద్దాల హనుమంతు, జానకమ్మ 2017 సంవత్సరం జాతీయ పురస్కారాన్ని ప్రజాకవి గోరటి వెంకన్న అందుకున్నారు. సుద్దాల ఫౌండేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ 13న అవార్డు ప్రదానోత్సవం జరిగింది. 


ఏపీలో అన్న విలేజ్ మాల్స్‌గా రేషన్ షాపులు రేషన్ షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చాలంటూ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తొలి విడతలో 6,500 రేషన్ షాపులను ‘అన్న విలేజ్ మాల్స్’గా మార్చాలని సూచించారు. ఈ మేరకు తయారు చేసిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిలయన్‌‌స, ఫ్యూచర్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ మాల్‌్ంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ప్రత్యేక లోగో తయారుచేయాలని ఆదేశించారు. 
200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ‘అన్న విలేజ్ మాల్’ కోసమయ్యే వ్యయంలో 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరో 25 శాతం వ్యయాన్ని ‘ముద్ర’ నుంచి డీలర్‌కు రుణంగా ఇప్పిస్తుంది. ఈ విలేజ్ మాల్స్‌లో డ్వాక్రా, మెప్మా, జీసీసీ ఉత్పత్తులతో పాటు రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు. ఇక రేషన్ బియ్యం వద్దనుకునే తెల్ల కార్డుదారులకు.. అంతే విలువైన ఆహార పదార్థాలను విలేజ్ మాల్స్ నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు. 


తుంగభద్ర బోర్డు చైర్మన్‌గా రంగారెడ్డి 
తుంగభద్ర బోర్డు చైర్మన్‌గా డి.రంగారెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన తుంగభద్ర బోర్డు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఏపీలోని వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటకి చెందిన రంగారెడ్డి గతంలో బెంగళూరు, ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ బోర్డులో వివిధ హోదాల్లో పనిచేశారు. బోర్డు చైర్మన్‌గా ఆయన 2-3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. 


విశాఖలో టీయూ 142 యుద్ధ విమాన మ్యూజియం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో టీయూ - 142 యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 16న శంకుస్థాపన చేశారు. నౌకదళానికి చెందిన టీయూ - 142 యుద్ధ విమానం కార్గిల్ యుద్ధంతో పాటు పలు ఆపరేషన్లలో 29 సంవత్సరాలు కీలక సేవలందించింది. ఇదే ప్రదేశంలో కురుసురా జలాంతర్గామి మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నారు. 


షార్‌లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలుప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో ఉపరాష్ర్టపతి ఎం.వెంకయ్య నాయుడు అక్టోబర్ 4న ప్రారంభించారు. 10వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ఫలితాలను దేశంలోని సగటు మానవుడికి అందుబాటులోకి తీసుకొస్తున్న ఇస్రోను వసుధైక కుటుంబం లాంటిదని అభివర్ణించారు.


నారాయణమూర్తికి కుమురం భీం పురస్కారంకుమురం భీం జాతీయ పురస్కారానికి ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఎంపికయ్యారు. భీం వర్ధంతి సందర్భంగా 2017 సంవత్సరానికి నారాయణమూర్తిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అక్టోబర్ 5న ప్రకటించారు. అవార్డు కింద 51 వేల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందచేస్తారు. నారాయణమూర్తి ప్రజలను చైతన్యపరిచేలా పలు చిత్రాలు నిర్మించారు. అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దివిటీలు, లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగు చుక్కలు, అరణ్యం, ఎర్రోడు, సింగన్న, వీర తెలంగాణ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.
గతంలో ఈ అవార్డును కుమురం భీం చిత్రం నిర్మాత, దర్శకుడు అల్లాణి శ్రీధర్, గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అందుకున్నారు. తెలంగాణ టెలివిజన్ డెవలప్‌మెంట్ ఫోరమ్, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్, గోండ్వానా కల్చరల్ ప్రొటెక్షన్ ఫోర్స్, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ఏటా ఈ అవార్డుని ప్రదానం చేస్తున్నాయి.

