Saturday, 15 April 2017

ఏప్రిల్ 2017 రాష్ట్రీయం

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఏప్రిల్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రణబ్.. శతాబ్ది పైలాన్‌ను ఆవిష్కరించారు. 
1918 ఏప్రిల్ 26న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. 


తెలంగాణకు 10 వేల కోట్ల నాబార్డు రుణం2017-18 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో రూ. 10 వేల కోట్ల రుణాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని ప్రతిపాదించామని నాబార్డ్ ప్రకటించింది. 2016-17లో రూ.9,266 కోట్ల రుణాలు చెల్లించామని, ఇది అంతకముందు ఏడాదితో పోలిస్తే 16.22 శాతం అధికమని వెల్లడించింది. 


భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం భూసేకరణ, పునరావాస చట్ట సవరణ బిల్లుని తెలంగాణ శాసనసభ ఏప్రిల్ 30న ఆమోదించింది. ఈ మేరకు గతంలో ఆమోదించిన బిల్లుకి కేంద్రం సూచించిన మూడు సవరణలతో పాటు మరో రెండు సవరణలు చేరుస్తూ ప్రభుత్వం ఈ బిల్లుని తీసుకొచ్చింది. అభివృద్ధి పనులకు భూసేకరణలో జాప్యాన్ని నివారించడం, బాధితులకు తక్షణ ప్రయోజనం కలిగించేందుకు ఈ బిల్లుని ప్రవేశట్టామని ప్రభుత్వం ప్రకటించింది. 


నీటిపారుదల నిపుణులు ఆర్. విద్యాసాగర్‌రావు కన్నుమూతతెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు రాంరాజు విద్యాసాగర్ రావు(78) ఏప్రిల్ 29న హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1939 నవంబర్ 14న రాఘవరావు-లక్ష్మమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించిన విద్యాసాగర్‌రావు స్వస్థలం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం. 
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లో 30 ఏళ్ల పాటు సేవలందించిన విద్యాసాగర్‌రావు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ)లో చీఫ్ ఇంజనీర్(దక్షిణ)గా రెండేళ్లు, కేంద్ర జలవనరుల శాఖ వాటర్ మేనేజ్‌మెంట్ కమిషనర్‌గా ఏడాదికిపైగా పనిచేశారు. తెలంగాణకు నీటి అవసరాలు, కేటాయింపులపై నీళ్లు-నిజాలు పేరిట అనేక వ్యాసాలు రాశారు. ఇంజనీరింగ్ విభాగంలో విశేష కృషికి ఆయనకు 2014లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ సంస్థ ‘లీడింగ్ ఇంజనీరింగ్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా’అవార్డును ప్రదానం చేసింది. 



ఒంటరి మహిళల ఆర్థిక భృతికి మార్గదర్శకాలుతెలంగాణలో ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి కల్పించే పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద ఏప్రిల్ 1 నుంచి లబ్ధిదారులకు నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక భృతి లభించనుంది.
పథకం మార్గదర్శకాలు
  • 18 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు ఏడాదికి పైగా భర్త నుంచి వేరుగా ఉన్న లేదా భర్త వదిలేసి ఉన్నవారు ఒంటరి మహిళలు
  • గ్రామీణ ప్రాంతాల్లో వివాహం చేసుకోని 30 ఏళ్ల పైబడిన వారు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లకు పైగా వయసు కలవారు ఒంటరి మహిళలు
  • వయసు నిర్ధారణకు ఆధార్/ఓటర్ కార్డు/స్కూల్ సర్టిఫికెట్/బర్త్ సర్టిఫికెట్ వంటి పత్రాల్లో ఏదో ఒకటి ఉండాలి.
  • కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు లోపు ఉండాలి.
  • లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మే 8 నుంచి ప్రారంభమై 25కల్లా ముగియనుంది.


