Sunday, 11 February 2018

జనవరి 2018 రాష్ట్రీయం

వరంగల్‌లో టెక్ మహీంద్ర ఏర్పాటుకు అంగీకారం ప్రముఖ ఐటీరంగ కంపెనీ టెక్ మహీంద్ర వరంగల్‌లో తమ కేంద్రాన్ని (టెక్ సెంటర్) ఏర్పాటు చేయనుంది. టెక్ మహీంద్ర కార్యకలాపాలు ప్రారంభించా లని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన విజ్ఞప్తికి కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ జనవరి 25న మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, సీఈవో సీపీ గుర్నానీతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం-మహీంద్ర సంస్థల మధ్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి కోరగా, వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ఆనంద్ హామీ ఇచ్చారు. తొలుత 500 మందితో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌కు అలీబాబా క్లౌడ్ సహకారం
దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి 24న క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ సర్వీసెస్ కంపెనీ అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హూతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అలీబాబా సహకారం అందిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. సైమన్ హూ స్పందిస్తూ.. భారత్‌లో తమరెండో డేటా సెంటర్‌ను ఈ ఏడాది చివరకు ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటు చేస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. వ్యవసాయంలో సూక్ష్మ పోషకాలు, క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాలన్నది తమ ఉద్దేశమని, ఆ దిశగా ఎనలిటిక్స్ రంగంలో అలీబాబా సంస్థ సహకారం కోరుతున్నట్లు తెలిపారు. 

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ జనవరి 26న ప్రారంభమైంది. 28వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో పలు సాహిత్య, సామాజిక అంశాలపై 30కిపైగా సదస్సులు, సాంస్కృతిక, చర్చా కార్యక్రమాలు, వర్క్‌షాపులు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో స్పెయిన్ అతిథి దేశంగా పాల్గొంటుంది. 15కు పైగా రాష్ట్రాలు, 10 దేశాల నుంచి ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరయ్యారు. 
 

ఆంధ్రప్రదేశ్ సర్కార్ విజన్ - 2029
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 44 శాతం కుటుంబాలకు ఇంటి ఆవరణలో స్నానం చేసే గదులు కూడా లేవు. ఇందులో అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీల కుటుంబాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇది ఎక్కువగా ఉంది. వీరిలో అత్యధికులకు బ్యాంకు ఖాతాలు కూడా లేకపోవడం గమనార్హం. ఇక 69 లక్షల కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదు. విజన్-2029లో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు స్పష్టమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు నోచుకోక 48 లక్షల కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నట్లు తేలింది. 
నివేదికలో ముఖ్యాంశాలు..

  • రాష్ట్రంలో ఇంటి ఆవరణలో స్నానపు గదుల్లేని కుటుంబాలు 44 శాతం ఉన్నాయి.
  • 72 శాతం ఎస్టీ కుటుంబాలకు, 54 శాతం ఎస్సీ కుటుంబాలు, 38 శాతం మంది ఇతరులకు ఇంటి ఆవరణలో స్నానం గదులు లేవు.
  • రాష్ట్రంలో 33 శాతం కుటుంబాలకు సరైన గూడు లేదు. నాణ్యతతో కూడిన నివాస గృహాలు 67 శాతం మందికే ఉన్నాయి.
  • రాష్ట్రంలో 1.37 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉండగా వీరిలో 39 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. ఇతర కుటుంబాల్లో 98 లక్షల మంది నిరక్షరాస్యులున్నారు.
  • 60 శాతం కుటుంబాలకు ఇంట్లో నల్లా నీటి సౌకర్యం లేదు.

విజయవాడలో సూర్యారాధన కార్యక్రమం
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28న సూర్యారాధన కార్యక్రమం నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. చరిత్రలో మొదటి సారిగా ప్రభుత్వం తరఫున ప్రకృతిని ఆరాధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. భారత దేశంలో మొదటిగా ఆంధ్రప్రదేశ్‌లోనే సూర్యుడు ఉదయిస్తాడని, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాలకు సూర్యోదయం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. సూర్యారాధన మతం కాదని, సైన్‌‌స అని అన్నారు. కులమతాలకు అతీతంగా సూర్యారాధన కొనసాగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మాదిరిగానే సూర్యారాధనను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. 

హైదరాబాద్‌లో అంతర్జాతీయ కణ జీవశాస్త్ర సదస్సు
హైదరాబాద్ వేదికగా జనవరి 27 నుంచి 31 వరకు అంతర్జాతీయ కణ జీవశాస్త్ర సదస్సు(ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ సెల్ బయాలజీ) జరిగింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలో షామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్‌లో ఈ సదస్సు జరిగింది. అమెరికాకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మార్టిన్ చాల్ఫీ ప్రారంభోపన్యాసం చేశారు. జీవ వైజ్ఞానిక శాస్త్రంలో మూడు అగ్రగామి సంస్థలైన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఐఎఫ్‌సీబీ), ఏషియన్ పసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ (ఏపీఓసీబీ), ఇండియన్ సొసైటీ ఫర్ సెల్ బయాలజీ (ఐఎస్‌సీబీ)లు తొలిసారిగా ఒకే వేదికను పంచుకున్నాయి. 30 దేశాల నుంచి 300 సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, 1,400 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. 


విశాఖలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక సదస్సుపారిశ్రామిక నవకల్పనలు, సాంకేతిక ఉత్పత్తి, పారిశ్రామికీకరణ అంశాలపై విశాఖపట్నంలో జనవరి 17న అంతర్జాతీయ మహిళా పారిశ్రామికాభివృద్ధి సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సదస్సుని ప్రారంభించారు. తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించడంతో పాటు వ్యాపార అభివృద్ధిపై చర్చించేందుకు దేశ విదేశాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు సదస్సుకి హాజరయ్యారు. భారత మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య (అలీఫ్ ఇండియా), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహించింది.
 

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా సిసోడియాఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా ఆర్.పి.సిసోడియాను నియమిస్తూ జనవరి 17న కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భన్వర్‌లాల్ సీఈవోగా పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత జాయింట్ సీఈవో అనూప్‌సింగ్ రెండు రాష్ట్రాలకు ఇన్‌చార్జి సీఈవోగా విధులు నిర్వర్తించారు. 