కాళేశ్వరంపై స్టే విధించిన ఎన్జీటీతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అక్టోబర్ 5న స్టే విధించింది. కాళేశ్వరం నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతులు లేవని, నిర్మాణ పనులను ఆపాలని కోరుతూ సిద్దిపేటకు చెందిన హయాతుద్దీన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అనుమతులు లేకుండా 672.60 హెక్టార్ల అటవీ భూములను వినియోగిస్తూ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటికే అధిక ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదని వివరించారు.


మాస్టర్ కార్డుతో ఏపీ ఒప్పందంనగదు రహిత లావాదేవీలను సురక్షితంగా జరపడం, రైతులు సులువుగా నగదు రహిత లావాదేవీలు జరిపేలా అవగాహన చేపట్టడం కోసం మాస్టర్ కార్డు అనే సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అక్టోబర్ 5న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మాస్టర్ కార్డు సీఈవో అజయ్ భంగా, ఏపీ రాష్ట్ర ఐటీ సలహాదారు జేఏ చౌదరి ఎంవోయూ పై సంతకాలు చేశారు.


హైదరాబాద్‌లో యూట్యూబ్ పాప్-అప్ స్పేస్ఆన్‌లైన్ వీడియో కమ్యూనిటీ వేదిక యూట్యూబ్ భారత్‌లో తొలిసారిగా పాప్-అప్ స్పేస్‌ను నిర్వహించింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో అక్టోబర్ 6, 7 తేదీల్లో జరిగిన కార్యక్రమంలో వీడియోల చిత్రీకరణలో శిక్షణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి కంటెంట్ రూపుదిద్దుకుంటోందో వివరించారు. మహాతల్లి, తెలుగువన్, వైవా, చాయ్ బిస్కట్, కంత్రీ గైస్, కిరాక్ హైదరాబాదీస్, ఖేల్‌పీడియో వంటి 700 మందికి పైగా యూట్యూబ్ క్రియేటర్లు ఇందులో పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా శాశ్వత ప్రాతిపదికన 9 యూట్యూబ్ స్పేసెస్ ఉండగా, భారత్‌లో ముంబైలో ఏర్పాటు చేశారు. ఇందులో 7,500 మందికిపైగా క్రియేటర్లు ఉన్నారు. దేశంలో చిత్రిస్తున్న యూట్యూబ్ వీడియోల్లో హిందీ తర్వాతి స్థానాన్ని తెలుగు కై వసం చేసుకుంది.


అరకు మీదుగా జాతీయ రహదారిఆంధ్ర కశ్మీర్‌గా పిలువబడే అరకు మీదుగా కొత్త జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. ఈ మేరకు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16) మార్గంలో మరో రహదారి 516-ఈ ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రాజమండ్రి నుంచి రంపచోడవరం, కొయ్యూరు, లంబసింగి, పాడేరు, అరకు, ఎస్.కోట మీదుగా విజయనగరం వరకు రూ.4 వేల కోట్లతో రెండు వరుసల జాతీయ రహదారిని నిర్మిస్తారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది.


గోరటి వెంకన్నకు సుద్దాల పురస్కారంసుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారానికి 2017 సంవత్సరానికి ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న ఎంపికయ్యాడు. ఈ మేరకు అక్టోబర్ 13న సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా గోరటి వెంకన్నకు పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. 2010 నుంచి ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేస్తున్నారు.


తెలంగాణలో షూటింగ్‌లకు సింగిల్ విండో విధానం తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో టీఎస్‌బాక్స్ ఆఫీస్.ఇన్’ ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్, షూటింగ్‌ల కోసం సింగిల్ విండో అనుమతుల విధానాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్టోబర్ 7న ప్రారంభించారు. తద్వారా సినిమాల కోసం ప్రత్యేకంగా ఈ విధానాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 
సింగిల్ విండో విధానం ద్వారా నిర్మాతలు షూటింగ్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఏడు రోజుల్లోపు అనుమతులు మంజూరవుతాయి. ఏడురోజుల్లో అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగానే పరిగణించి షూటింగ్ ప్రారంభించుకోవచ్చు. 


అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటు ఔషధ మొక్కలకు నిలయమైన అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరిలో ఏర్పాటు చేయనున్న ఆ ఆస్పత్రిలో ఆయుర్వేదం, హోమియో, యునానీ, నేచురోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్యసేవలను అందించనున్నారు. అనంతగిరిలో 140 ఎకరాల విస్తీర్ణంలో టీబీ ఆస్పత్రి ఉంది. దీనిలోని 28 ఎకరాలను ఆయుష్ ఆస్పత్రి కోసం ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రూ.6 కోట్లతో 50 పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం మరికొన్ని నిధులను కేటాయించనుంది. 


ఆంధ్రప్రదేశ్‌లో హెల్మెట్ ధరిస్తేనే పెట్రోలుహెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పెట్రోలు బంకుల్లో పెట్రోలు నిరాకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ ఇక తప్పనిసరని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదని సెప్టెంబర్ 27న సచివాలయంలో జరిగిన సమీక్షలో బాబు పేర్కొన్నారు. రహదారి భద్రత పరికరాల కొనుగోలుకు రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 
సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు..
  • రాష్ట్రంలోని అన్ని వాహనాలకు జీపీఎస్ అమర్చటంపై పరిశీలన.
  • ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ట్రామాకేర్ సెంటర్ల వివరాలు తెలిసేలా ప్రత్యేక యాప్ రూపకల్పన.
  • ప్రమాద సమయాల్లో వెంటనే చేరుకునేలా రహదారుల భద్రతకు వినియోగిస్తున్న వాహనాలు, 108 వాహనాలకు జియో ట్యాగింగ్.
  • బ్లాక్ జోన్స్ గా గుర్తించిన రహదారులపై ఇబ్బందులను సత్వరమే సరిచేయాలి.

గార్లలో దశమి రోజు జాతీయ జెండా ఆవిష్కరణమహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో సెప్టెంబర్ 30న విజయదశమి రోజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గార్ల మండల కేంద్రంలో నిజాం నవాబు కాలం నుంచి జెండా ఆవిష్కరణ ఆనవాయితీగా వస్తోంది. అప్పట్లో స్థానిక మసీదు సెంటర్‌లో నిజాం అధికారిక జెండాను ఆవిష్కరించేవారు. నిజాం పాలన ముగిసిన తర్వాత 1952లో సదరు గద్దెపై కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమ్యూనిస్టులు కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో కోర్టు సదరు గద్దెపై దేశభక్తికి చిహ్నంగా జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించింది. దీంతో 1958లో తొలిసారి అప్పటి మున్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్‌రావు జాతీయ జెండాను ఎగుర వేశారు. నాటి నుంచి నేటి వరకు గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ (మొదటి పౌరుడు) అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఉత్పత్తుల వర్సిటీరాష్ట్రంలో చేపలు, సముద్ర ఉత్పత్తుల యూనివర్సిటీని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కంపెనీలో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు 51% పెట్టుబడి పెడతారు. మిగతా 49% ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుంది. భీమవరం, అమలాపురంలలో 200 ఎకరాల్లో ఈ వర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. రూ. 300 కోట్లు అవుతుందని అంచనా. ఈ వర్సిటీ ఏర్పాటుకు ఆనంద్ గ్రూప్ ప్రధాన పెట్టుబడిదారుగా అవంతి ఫీడ్‌‌స, యుఎన్‌ఓ ఫీడ్‌‌స, దేవి సీ ఫుడ్‌‌స, మత్స్య రైతులు వి.రామ చంద్రరాజు, జి.సుబ్బరాజు, రొయ్యల రైతు ఐ.పీ.ఆర్ మోహనరాజు, ఆనంద్ రాజులు ముందుకు వచ్చారు. 


ఏపీలో ఒకే రోజు లక్ష ఇళ్లలో సామూహిక గృహప్రవేశం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన 1,01,396 ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ 2న ప్రారంభించారు. అలాగే.. పీఎంజేజేబీవై చంద్రన్న బీమాను ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర మిషన్ తృతీయ వార్షికోత్సవంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్లను వేగంగా పూర్తి చేయించి సంక్రాంతి, క్రిస్మస్, జూన్ 8న ఇదే తరహాలో సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని వివరించారు. వచ్చే మార్చిలోగా రాష్ట్రంలో నూటికి నూరు శాతం మలవిసర్జన రహిత(ఓడీఎఫ్) గ్రామాలుగా సాధిస్తామని చెప్పారు.