మిషన్ భగీరథకు హడ్కో అవార్డ్‌ కేంద్ర గృహ నిర్మాణ, నగరాభివృద్ధి సంస్థ (హడ్కో) 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 25న న్యూఢిల్లీలో అవార్డులు అందించారు. తెలంగాణ ప్రభుత్వ పథకం మిషన్ భగీరథకు హడ్కో అవార్డ్‌ లభించింది. దీంతోపాటు రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఫార్మసీ, నిమ్జ్), గ్రామీణ విభాగాల్లో తెలంగాణకు అవార్డులు దక్కాయి. 

ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఏప్రిల్ 20న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లభించినట్లయింది.
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య పదవీకాలం మార్చి 29తో ముగిసింది. అలాగే వైఎస్సార్‌సీపీ సభ్యుల బలం ఎనిమిది (కాంగ్రెస్ కన్నా అధికం)కి చేరుకుంది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరిస్తున్న ఉమ్మారెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తూ చైర్మన్ చక్రపాణి నిర్ణయం తీసుకున్నారు.


తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక - 2017మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం (2011-12 నాటికి) దేశంలో 10వ స్థానంలో నిలిచింది. 2004-05లో 13వ స్థానంలో ఉంది. ఈ మేరకు ఏప్రిల్ 21న విడుదలైన తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక - 2017 ఈ వివరాలను వెల్లడించింది. సెంటర్ ఫర్ ఎకనమిక్, సోషల్ స్టడీస్ (సెస్) ఈ నివేదికను రూపొందించింది. 
నివేదికలోని ముఖ్యాంశాలు 
సమాజంలో కొనసాగుతున్న అసమానతలు
  • రాష్ట్రంలోని జిల్లాలు, గ్రామీణ - పట్టణ ప్రాంతాలు, కులాలు, స్త్రీ, పురుషులు, వృత్తి వర్గాల మధ్య ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయని నివేదిక వివరించింది.
  • 2004-05లో భారతదేశ మానవాభివృద్ధి సూచీ 0.361 కాగా, రాష్ట్రం విలువ 0.343గా నమోదైంది. 2011-12లో దేశ సూచీ విలువ 0.48కు పెరగగా, రాష్ట్రం విలువ అంతకు మించి 0.513గా నమోదైంది.
హైదరాబాద్ టాప్.. మెదక్ లాస్ట్రాష్ట్ర స్థాయిలో హెచ్‌డీఐ ర్యాంకింగ్‌‌సలో హైదరాబాద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా మెదక్ జిల్లా మరో స్థానం పతనమై అట్టడుగున నిలిచింది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు తమ స్థానాలు నిలబెట్టుకోగా, మిగిలిన 5 జిల్లాల ర్యాంకుల్లో స్పల్ప మార్పులొచ్చాయి.
మాతా, శిశు మరణాలు..వైద్య సదుపాయాల లేమితో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆరోగ్య స్థితిగతుల్లో మార్పు రాలేదు. జాతీయ కుటుంబ సర్వే 2015-16 ప్రకారం రాష్ట్రంలో శిశు మరణాల రేటు 28. తల్లుల మరణాల రేటు విషయంలో జిల్లాల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయి. హైదరాబాద్‌లో తల్లుల మరణాల రేటు 71 ఉండగా, ఆదిలాబాద్‌లో 152 ఉంది. 
ఆర్థికాభివృద్ధి-మానవాభివృద్ధి మధ్య పెరిగిన దూరంరాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి మధ్య సంబంధం బలహీనపడింది. 2004-05తో పోల్చితే సమాన మానవాభివృద్ధి సాధించేందుకు 2011-12లో మూడు రెట్ల ఆర్థికాభివృద్ధి సాధించాల్సి ఉంది. మానవాభివృద్ధికి సమ్మిళిత అభివృద్ధి లేని అధిక ఆర్థికాభివృద్ధి కన్నా సమ్మిళిత అభివృద్ధి సహకరించింది. తక్కువ ఆర్థికాభివృద్ధి ఉన్నా సమ్మిళిత అభివృద్ధి గల జిల్లాలు అధిక ఆర్థికాభివృద్ధి గల జిల్లాలతో మెరుగైన మానవాభివృద్ధిని సాధించాయి. అంటే ఆర్థికాభివృద్ధికి మానవాభివృద్ధితో సంబంధం లేదని తెలుస్తోంది.
సామాజికంగా..ఎస్టీల హెచ్‌డీఐతో పోల్చితే ఓసీల హెచ్‌డీఐ 2002-04లో 2.20 రెట్లు అధికంగా ఉండగా, 2007-08లో 1.73 రెట్లకు తగ్గింది. కాలంతో పాటు సామాజిక తరగతుల మధ్య హెచ్‌డీఐ వ్యత్యాసాలు తగ్గుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాల హెచ్‌డీఐ అధికంగా ఉంది. గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గాయి. 
స్త్రీ, పురుషుల మధ్య..రాష్ట్రంతో పాటు జిల్లాలో కూడా 2004-05తో పోల్చితే 2011-12లో స్త్రీ, పురుషుల హెచ్‌డీఐ పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్రమంతటా స్త్రీ, పురుష హెచ్‌డీఐ విలువలో వ్యత్యాసాలు తగ్గాయి. ఆదాయం, విద్య, ఆరోగ్య అంశాల్లో సాధించిన వృద్ధి వల్లే హెచ్‌డీఐలో లింగ వ్యత్యాసాలు తగ్గాయి. అయితే, స్త్రీ, పురుషుల మధ్య విద్యాభివృద్ధిలో వ్యత్యాసాలు అధికంగా ఉన్నాయి.
ప్రైవేటు విద్యకు..ప్రైవేటు పాఠశాలలతో పోల్చితే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల విద్యా ఫలితాలు తక్కువగా ఉన్నాయి. పిల్లల విద్య పట్ల తల్లిదండ్రుల ఆకాంక్షాలు పెరిగాయి. నిరక్షరాస్య తల్లులు కూడా తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపిస్తున్నారు. అయితే, ప్రైవేటు స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీలు, ఇతర పేద వర్గాల విద్యార్థులు, అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. పాఠశాల విద్య విషయంలో లింగ, కుల, తరగతుల మధ్య అగాధాన్ని ఆదాయ వ్యత్యాసాలు తీవ్రంగా పెంచేశాయి.