తెలంగాణలో నేరస్తులు 2.18 లక్షలురాష్ట్రంలో తరచూ నేరాలకు పాల్పడేవారు 2.1 లక్షల మంది ఉన్నట్లు పోలీసుశాఖ నేరస్తుల సమగ్ర సర్వేలో లెక్కతేల్చింది. రాష్ట్రంలో నేరస్తుల గుర్తింపు, వారి కదలికలు, నిఘా కోసం జనవరి 18న ఒకేరోజున రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించింది. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని స్థాయిల పోలీసు సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. పదే పదే నేరాలకు పాల్పడేవారెంత మంది, దొంగలు ఎందరు, దోపిడీలకు పాల్పడేవారెంత మంది, ఈవ్‌టీజింగ్, ఇతర నేరాలకు పాల్పడేవారెంత మంది ఉన్నారనే లెక్కలు తేల్చారు. 
సమగ్ర సర్వే ద్వారా గుర్తించిన నేరస్తుల వివరాలను, వారి నివాసాలకు చేసిన జియో ట్యాగింగ్‌ను ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ వాహనాలకు అనుసంధానించారు. అంతేగాకుండా ఈ వివరాలన్నింటినీ టీఎస్ కాప్ యాప్‌కు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఎక్కడైనా దొంగతనం లేదా ఇతర నేరం ఏదైనా జరిగితే.. వెంటనే అనుమానితులను గుర్తించడం, వారి నివాసాలకు వెళ్లి విచారించడం సులభతరం కానుంది. 


ఏపీ-నీతిఆయోగ్ మధ్య ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్ ఒప్పందంముఖ్యమంత్రి చంద్రబాబు నివాస సముదాయంలో కొత్తగా నిర్మించిన గ్రీవెన్‌‌స హాలులో జనవరి 18న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. దేశంలో అత్యంత వెనుకబడిన 115 జిల్లాల్లో ఆన్‌లైన్ డ్యాష్ బోర్డు అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం మాట్లాడిన రాజీవ్ కుమార్.. దేశాన్ని 2022 నాటికి సరికొత్త భారతావనిగా ఆవిష్కరించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి సర్వ శ్రేష్ట భారత్‌ను ఆవిష్కరించాలన్నారు. అవినీతిరహిత, పరిశుభ్ర, ఆరోగ్య, నైపుణ్య, సురక్షిత భారత్ సాకారం కావాలని ఆకాంక్షించారు. టీమ్ ఇండియా మాదిరిగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ క్రతువులో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని సూచించారు.
 

టీఎస్ వైద్య, ఆరోగ్య శాఖకు జాతీయ అవార్డు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు మరో జాతీయ అవార్డు దక్కింది. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) నిహిలెంట్ ఈ-గవర్నెన్‌‌స అవార్డు-2017కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బెస్ట్ ఈ-గవర్నెన్‌‌స స్టేట్-అవార్డు ఆఫ్ రికగ్నేషన్ (హెల్త్ అండ్ వెల్ బీయింగ్) విభాగంలో ఎంపికై ంది. ఈ మేరకు జనవరి 20న కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ ఈ అవార్డుని అందుకున్నారు. 
2002 నుంచి ఈ సంస్థ ఈ -గవర్నెన్‌‌సలో ప్రగతి సాధించిన రాష్ట్రాలను ఎంపిక చేసి అవార్డులను అందిస్తోంది.


టోక్యో క్లీన్ అథారిటీతో తెలంగాణ ఒప్పందం టోక్యో క్లీన్ అథారిటీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బృందం జపాన్ పర్యటనలో భాగంగా జనవరి 19న ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఘన వ్యర్థాల భస్మీకరణ, నిర్వహణకు సంబంధించి సాంకేతిక సహకారాన్ని టోక్యో సహాయం అందించనుంది. పౌల్ట్రీ రంగంలో సాంకేతిక సహకారానికి సంబంధించి ఐఎస్‌ఈ ఫుడ్‌‌సతో కూడా ఓ అవగాహనకు వచ్చింది. కోడిగుడ్ల ఉత్పత్తిలో కొత్త సాంకేతికతను వినియోగించుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా సోలార్ పార్కును రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. 


ఏపీ మాజీ డీజీపీ రాగాల కన్నుమూతఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ రామకొండల రాగాల (80) జనవరి 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం చదలవాడ గ్రామానికి చెందిన ఆర్.కె.రాగాల 1994లో ఏడు నెలలపాటు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. పోలీసు శాఖలో 33 ఏళ్లపాటు కమ్యూనికేషన్ ఐజీ, ఫైర్ సర్వీసెస్ డీజీ, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 


హైదరాబాద్‌లో అంతర్జాతీయ హెరిటేజ్ సదస్సుఅంతర్జాతీయ హెరిటేజ్ సదస్సు జనవరి 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగింది. ఈ సదస్సులో చారిత్రక పరిశోధకుడు, ది రాయల్ హిస్టారికల్ సొసైటీ ఫెలో కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి తన పరిశోధన వ్యాసాన్ని సమర్పించారు. ఇందులో ఆయన హైదరాబాద్ పాతపేరు చిచులం అని తెలిపారు. చిచులం లేదా చచలం అంటే చింతచెట్టు అని అర్థం.


‘కళారత్న’ రవిశంకర్ కన్నుమూత కళారత్న బిరుదు గ్రహీత కూచిపూడి నాట్య కళాకారుడు వెంపటి రవిశంకర్ (49) జనవరి 23న హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు. తండ్రి వెంపటి చినసత్యం వారసునిగా ఈ రంగంలో ప్రవేశించిన ఆయన తండ్రి అడుగుజాడలనే అనుసరించారు. పెదనాన్న పెద్దసత్యం బాణీని కళకు చేర్చి కూచిపూడి నాట్యంలో శిల్పప్రావీణ్యానికి శోభను చేకూర్చారు. దాదాపు 80కి పైగా నృత్యరీతులను దేశవిదేశాల్లో శిష్యులకు నేర్పించారు. 200లకు పైగా స్వీయ రచనలకు సంగీతాన్ని సమకూర్చారు. 


తెలంగాణలో గుట్కాపై నిషేధం పొడిగింపురాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా అమ్మకంపై నిషేధాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కమిషనర్ శాంతికుమారి ఈ మేరకు జనవరి 11న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డెరైక్టర్ శంకర్ ఈ ప్రకటన విడుదల చేశారు. నికొటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి, నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించినట్లు తెలిపారు. గుట్కా, పాన్‌మసాలా అమ్మకాలపై 2013 జనవరి 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. ప్రతిఏటా కొత్తగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. 
 