‘పంచాయతీరాజ్ దివస్’లో తెలంగాణకు 8 అవార్డులుజాతీయ పంచాయతీ రాజ్ దివస్‌ను పురస్కరించుకొని ఉత్తమ పనితీరు కనబరిచిన స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 24న అవార్డులను అందజేసింది. ఇందులో తెలంగాణకు 8 అవార్డులు దక్కాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన పంచాయతీ దివస్ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల ప్రజాప్రతినిధులు పురస్కారాలను అందుకున్నారు. 
అవార్డు గ్రహీతలు 
రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కార్ - సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ సర్పంచ్ లక్ష్మీయాదమ్మ 
పంచాయతీ స్వశక్తి కరణ్ పురస్కార్ - కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, వనపర్తి జిల్లా ఘనపూర్ ఎంపీపీ కృష్ణ నాయక్, భూపాలపల్లి జిల్లా తాడ్వాయి ఎంపీపీ శ్రీదేవి, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ సర్పంచ్ భాగ్య, సిరిసిల్ల జిల్లా కస్బెకట్కూర్ సర్పంచ్ మంజుల, గోపాల్ రావుపల్లి సర్పంచ్ రాంరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నిజలాపూర్ సర్పంచ్ ఇంద్రయ్య 


సీఆర్‌డీఏకు హడ్కో అవార్డుఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పనలో వినూత్న ఆలోచనలతో కృషి జరిపినందుకు సీఆర్‌డీఏకు హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) అవార్డును ప్రకటించింది. ఏప్రిల్ 25న హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య చేతులు మీదుగా సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈ అవార్డును అందుకోనున్నారు.


ఏపీ పరిష్కార వేదిక కాల్‌సెంటర్ ప్రారంభంప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ సమీపంలోని గుంటుపల్లిలో ‘పరిష్కార వేదిక’ పేరిట ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏప్రిల్ 21న ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడిచే ఈ కాల్‌సెంటర్‌లో 500 మంది సిబ్బంది పనిచేయనున్నారు. వీరంతా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి సలహాలు స్వీకరించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదించనున్నారు. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎమ్మెస్, వాయిస్ రెస్పాన్స్, వెబ్ చాట్, సోషల్ మీడియా ద్వారా ఈ కాల్‌సెంటర్‌ను సంప్రదించవచ్చు. 


హైదరాబాద్‌లో జాతీయ వ్యవసాయ సదస్సు హైదరాబాద్‌లో ఏప్రిల్ 22 నుంచి 24 వరకూ మూడు రోజుల పాటు జాతీయ వ్యవసాయ సదస్సు జరిగింది. సర్వారెడ్డి వెంకు రెడ్డి ఫౌండేషన్ ఫర్ డెవలప్‌మెంట్, పార్టిసిపేటరీ రూరల్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్‌‌స సొసైటీ, ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహించాయి. 


రష్యాతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఒప్పందంవ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రష్యాకు చెందిన చెల్యా బినిస్క్‌తో ఏప్రిల్ 22న ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలో పండే వరి, మామిడి, మసాలా దినుసులతో పాటు సిరామిక్స్‌ను ఎగుమతి చేయడంతో పాటు ఆ ప్రాంతం నుంచి బీన్‌‌స, పిస్తాలను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


విశాఖ స్టీల్‌లో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ ప్రారంభం విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మించిన 120 మెగావాట్ల గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ మేరకు ఏప్రిల్ 22న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌధురి బీరేంద్ర సింగ్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కావాల్సిన విద్యుత్‌ను సొంతంగా ఉత్పిత్తి చేసుకోవాలనే లక్ష్యంతో ఈ గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్‌ను నిర్మించారు. 


‘వీధి కుక్కల దత్తత’ ను ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ( జీహెచ్‌ఎంసీ) వీధి కుక్కల దత్తత అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఏప్రిల్ 23న మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో తొలి రోజు ఐదు కుక్క పిల్లలను జంతు ప్రేమికులు దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలో వీధి కుక్కల సంఖ్యను తగ్గించాలనేది జీహెచ్‌ఎంసీ లక్ష్యం. 


స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశంగా చార్మినార్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద ‘స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ఇనీషియేటివ్’ రెండో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 10 ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 25న ప్రకటించింది. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్‌కు ఇందులో చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల దేవాలయం, తిరుపతి నగరాలకు స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాల మొదటి జాబితాలో చోటు లభించింది. 
ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 100 ప్రసిద్ధ, వారసత్వ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలను స్వచ్ఛ ఐకానిక్‌గా గుర్తించి ఆయా ప్రదేశాల్లో పరిశుభ్రత, సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతారు. 


నీరు-ప్రగతి కార్యక్రమం ప్రారంభంరాష్ట్ర స్థాయి ‘నీరు-ప్రగతి’ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పామిడిలో ఏప్రిల్ 20న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని 3.42 లక్షల పంట కుంటలను జాతికి అంకితం చేయడంతోపాటు పైలాన్ ఆవిష్కరించారు.

నిజామాబాద్ మార్కెట్‌కు జాతీయ అవార్డుఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెటింగ్ విధానం (ఈ-నామ్) అమలులో నిజామాబాద్ మార్కెట్‌కు ‘ప్రధాన మంత్రి అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్‌‌స ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ - 2017’ దక్కింది. 11వ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 21న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా అవార్డు స్వీకరించారు. ఈ-నామ్ విభాగంలో ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సోలన్ జిల్లా, ఇతర రాష్ట్రాల కేటగిరీలో నిజామాబాద్ జిల్లా ఎంపికైంది. 