ఏపీ ‘నాలా’ బిల్లుకు గవర్నర్ ఆమోదంఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూ వినియోగ మార్పిడి (నాలా) చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. శాసనసభ, శాసనమండలి 2017 డిసెంబర్‌లో ఆమోదించి పంపిన నాలా బిల్లుపై గవర్నర్ జనవరి 11న సంతకం చేశారు. నాలా రుసుము తగ్గింపు, నిబంధనల సవరణపై ఆర్డినెన్‌‌స కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలల క్రితం పంపిన ప్రతిపాదనలపై గవర్నర్ పలు సందేహాలను వ్యక్తం చేయడమే కాకుండా పునఃపరిశీలించాలంటూ ఫైల్ వెనక్కి పంపటం తెలిసిందే. 


పీఎస్సీల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా రెండోసారి చక్రపాణి యూపీఎస్సీ చైర్మన్ సమక్షంలో పీఎస్సీ చైర్మన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ చక్రపాణి రెండోసారి ఎన్నికయ్యారు. గోవాలో జనవరి 11, 12 తేదీల్లో జరిగిన పబ్లిక్ సర్వీసు కమిషన్ (పీఎస్సీ) చైర్మన్ల స్టాండింగ్ కమిటీ 20వ జాతీయ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. చక్రపాణి.. ఆ పదవిలో మరో రెండేళ్లపాటు కొనసాగుతారు. ఒకే పీఎస్సీ చైర్మన్‌ను రెండోసారి ఎన్నుకోవడం ఇదే ప్రథమం. 
అన్ని రాష్ట్రాల్లో వివిధ ఉద్యోగ పరీక్షల్లో మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని ఈ సదస్సులో పబ్లిక్ సర్వీసు కమిషన్ (పీఎస్సీ) చైర్మన్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది.


తెలంగాణలో ‘అమ్మ ఒడి’ సేవల విస్తరణఅమ్మ ఒడి (102 సేవలు) విస్తరణ, కొత్తగా ద్విచక్ర అంబులెన్సులు, ఏఎన్‌ఎంలు వినియోగించే ద్విచక్ర వాహనాల (వింగ్‌‌స) సేవలను సీఎం కేసీఆర్ జనవరి 17న హైదరాబాద్‌లో ప్రారంభించారు. కేంద్రం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా అమలవుతున్న జననీ సురక్ష యోజన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పు అయిన మహిళను, శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడం లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. 2016 డిసెంబర్ 28న రాష్ట్రంలో అమ్మ ఒడి సేవలను ప్రారంభించారు. మొదటి దశలో 41 వాహనాలతో సేవలు మొదలయ్యాయి. జీవీకే ఈఎంఆర్‌ఐ భాగస్వామ్యంతో 102 వాహనాలకు విస్తరించింది. అయితే 12 జిల్లాల్లోనే ఈ సేవలను కొనసాగిస్తున్నారు. మిగతా జిల్లాల్లోనూ ఈ పథకం అమలుకు కొత్తగా 200 వాహనాలను కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చారు. 
అలాగే అత్యవసర సమయాల్లో వేగంగా రోగుల దగ్గరకు వెళ్లేందుకు వినియోగించే ద్విచక్ర అంబులెన్‌‌స సేవలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సేవల కోసం 50 వాహనాలను కొనుగోలు చేశారు. 


‘మొయిబా’తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా జనవరి 17న తెలంగాణ ప్రభుత్వం.. మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోసియేషన్ (మొయిబా) సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స, వర్చువల్ రియాలిటీ, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర అంశాల్లో మొయిబా, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందం కుదిరింది. 


ఏపీలో ఐదో విడత 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో ఐదో విడత 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 2న ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభించారు. జనవరి 2 నుంచి 11 వరకు కొనసాగే కార్యక్రమంలో ప్రభుత్వ పాలనను మొత్తం ప్రజల ముందుకు తెస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. త్వరలో కొత్తగా మరో 4 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నామని.. దీంతో మొత్తం 50 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. 


తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నియమించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జనవరి 2న సంతకం చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్‌కు చెందిన యువ నాయకుడు. కమిషన్ సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ (రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయగూడ), సుంకపాక దేవయ్య (హైదరాబాద్‌లోని రాంనగర్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల)ను నియమించారు. 


తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా కమరుద్దీన్తెలంగాణ మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జనవరి 3న నోటిఫికేషన్ జారీ చేసింది. మహమ్మద్ కమరుద్దీన్‌ను కమిషన్ చైర్మన్‌గా, రాజారపు ప్రతాప్‌ను వైస్ చైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా మహ్మద్ అర్షద్ అలీఖాన్, విద్యా స్రవంతి, గస్టీ నోరియా, బొమ్మల కట్టయ్య, సురేందర్ సింగ్ నియమితులయ్యారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. చైర్మన్‌తో పాటు సభ్యుల పదవీ కాలం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

తెలంగాణలో జనవరి 22 నుంచి పులుల గణన రాష్ట్రంలో పులుల సంఖ్యను పక్కాగా తేల్చేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. జనవరి 22 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పులుల గణన చేపడతామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,100 బీట్లను గుర్తించామని, ప్రతి బీట్‌కు ఇద్దరు చొప్పున నియమించి పులుల లెక్కలు తీస్తామన్నారు. ఈసారి గణనకు సీసీ కెమెరాల వినియోగంతో పాటు పాద ముద్రలు, పెంటిక నిర్ధారణ పరీక్షలనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ గణనలో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవో సంఘం సభ్యుల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు గణనలో పాల్గొనటానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. పులుల గణనను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2013 జనవరిలో పులుల గణన చేపట్టారు. 