కనెక్ట్ ఏపీ సీఎం యాప్ ప్రారంభం ‘కనెక్ట్ ఏపీ సీఎం’ పేరుతో రూపొందించిన సరికొత్త యాప్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 14న అమరావతిలో ప్రారంభించారు. ప్రభుత్వంపై ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ఈ యాప్ ద్వారా పంపవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్‌కు చెందిన కైజాలా ఫ్లాట్‌ఫార్మ్‌పై పనిచేస్తుంది. 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016 కృష్ణా పుష్కరాల కోసం మొదటిసారి కైజాలా యాప్‌ను ప్రారంభించింది. 


వంద శాతం వైద్య బీమా కలిగిన గ్రామంగా పెదపులిపాకఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పెదపులిపాక దాతల సహాయంతో వంద శాతం వైద్య బీమా కలిగిన గ్రామంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా గ్రామ ప్రజలందరికీ వైద్య బీమా కోసం అయ్యే వ్యయాన్ని భరించేందుకు ఎన్‌ఆర్‌ఐ మాధవి మేడి ముందుకొచ్చారు. దీంతో ఏప్రిల్ 14న గ్రామ ప్రజలందరికీ వార్షిక వైద్య బీమా సౌకర్యం కల్పించారు. పెదపులిపాక గ్రామానికే చెందిన మాధవి మేడి ప్రస్తుతం టెక్సాస్‌లో ఉంటున్నారు. 

విశాఖ-అరకు అద్దాల రైలు ప్రారంభంవిశాఖపట్నం-అరకు మధ్య అద్దాల (విస్టాడోమ్) రైలు ఏప్రిల్ 16న ప్రారంభమైంది. రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు భువనేశ్వర్ నుంచి వీడియో లింక్ ద్వారా రైలుని జాతికి అంకితం చేశారు. పర్యాటకంగా అరకుని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ రైలుని ప్రవేశపెట్టారు. దీన్ని కిరండోల్ పాసింజర్‌కు అనుసంధానం చేసి నడుపుతారు. 


రిజర్వేషన్ల బిల్లుకి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు శాసనమండలి, శాసనసభ ఏప్రిల్ 16న ఆమోదం తెలిపాయి. ‘తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో సీట్లు, సర్వీసుల్లో నియామకాలు లేదా పదవుల రిజర్వేషన్లు) బిల్లు-2017’ పేరుతో ప్రభుత్వం ఈ బిల్లుని ప్రవేశపెట్టింది. 
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, రాష్ట్ర సర్వీసుల కింద నియామకాలకు ప్రస్తుతమున్న 50 శాతం రిజర్వేషన్లను 62 శాతానికి పెంచుతున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ముస్లింల (బీసీ-ఈ) రిజర్వేషన్‌ను 4 నుంచి 12 శాతానికి, గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నట్లు పొందుపరిచారు. ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుని ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. 


బ్రిక్స్ దేశాల ప్రత్యేక రాయబారుల సదస్సుబ్రిక్స్ దేశాల ప్రత్యేక రాయబారుల సమావేశం ఏప్రిల్ 11న విశాఖపట్నంలో జరిగింది. మధ్యప్రాచ్యంలో శాంతిభద్రతల ప్రక్రియ, తీవ్రవాదం వంటి అంశాలపై బ్రిక్స్ దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు.

యార్లగడ్డ రచించిన 'హిల్లరీ క్లింటన్' పుస్తకావిష్కరణరాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘చెదిరిన శ్వేత సౌధ స్వప్నం - హిల్లరీ క్లింటన్’ పుస్తకావిష్కరణ ఏప్రిల్ 4న అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగింది. తానా వ్యవస్థాపకుల్లో ఒకరైన డా.ముక్కాముల అప్పారావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. 


తెలంగాణలో రైతు రుణమాఫీ పూర్తితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీకి ఏప్రిల్ 11న రూ. 4 వేల కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల విడుదలతో రాష్ట్రంలో రుణమాఫీ పూర్తయింది. ఈ పథకం కింద ప్రభుత్వం నాలుగు విడతల్లో కలిపి మొత్తం రూ.16,374 కోట్లు విడుదల చేసింది. 35.3 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. 