దేశంలో తొలిసారిగా తెలంగాణలో కో-ఫైనాన్సింగ్ సంస్థఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటూ ఉత్పాదక రంగంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు (ఎస్‌ఎంఈ) రుణాలందించటమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు (టీఐహెచ్‌సీ) లైన్ క్లియరైంది. దేశంలోనే తొలిసారిగా దీనికి కో-ఫైనాన్సింగ్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. ఇది ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానుంది. 
టీఐహెచ్‌సీలో రెండు విభాగాలు
  1. ఖాయిలా పడ్డ పరిశ్రమలను పునరుద్ధరించడం.
  2. ఉత్పాదక రంగంలోని ఎస్‌ఎంఈలకు నిధులు సమకూర్చడం.
ఖాయిలా పరిశ్రమల విషయానికొస్తే.. బిల్ రీ డిస్కౌంట్ స్కీమ్, టెక్నో ఎకనామిక్ వాల్యూవేషన్ (టీఈవీ) స్టడీ, సాఫ్ట్ లోన్ అనే 3 రకాల సేవలుంటాయి. 
బిల్ రీ డిస్కౌంట్‌లో.. గడువు ముగిసి బ్యాంకులు ఎన్‌పీఏలుగా ప్రకటించిన పరిశ్రమలను గుర్తించి.. వాటి బ్యాంక్ పేమెంట్‌ను టీఐహెచ్‌సీ చెల్లిస్తుంది. పరిశ్రమలకు మరో 90 రోజుల సమయమిస్తారు. దీనికి పరిశ్రమలు టీఐహెచ్‌సీకి సంబంధిత బ్యాంక్ వడ్డీ కంటే 5 శాతం తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 


తెలంగాణ గురుకులాల్లో ‘భారత్ దర్శన్’విద్యార్థులు పాఠశాలలకే పరిమితం కాకుండా, వారిలో విషయ పరిజ్ఞానం, వికాసం, సృజనాత్మకత పెంపొందించేందుకు తెలంగాణ గురుకుల సొసైటీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ ప్రదేశాలను సందర్శించి వాటిపై అవగాహన పెంచుకునే విధంగా దీన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ‘భారత్ దర్శన్’ పేరిట దేశంలోని ప్రఖ్యాత ప్రాంతాలు, ప్రముఖ స్థలాలకు విద్యార్థులను తీసుకెళ్లేలా ప్రణాళికలు రచించింది. ఈ మేరకు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పించనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు దీన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1.35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో విశాల దృక్పథాన్ని అలవర్చాలనే ఉద్దేశంతో గురుకుల సొసైటీలు భారత్ దర్శన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాయి. 


దేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ పంజగుట్టదేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్ కమిషనరేట్‌లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ అవార్డు దక్కించుకుంది. కేంద్ర హోంశాఖ, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్లపై సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా వందకు పైగా స్టేషన్లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, దర్యాప్తు.. ఇలా 140 ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో పది పోలీస్ స్టేషన్లతో తుది జాబితా రూపొందించి వాటిలోంచి మూడు ఉత్తమ స్టేషన్లను ఎంపిక చేశారు. తమిళనాడులోని కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కమిషనరేట్ పరిధిలోని గుడుంబా పోలీస్ స్టేషన్ మూడో స్థానంలో నిలిచాయి. డీజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పోలీస్ స్టేషన్లకు ట్రోఫీలు అందజేశారు. 


ఏపీ రుణభారం రూ.2 లక్షల కోట్లు2018 బడ్జెట్ నాటికి ఆంధ్రప్రదేశ్ రుణభారం రూ.2.16 లక్షల కోట్లకు చేరుతుందని జనవరి 5న కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పి.రాధాక్రిష్ణన్ లోక్‌సభకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు, బడ్జెట్ ప్రకారం 2016 మార్చి నాటికి ఏపీ రుణం రూ.1,73,854 కోట్లకు; 2017 మార్చి బడ్జెట్ నాటికి రూ.1,92,984 కోట్లకు చేరిందన్నారు. ఇది 2018 బడ్జెట్ నాటికి రూ.2,16,027 కోట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.

‘బతుకుపోరు, విలువలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన ‘బతుకుపోరు, విలువలు’పుస్తకాన్ని డిసెంబర్ 28న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. రాములు.. 90కిపైగా పుస్తకాలు రాసి బహుగ్రంథ కర్తగా పేరొందారు. తత్వశాస్త్రంతోపాటు తెలంగాణ వాస్తవ జీవన చిత్రంపై కథలు, నవలలు, కథానికలు, సాహిత్య విమర్శ, బీసీ సామాజిక వర్గాలపై రచనలు చేశారు. 
 

అమరావతిలో ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు భూమిపూజ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ భవన సముదాయ నిర్మాణానికి డిసెంబర్ 28న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగతనం ఏ రూపంలో అయినా అది పోలీసు, ప్రభుత్వం ఉదాసీనత వల్లే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేసినా న్యాయస్థానాల్లో ఏదో రకంగా తప్పించుకోవచ్చని చాలా మంది అనుకుంటున్నారన్నారు. నేరాల ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్థంగా పనిచేసి తప్పు చేసిన వారు తప్పించుకోకుండా చేయాలని సూచించారు. రూ. 254 కోట్లతో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మిస్తున్నారు.
 

హైదరాబాద్‌లో రోబో పోలీస్ ప్రారంభంపోలీసు విభాగంలో అత్యాధునిక సాంకేతిక విధానాలతో రూపొందించిన రోబో పోలీస్‌ను తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ డిసెంబర్ 29న ప్రారంభించారు. ఈ రోబో డిసెంబర్ 31 నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తుంది. టీ-హబ్‌లో స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన ‘హెచ్ బోట్స్’ రోబోటిక్స్ కంపెనీ పోలీస్ రోబోను రూపొందించింది. ఈ రోబో పోలీసు అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు తీసుకుని కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. అనుమానితులను, బాంబులను గుర్తిస్తుంది. 
దుబాయ్‌లో చక్రాలతో కూడిన రోబో పోలీసు విధులను నిర్వహిస్తుండగా.. ఇక్కడ దానికి భిన్నంగా నడిచే పోలీస్ రోబోకు ‘హెచ్ బోట్స్’ రూపకల్పన చేసింది. ప్రపంచంలోనే రెండో పోలీస్ రోబోగా గుర్తింపు పొందనున్న దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్టు రూపకర్తలు తెలిపారు. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో రోబో సేవలు విస్తరించాలని భావిస్తున్నారు.

ఏపీలోని ఏడు ద్వీపాల్లో 7 పర్యాటక ప్రాజెక్టులుఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ఏడు ద్వీపాలను అభివృద్ధి చేసి ఏడు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో నాలుగు ద్వీపాలు, రెండో దశలో మిగిలిన మూడు ద్వీపాలను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొదట భవానీ ద్వీపాన్ని ఎకో పార్కుగా అభివృద్ధి చేయడానికి ఇటీవలే ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే దీన్ని మారిషస్ తరహాలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా మరింత మెరుగైన ప్రతిపాదనలు రూపొందించాలని ప్రభుత్వం కన్సల్టెన్సీలను కోరింది.


54 సర్వీసులతో ’టీఎస్ కాప్’ యాప్ ఆవిష్కరణనేరాల నియంత్రణ నుంచి పరిశీలన, దర్యాప్తు, విచారణల తీరు దాకా అన్ని అంశాలూ అరచేతిలోనే ఇమిడిపోయేలా ‘టీఎస్ కాప్’ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ స్థాయి పోలీసింగ్‌కు తోడ్పడేలా రూపొందిన ఈ యాప్‌ను జనవరి 1న హైదరాబాద్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐపీఎస్ అధికారులతో కలసి ఆవిష్కరించారు. దీనిని తొలుత పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో పరిశీలించగా.. పెట్రోలింగ్ సిబ్బంది, సెక్టార్ ఎస్సైలు, బ్లూకోల్ట్స్ సిబ్బందికి చాలా ఉపయోగపడింది. మంచి ఫలితాలను సాధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీసు శాఖలోని దాదాపు 14 ప్రధాన విభాగాలు టీఎస్ కాప్ యాప్‌ను ఉపయోగించుకునేలా రూపొందించారు. 

గుంటూరులో భారత ఆర్థిక సంఘం సదస్సుభారత ఆర్థిక సంఘం(ఐఈఏ) శత వార్షిక సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న గుంటూరులోప్రారంభించారు. ఈ సదస్సు డిసెంబర్ 30 వరకు జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు, నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ తదితరులు పాల్గొన్నారు.

హిజ్రాలకు ప్రత్యేక విధానంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 30న హిజ్రా (ట్రాన్స్‌జెండర్స్)ల కోసం ప్రత్యేక విధానం ప్రకటిం చింది. ఈ విధానంలో భాగంగా 18 సంవత్సరాలు పైబడిన హిజ్రాలకు రూ.1500 అందించనుంది.

డిసెంబర్ 2017 రాష్ట్రీయం

ఆర్‌కే నగర్ ఉపఎన్నికల్లో దినకరన్ విజయం 
తమిళనాడులో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థి, ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ విజయం సాధించారు. ఈ మేరకు డిసెంబర్ 24న జరిగిన ఓట్ల లెక్కింపులో ఆయన 40వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. డీఎంకే, బీజేపీ సహా 58 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌కే నగర్ నుంచి తమిళనాడు మాజీ సీఎం జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని కూడా దినకరన్ అధిగమించి సత్తా చాటారు. జయలలిత మరణంతో డిసెంబర్ 21న ఆర్‌కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. 

డీజీపీ నియామక ఆర్డినెన్స్‌ను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేలా ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్ట్‌ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26న ఆర్డినెన్‌‌స జారీ చేసింది. డీజీపీ పోస్టు కోసం రాష్ట్రానికి చెందిన ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను పంపించగా.. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ యూపీఎస్సీ పలుమార్లు తిప్పి పంపింది. ఈ నేపథ్యంలో డీజీపీ ఎంపిక వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్డినెన్‌‌స తెచ్చేందుకు డిసెంబర్ 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్(రిఫారమ్స్, అడ్మినిస్ట్రేటివ్) ఆర్డినెన్‌‌స నంబర్ 4-2017ను జారీ చేశారు. 


ఏఎన్‌యూలో ఐఈఏ శతాబ్ది ఉత్సవాలుగుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్ మిషన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ)’ శతాబ్ది ఉత్సవాల సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న ప్రారంభించారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబు, బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనిస్, ఐఈఏ కాన్ఫరెన్‌‌స అధ్యక్షుడు, సి.రంగరాజన్, భారత 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ఇంటర్నేషనల్ ఎకనామిక్ అసోషియేషన్ అధ్యక్షుడు కౌశిక్ బసు, ఐఈఏ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ థోరట్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. 'ట్రాకింగ్ ది ఇండియన్ ఎకానమీ' పేరుతో డాక్టర్ సి. రంగరాజన్ రచించిన పుస్తక తొలి కాపీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేశారు. 


ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న ప్రారంభించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితమిచ్చారు. దీంతోపాటు రియల్‌టైమ్‌లో పరిపాలనను పర్యవేక్షించే డ్రోన్లు, సీసీటీవీ సర్వెయలెన్‌‌స ప్రాజెక్టుతోపాటు మారుమూల ప్రాంతాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ఎఫ్‌ఎస్‌ఓసీ ప్రాజెక్టును సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు ద్వారా పౌర జీవనం నాణ్యంగా మారే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం తక్కువ ధరకు ప్రజలకు టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ వంటి వసతులని కల్పిస్తుంది. 
 

బెటర్ ఇండియా జాబితాలో సీపీ మహేశ్ భగవత్ బెటర్ ఇండియా ఏటా ప్రకటించే టాప్-10 ఐపీఎస్ అధికారుల జాబితాలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ చోటు దక్కించుకున్నారు. విధుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు బెటర్ ఇండియా ఏటా టాప్-10 ఐపీఎస్ అధికారుల జాబితాను విడుదల చేస్తుంది. తాజా జాబితాలో తొలి, రెండు స్థానాల్లో మనీశ్‌శంకర్ శర్మ, ఆర్.శ్రీలేఖ ఉండగా.. మూడో స్థానంలో మహేశ్ భగవత్ ఉన్నారు. 
అక్రమ రవాణా బారి నుంచి చాలామంది మహిళలు, పిల్లలను రక్షించినందుకు మహేశ్ భగవత్‌కు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ట్రాఫికింగ్ ఇన్ పర్సన్‌‌స రిపోర్ట్ హీరోస్ అవార్డు-2017ను ప్రకటించింది. 


ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీ మాలకొండయ్యఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ సాంబశివరావు డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మాలకొండయ్య 2018 జనవరి 1వ తేదీన డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


మిషన్ అంత్యోదయలో ఏపీ ఫస్ట్కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిసెంబర్ 22న మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రామాల సమగ్ర అభివృద్ధి ఆధారంగా మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకులను ప్రకటించారు.

ఆదిభట్లలో మైమానిక ఇంజిన్ పరికరాల తయారీహైదరాబాద్‌లోని ఆదిభట్లలో ఉన్న ఏరోస్పేస్ సెజ్‌లో వైమానిక ఇంజిన్లు తయారు కానున్నాయి. ఈ మేరకు టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ ఏరో సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్), అంతర్జాతీయ ఇంజినీరింగ్ సంస్థ జీఈ గ్రూప్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సీఎఫ్‌ఎం లీప్ వైమానిక ఇంజిన్‌కు అవసరమయ్యే వివిధ పరికరాలను తయారు చేస్తారు. దీనికి సంబంధించి డిసెంబర్ 14న జీఈ- టాటా సన్‌‌స ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఒప్పందం విలువ దాదాపు 50 కోట్ల డాలర్లు.


ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభంతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 15న హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ సభలు డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఇర్ అధ్యక్షతన జరిగే ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరై ఉత్సవాలను ప్రారంభించారు.
డిసెంబర్ 19 వరకు జరగనున్న ఈ మహాసభల్లో తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పేట్లు సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘‘తెలుగు వెలుగును ప్రపంచానికి చాటుదాం.. తెలంగాణా ఖ్యాతిని దశదిశలా చాటుదాం’’ అనేది ఈ మహాసభల నినాదం. ఈ సభలకు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దాదాపు 6 వేల మంది తెలుగువారిని ఆహ్వానించారు. 1975లో తొలి తెలుగు ప్రపంచ మహాసభలు జరగగా 2012లో చివరి మహాసభలు జరిగాయి.


డీజీపీ నియామకంను రాష్ట్ర పరిధిలోకి తెస్తూ ఏపీ నిర్ణయం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డీజీపీ నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేలా పోలీస్ చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ఆర్డినెన్‌‌స కూడా తీసుకురావాలని తీర్మానించింది. పోలీస్ యాక్ట్ 9 ఆఫ్ 2014ను సవరిస్తూ ఆర్డినెన్‌‌స తెచ్చి, తరువాత అసెంబ్లీలో చర్చించి పూర్తిస్థాయి సవరణకు ఆమోదం పొందాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్సుతో డీజీపీ నియామకాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆలిండియా సర్వీసెస్(ఏఐఎస్) యాక్ట్ 1953కి లోబడి డీజీపీ పదవీకాలం కూడా నిర్ణయించే అధికారం ఆర్డినెన్‌‌స ద్వారా రాష్ట్రానికి ఉంటుంది. 


ఏపీ అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్ రాజధాని పరిపాలనా నగరంలో అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నీటి కొలను మధ్యలో 250 మీటర్ల వెడల్పు, 250 మీటర్ల పొడవుతో అసెంబ్లీ డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించింది. డిసెంబర్ 16న వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధులు టవర్ డిజైన్‌తోపాటు వజ్రం డిజైన్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. టవర్ ఆకృతికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
125 ఎకరాల విస్తీర్ణంలో కొలను 250 మీటర్ల ఎత్తులో టవర్ ఆకారంలో నిర్మించే ఈ అసెంబ్లీ భవనం నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. టవర్‌పైకి 40 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి 217 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. 70 మంది సందర్శకులు ఒకేసారి వ్యూపాయింట్‌కు వెళ్లి రాజధాని నగరాన్ని చూడొచ్చు. ఈ భవనాన్ని నీటి కొలనులో నిర్మిస్తారు. ఈ కొలను 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. టవర్ ప్రతిబింబం ఈ నీటిలో పడేలా డిజైన్ చేశారు. టవర్ కింది భాగంలో శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్, పరిపాలనా కేంద్రాల భవనాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అసెంబ్లీ భవనం మొత్తం 87 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఉంటుండగా, నిర్మిత ప్రాంతం 7.8 లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఈ భవనంపై పునరుత్పాదక విద్యుదుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సూర్యకాంతి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా నెలకొల్పుతారు. 


తెలంగాణలో జిల్లాల వెనుకబాట నివేదిక వెనుకబాటుతనంలో రాష్ట్రంలోని కొత్త జిల్లాలే ముందు వరసలో ఉన్నాయి. 31 జిల్లాల్లో మహబూబాబాద్, గద్వాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలు అత్యంత వెనుకబాటుతనంతో టాప్‌లో ఉన్నాయి. పాత జిల్లాలు ఉన్నప్పుడు వెనుకబాటుతనం, పేదరికంలో ముందు వరుసలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా తాజాగా 14వ స్థానంలో నిలిచింది. ఇటీవల నీతి ఆయోగ్‌కు పంపించిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. 
11 అంశాల ప్రాతిపదికగా జిల్లాల వెనుకబాటుతనాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. భూమి లేని నిరుపేద కూలీలు, గర్భిణుల సంరక్షణ, ఆసుపత్రుల్లో ప్రసవాలు, పిల్లల ఎదుగుదల, బరువు తక్కువగా ఉండటం, ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్లు, పిల్లలు-ఉపాధ్యాయుల నిష్పత్తి, కరెంటు, రోడ్డు, తాగునీరు లేని గ్రామాలు, మరుగుదొడ్లు లేని ఇళ్లను ప్రామాణికంగా స్వీకరించింది. వీటన్నింటా ఆందోళనకర పరిస్థితులున్న జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది. ఈ అంచనా విధానాన్ని కేంద్రం కంపోజిట్ ఇండెక్స్‌గా పరిగణనలోకి తీసుకుంది. ఈ పరిస్థితులను మొత్తం 100 పాయింట్లకు ఎక్కువ పాయింట్లు సాధించిన జిల్లాల వరుసలో వెనుకబాటుతనాన్ని అంచనా వేసింది. వెనుకబడిన జిల్లాల జాబితాలో మొదటి 10 స్థానాల్లో మహబూబాబాద్, గద్వాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్ రూరల్, నిర్మల్, సూర్యాపేట, వికారాబాద్, ఆదిలాబాద్‌లు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డితో పాటు సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలు అభివృద్ధిలో ముందంజలో నిలిచాయి.

కాళేశ్వరం ప్రాజెక్టుకు తుదిదశ పర్యావరణ అనుమతులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తుదిదశ పర్యావరణ అనుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టుకు ఇప్పటికే అటవీ, భూగర్భ జలశాఖ, కన్‌స్ట్రక్షన్ మెషినరీ డెరైక్టరేట్ అనుమతులురాగా.. కీలకమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు డిసెంబర్ 5న ఢిల్లీలో సమావేశమైన జల సంబంధమైన ప్రాజెక్టుల ‘ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టు నివేదికను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదని తేల్చింది.
 

తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు వైభవంగా సాగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమం డిసెంబర్ 19న జరిగింది. ఎల్‌బీ స్టేడియంలోని పాల్కురికి సోమన ప్రాంగణం పోతన వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు భాష ప్రాధాన్యాన్ని, తెలుగు సాహితీవేత్తల వైభవాన్ని, తెలంగాణ ప్రముఖులను రాష్ట్రపతి తన ప్రసంగం ఆద్యంతం స్మరించుకున్నారు. 
ప్రతి డిసెంబర్‌లో తెలుగు మహాసభలు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఇకపై రాష్ట్రంలో ఏటా తెలంగాణ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్‌లో రెండు రోజుల పాటు సభలు జరుగుతాయని వివరించారు. ఇకపై ఏ మీడియమైనా, ఏ సిలబస్ అయినా ఈ గడ్డపై చదువుకోవాలంటే తెలుగును ఒక సబ్జెక్టుగా కచ్చితంగా నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌దాకా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చదవాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. 