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తెలంగాణ వెబ్‌సైట్ తెలంగాణ ఉన్నత విద్యా మండలి దేశంలోనే మొదటి సారిగా ఆన్‌లైన్‌లో విద్యార్థుల సమాచారాన్ని ఉచితంగా పొందే అవకాశాన్ని ఏప్రిల్ 11 నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు tsstudentverification.org వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. విద్యార్హతలకు సంబంధించి విద్యార్థులు ఇచ్చిన సమాచారాన్ని సంస్థలు లేదా వ్యక్తులు ఈ వెబ్‌సైట్ ద్వారా ధ్రువీకరించుకోవచ్చు. 2012 నుంచి పాసైన విద్యార్థుల సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. 


వైద్యుడు వాడ్రేవు రాజుకు హాల్ ఆఫ్ ఫేంలో చోటు ఇండో అమెరికన్ వైద్యుడు వాడ్రేవు రాజు ప్రతిష్టాత్మక గ్లోబల్ మెడికల్ మిషన్‌‌స హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 12న ఆ సంస్థ ప్రకటించింది. ‘ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా‘ స్వచ్ఛంద సంస్థను స్థాపించిన వాడ్రేవు రాజు.. పేదరికం, వైద్యసాయం అందని కారణంగా అంధులుగా మారిన చిన్నారుల కోసం ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
ప్రపంచ వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న వారిని గుర్తించి గ్లోబల్ మెడికల్ మిషన్‌‌స ఆఫ్ హాల్ ఆఫ్ ఫేమ్ సంస్థ ఏటా ఈ హోదాతో గౌరవిస్తుంది. 


ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్న రేవంత్తెలుగు గాయకుడు ఎల్‌వీ రేవంత్ (25) ఇండియన్ ఐడల్ సీజన్- 9 విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 2న ముంబైలో జరిగిన ఫైనల్లో పీవీఎన్‌ఎస్ రోహిత్, ఖుదా భక్ష్‌లతో హోరాహోరీగా తలపడి రూ.25 లక్షల నగదు బహుమతితో పాటు సచిన్ నుంచి ట్రోఫీ అందుకున్నాడు. అలాగే యూనివర్సల్ మ్యూజిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ సీజన్- 5 టైటిల్ గెలుచుకున్నాడు.


ఏపీలో హెచ్‌సీఎల్ ఏర్పాటుకు ఒప్పందంవిజయవాడలో హెచ్‌సీఎల్.. బీపీవోను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌సీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

వరంగల్‌లో పాస్‌పోర్ట్ కేంద్రం ప్రారంభంవిదేశాంగ మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్‌లో ఏర్పాటు చేసిన పాస్ పోర్ట్ కేంద్రం మార్చి 29న ప్రారంభమైంది. హన్మకొండ హెడ్ పోస్టాఫీస్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ఇది తెలంగాణలో రెండోది కాగా హైదరాబాద్‌లో ఉన్నది మొదటిది. 


హైదరాబాద్ హైకోర్టులో తొలి డిజిటల్ లైబ్రరీ ప్రారంభందేశంలో తొలి అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ వెబ్‌సైట్ ఉమ్మడి హైకోర్టులో ప్రారంభమైంది. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాలు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ లైబ్రరీని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ మార్చి 30న ప్రారంభించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు వెలువరించిన తీర్పులు, ఉభయ రాష్ట్రాలు, కేంద్ర చట్టాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. ప్రైవేట్ లీగల్ జర్నల్స్ నుంచి రూ. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసే తీర్పు కాపీలనూ ఇకపై లైబ్రరీ నుంచి ఉచితంగా పొందవచ్చు. 

ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా రెడ్డి సుబ్రమణ్యంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్డి సుబ్రమణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో సుబ్రమణ్యంను ఎన్నుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట గ్రామ సర్పంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి సుబ్రమణ్యం ఈ స్థాయికి చేరుకున్నారు. కాగా శాసన మండలిలో 14 మంది సభ్యుల పదవీ కాలం మార్చి 30న ముగియడంతో వారి స్థానంలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
కొత్తగా ఎన్నికైన 14 మంది సభ్యులు
వై.శ్రీనివాసులురెడ్డి
విఠపు బాలసుబ్రమణ్యం
వెన్నపూస గోపాల్‌రెడ్డి
ఆళ్ల నాని
గంగుల ప్రభాకర్‌రెడ్డి
బచ్చుల అర్జునుడు
కరణం బలరామకృష్ణమూర్తి
జి.దీపక్‌రెడ్డి
డొక్కా మాణిక్య వరప్రసాద్
బీటెక్ రవి
పోతుల సునీత
పి.వి.ఎన్.మాధవ్
కత్తి నరసింహారెడ్డి
యండపల్లి శ్రీనివాసులురెడ్డి


హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి.వివేక్ (వివేకానంద్) ఘన విజయం సాధించారు. జనవరి 17న జరిగిన ఎన్నికల్లో మొత్తం 216 ఓట్లకుగాను 206 ఓట్లు పోలయ్యాయి. ఇందులో డాక్టర్ వివేక్‌కు 136 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి విద్యుత్ జయసింహకు 68 ఓట్లు దక్కాయి. ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న అనిల్ కుమార్‌కు 138 ఓట్లు లభించగా అభ్యర్థి ఇమ్రాన్ మహమూద్ 86 ఓట్లు దక్కాయి.


ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా దినేష్ కుమార్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి దినేష్‌కుమార్ మార్చి 31న బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్ అజేయ కల్లం పదవీ కాలం ముగియడంతో ఆయన ఈ బాధ్యతలు అందుకున్నారు. నెలరోజుల క్రితం పదవీ విరమణ చేసిన ఎస్‌పీ టక్కర్ స్థానంలో అజేయ కల్లంను నియమిస్తూ.. మార్చి 31న ఆయన పదవీకాలం ముగియగానే దినేశ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం జీవో జారీ చేసింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కుఆంధ్రప్రదేశ్‌లో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, మలేసియా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఏప్రిల్ 1న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌ల సమక్షంలో ఏపీ, మలేషియా అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
పార్కు ఏర్పాటులో భాగంగా మొదటి విడతలో రూ.400 కోట్ల పెట్టుబడులతో బియ్యం, జొన్న, చెరుకు వ్యర్థాలను ఉపయోగించి ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ వస్తువుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రెండో విడతలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో క్లీన్ టెక్నాలజీ, రోబోటిక్స్, డిజిటల్ ప్లాట్‌ఫాం, బిగ్ డేటా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు.


కడపలో పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రారంభంవైఎస్సార్ కడప జిల్లాలో పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటైంది. ఈ మేరకు పాస్‌పోర్ట్ సేవల కార్యాలయాన్ని ఏప్రిల్ 3న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రం కడపతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలకు సేవలందిస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లోకి కొత్తగా 11 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 11 మందికి కేబినెట్‌లో చోటు దక్కింది. ఈ మేరకు వెలగపూడిలోని సచివాలయంలో ఏప్రిల్ 2న గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 
ఐదుగురు మంత్రులకు ఉద్వాసన, కొత్తగా 11 మంది చేరికతో ఏపీ కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 26కు చేరింది. ( ఏపీ కేబినెట్ గరిష్ఠ మంత్రుల సంఖ్య 26). 
కొత్త మంత్రులు 
నారా లోకేశ్
కిమిడి కళావెంకట్రావు
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
నక్కా ఆనంద్‌బాబు
పితాని సత్యనారాయణ
కొత్తపల్లి జవహర్
కాల్వ శ్రీనివాసులు
భూమా అఖిలప్రియ
అమర్‌నాథ్‌రెడ్డి
ఆదినారాయణరెడ్డి

ఉద్వాసనకు గురైనవారు 
కిమిడి మృణాళిని
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
పీతల సుజాత
రావెల కిషోర్‌బాబు
పల్లె రఘునాథ్‌రెడ్డి


No comments:

Post a Comment