తెలంగాణలో నాలుగు లక్షల మందికి బాల్య వివాహాలు దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో 1.5 కోట్ల మందికి బాల్య వివాహాలు జరగగా.. అందులో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఉన్నట్లు ఎంవీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో గత మూడేళ్లలో 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో 19.4 శాతం మందికి, అబ్బాయిల్లో 4.7 శాతం మందికి బాల్య వివాహం జరిగినట్లు తేలింది. ఎంవీ ఫౌండేషన్ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు, పాఠశాలలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పలు ప్రభుత్వ విభాగాల నుంచి సమాచారం సేకరించింది. బాల్య వివాహాలు చేసుకున్నవారిలో 46 మందిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి.. వారి ప్రస్తుత పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది.
పాలమూరు టాప్.. కరీంనగర్ లాస్ట్ 
బాల్య వివాహాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల బాల్య వివాహాలు జరిగితే.. మహబూబ్‌నగర్‌లోనే 26.2 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాల్లో నల్లగొండ (21.5 శాతం), రంగారెడ్డి (21.1 శాతం), ఖమ్మం, మెదక్ (21 శాతం), వరంగల్ (18 శాతం), ఆదిలాబాద్ (17.8 శాతం), నిజామాబాద్(16.3 శాతం), కరీంనగర్ (14.2 శాతం) జిల్లాలు ఉన్నట్టు ఎంవీ ఫౌండేషన్ సర్వేలో వెల్లడైంది.


టీయూ 142 మ్యూజియం ప్రారంభంవిశాఖపట్నంలో కురుసుర జలాంతర్గామి ఎదురుగా ఏర్పాటు చేసిన టీయూ 142 యుద్ధవిమాన మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 7న ప్రారంభించారు. అనంతరం ఐఎన్‌ఎస్ డేగాలో భారత తొలి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కాల్వరి స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. ఈ మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం వచ్చిన రాష్ట్రపతి ఆంధ్రా విశ్వవిద్యాలయం(ఏయూ)లో ఈ-క్లాస్‌రూమ్ కాంప్లెక్స్, ఇంక్యుబేషన్ సెంటర్ భవనాల శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతీయ మహిళలు ఆదర్శనీయమైన సేవలందిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డీఆర్‌డీవో సీనియర్ సైంటిస్ట్ టెస్సీ థామస్‌ను బాలికలు యువతులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.


రాష్ట్రపతి శీతాకాల విడిది షెడ్యూలు ఖరారుశీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 22న హైదరాబాద్ రానున్నారు. ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 26 వరకు బస చేస్తారు. భారత రాష్ట్రపతి ఏటా డిసెంబర్‌లో శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు రావడం ఆనవాయితీ. ఈ సమయంలోనే దాదాపు 15 రోజుల పాటు రాష్ట్రపతి నిలయం లోకి సందర్శకులను అనుమతిస్తారు.


విశాఖలో సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలుఇండియన్ నేవీలో సబ్‌మెరైన్ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలో డిసెంబర్ 8న సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలు నిర్వహించారు. స్వర్ణోత్సవాలకు త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన భారత నౌకాదళం దేశ రక్షణకే కాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇస్తున్న సహకారం ప్రముఖమైనదని కొనియాడారు.
భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్ కల్వరి సబ్‌మెరైన్ సేవలు 1967లో ప్రారంభించారు. ఈ 50 ఏళ్లలో 25 సబ్‌మెరైన్‌లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి.


చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రారంభంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ ధరకే సరుకులు అందేలా చేపట్టిన చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 12న ప్రారంభించారు. ఈ మేరకు విజయవాడ, గుంటూరులో పెలైట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ‘చంద్రన్న విలేజ్ మాల్’ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇటీవల రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులను చంద్రన్న విలేజ్ మాల్స్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వివిధ బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులు ఎంఆర్‌పీ కంటే 4 నుంచి 35 శాతం తక్కువ ధరకు లభిస్తాయి.


హోంగార్డుల వేతనం 20 వేలకు పెంపుతెలంగాణలో హోంగార్డుల వేతనాలను రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. జనహితలో డిసెంబర్ 14న హోంగార్డులతో చర్చలు జరిపిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 18,900 మంది హోంగార్డులు లబ్ధి పొందుతారు. కానిస్టేబుళ్ల నియామకాల్లో హోంగార్డులకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 10 నుంచి 25 శాతానికి పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.


నిమ్జ్‌లో మౌలిక వసతుల పరికరాల పార్కుదేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ‘మౌలిక సదుపాయాల యంత్ర పరికరాల తయారీ పార్కు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పార్క్)’ ఏర్పాటు కానుంది. జహీరాబాద్‌లోని ‘నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)’లో 500 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డిసెంబర్ 13న బెంగళూరులో శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఫైనాన్‌‌స లిమిటెడ్ అనుబంధ కంపెనీ అట్టివో ఎకనామిక్ జోన్‌‌స ప్రైవేటు లిమిటెడ్ మరియు ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ పార్కులో భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, గనుల తవ్వకాల్లో ఉపయోగించే యంత్ర పరికరాలు తయారు చేస్తారు. దీని వల్ల వచ్చే పదేళ్లలో 10 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.


తమిళనాడు, కేరళలో ఓక్కి తుపానుతమిళనాడు, కేరళలోని దక్షిణ ప్రాంతాల్లో నవంబర్ 30న ‘ఓక్కి’ తుపాను సంభవించడంతో 8 మంది మరణించారు. తుపాను కారణంగా 65 నుంచి 75 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో తిరువనంతపురంలో చేపల వేటకు వెళ్లిన 57 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.
ఓక్కీ అంటే బెంగాలీ భాషలో కన్ను అని అర్థం. తుపాను పేరును ఖరారుచేసే అవకాశం ఈసారి బంగ్లాదేశ్‌కు రావడంతో ఈ పేరును సూచించింది. సామాన్య ప్రజలకు సులువుగా అర్థం కావడానికి ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితికి చెందిన ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సాంఘిక సంఘం (ఇస్కాప్) కలసి 2000 సంవత్సరం నుంచి తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం తీసుకొచ్చాయి.


తెలంగాణలో మహిళల కోసం వీ హబ్తెలంగాణ రాష్ర్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ‘విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ (WE-Hub)’ పేరుతో స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున రూ.15 కోట్లతో ‘టీ-ఫండ్’ పేరిట కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నవంబర్ 30న జీఈఎస్ సదస్సు ముగింపు సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.


తెలంగాణ అర్థగణాంక వార్షిక నివేదిక 2017దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. దశాబ్దకాలంలోనే పట్టణ జనాభా 36 శాతం పెరిగింది. 2001లో రాష్ట్రంలో 98.53 లక్షల పట్టణ జనాభా ఉండగా.. అది 2011లో 1.36 కోట్లకు పెరిగింది. 100 శాతం పట్టణ జనాభా ఉన్న హైదరాబాద్ జిల్లాలో రాష్ట్ర జనాభాలో 30 శాతం మంది నివసిస్తున్నారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 70.22 శాతం, రంగారెడ్డి జిల్లాలో 57.70 శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తోంది. 31 జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన అర్థగణాంక వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.
అర్థగణాంక వార్షిక నివేదిక ముఖ్యాంశాలు.
  • ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 31.51 లక్షల మంది వ్యవసాయంలో ఉన్నారు. కూలీ చేస్తూ ఉపాధి పొందుతున్నవారు 59.15 లక్షల మంది.
  • 2015-16లో 21.80 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల పంటలు సాగవగా.. 51.45 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది.
  • రాష్ట్రంలో ఒక హెక్టారు కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న కమతాలు 62 శాతం ఉండగా.. 1-2 హెక్టార్ల వరకు ఉన్నవి 23.9 శాతం ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో కమతాల సగటు విస్తీర్ణం 1.12 హెక్టార్లుగా ఉంది.
  • రాష్ట్రంలో 1.63 కోట్ల మంది ప్రధాన వృత్తులతో ఉపాధి పొందుతున్నారు.
  • ఏడాదిలో 183.. అంత కంటే ఎక్కువ రోజులు పని చేసేవారు 1.37 లక్షలు. వీరిలో 22.42 లక్షల మంది ఎస్సీలు, 14.58 లక్షల మంది ఎస్టీలు.
  • ఓ మోస్తరు పనులతో 26.22 లక్షల మంది.. కుటీర పరిశ్రమలతో 7.77 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
  • గ్రామాల్లో వ్యవసాయం, వృత్తి పనులు, మోస్తరు పనులతో కాకుండా మిగిలిన రంగాల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న వారు 64.99 లక్షలు. ఏ పనీ చేయని వారు 1.86 కోట్ల మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
  • రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు 13.58 శాతం. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 17.70 శాతం.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674. ప్రతి 1,000 మంది పురుషులకు 988 మంది మహిళలుండగా.. 11 జిల్లాల్లో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంది.
  • నిర్మల్ జిల్లాలో 1,000 మంది పురుషులకు 1,046 మంది మహిళలున్నారు. 1,044 మందితో నిజామాబాద్ రెండో స్థానంలో ఉంది. రంగారెడ్డిలో 1,000 మంది పురుషులకు 950 మంది, హైదరాబాద్ జిల్లాలో 1,000 మంది పురుషులకు 954 మంది మహిళలు ఉన్నారు.
  • రాష్ట్రంలో ఆరేళ్లలోపు పిల్లల జనాభా 38.99 లక్షలు. మొత్తం జనాభాలో వీరు 11.14 శాతం.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 54.08 లక్షలు. ఇది రాష్ట్ర జనాభాలో 15.45 శాతం. ఎస్సీ జనాభాలో ప్రతి 1,000 మంది పురుషులకు 1,008 మంది మహిళలున్నారు.
  • రాష్ట్రంలో ఎస్టీల జనాభా 31.77 లక్షలు. ఇది రాష్ట్ర జనాభాలో 9.08 శాతం. ఎస్టీల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 977 మంది స్త్రీలు ఉన్నారు.
  • ప్రజల్లో జీవన స్థితిగతులు తెలిపే మానవాభివృద్ధి సూచికలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 2015-16 మానవాభివృద్ధి సూచిక రాష్ట్ర సగటు 0.595గా ఉంది.
  • ఈ సూచికలో హైదరాబాద్ (0.82 శాతం)తో తొలిస్థానంలో నిలవగా.. రంగారెడ్డి (0.71 శాతం), ఖమ్మం (0.62 శాతం) జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది.


ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జస్టిస్ మంజునాథ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీలుగా గుర్తించి బీసీ (ఎఫ్) కింద ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వొచ్చని తెలిపింది. ఈ రిజర్వేషన్లు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థిక ప్రయోజనాల్లో మాత్రమే వర్తింపచేయాలని రాజకీయ పదవులకు వద్దని తెలిపింది.
కమీషన్ నివేదికకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం త్వరలోనే దానిని శాసనసభలో ఆమోదించి కేంద్రం అనుమతి కోసం ఢిల్లీకి పంపనుంది. రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 50 శాతానికి మించితే కేంద్రం అనుమతి తప్పనిసరి. జస్టిస్ మంజునాథ ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉండగా సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణ సభ్యులుగా ఉన్నారు.


ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావంఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ మా) గుంటూరు జిల్లా తెనాలిలో డిసెంబర్ 1న ఆవిర్భవించింది. ఈ అసోసియేషన్‌కు కేంద్ర సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్‌రాజా వ్యవస్థాపక చైర్మన్‌గా, సినీనటి కవిత అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నటుడు నరసింహరాజు నియమితులయ్యారు. విభజనానంతరం ఏపీలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి దీనిని ఏర్పాటు చేశారు.


తెలంగాణలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఐటీ క్యాంపస్ప్రపంచంలోనే మొదటిసారిగా ఐటీ రంగంలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ఐటీ క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు డిసెంబర్ 2న వింద్య ఈ-ఇన్ఫో మీడియా సంస్థతో రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్యాంపస్‌ను రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేయడంతోపాటు దివ్యాంగులకు వసతి, శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.


ఎరువుల కొనుగోలుకు ఆధార్ తప్పనిసరితెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎరువులు కొనుగోలు చేయాలంటే ఇకనుంచి ఆధార్ కార్డు సమర్పించాల్సిందేనని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఎరువుల కొనుగోలుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.