Thursday, 28 June 2018

మే 2018 రాష్ట్రీయం

డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి హడ్కో అవార్డు 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి హడ్కో అవార్డు లభించింది. దీంతోపాటు మరో ఐదు అవార్డులను కూడా తెలంగాణ సొంతం చేసుకుంది. హౌసింగ్ డిజైనింగ్ విభాగంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి రెండు, బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పర్యావరణ నిర్వహణ, గ్రీన్ బిల్డింగ్‌‌స విభాగంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్ భగీరథలు ఒక్కొక్కటి చొప్పున అవార్డులను దక్కించుకున్నాయి. ఏప్రిల్ 25న హడ్కో 48వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పుర్కరించుకొని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు.
వివిధ విభాగాల్లో వినూత్న విధానాలు ప్రవేశపెట్టి మంచి ఫలితాలను సాధిస్తున్న రాష్ట్రాలు, ప్రభుత్వ విభాగాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అవార్డులను ప్రదానం చేస్తుంది.



టీయాప్ ఫోలియో ఆవిష్కరణ ప్రభుత్వ సేవలను సులభంగా పొందేందుకు వీలుగా ‘టీయాప్ ఫోలియో’ అనే మొబైల్ అప్లికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 25న ప్రారంభించింది. దీని ద్వారా మీసేవా కేంద్రాలకు వెళ్లకుండా దాదాపు 150 ప్రభుత్వ సర్వీసులును పొందవచ్చు. ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ సంస్థలు రూపొందించిన ఈ యాప్‌తో మొబైల్, ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసుకొని వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు, స్థానికత గుర్తింపు, రిజర్వేషన్ బుకింగ్ వంటి సేవలు పొందవచ్చు.


ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత 
నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 25న హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. 1950 డిసెంబర్ 25న నెల్లూరులో జన్మించిన ఆనం విలక్షణ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 


ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 
పార్లమెంట్, శాసన సభ్యులపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా గుర్తించి సెషన్స్ జడ్జి స్థాయిలో హైదరాబాద్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది.


అంగన్‌వాడీ కేంద్రం హెల్ప్‌లైన్ ప్రారంభం 
అంగన్‌వాడీల్లో మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు 155209 నంబర్ ను హైదరాబాద్‌లో ప్రారంభించారు.


తమిళనాడులో అమ్మ అని’ పార్టీ ఆవిష్కరణ 
తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ సోదరుడు దివాకరన్ ‘అమ్మ అని’ (అమ్మ శిబిరం) పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. ఈ మేరకు శశికళ మార్గదర్శకంలోనే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు దివాకరన్ ఏప్రిల్ 29న ప్రకటించారు. శశికళ ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఇటీవల ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ పార్టీని ఏర్పాటు చేశాడు. 
 

ఏపీలో అన్ని బస్సులకు లైవ్ ట్రాక్ విధానం 
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ రాష్ట్రంలోని అన్ని బస్సులకు లైవ్ ట్రాక్ విధానాన్ని అందుబాటులోకి తె చ్చింది. దీని కోసం లైవ్ ట్రాక్ (డ్రీమ్ స్టెప్) అనే యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా గ్రామీణ ప్రయాణికులు కూడా బస్సు ఎక్కడ ఉంది? ఎంత సేపట్లో వస్తుంది? వంటి వివరాలు తెలుసుకోవచ్చు. మహిళలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా, ఓవర్ స్పీడ్‌తో నడుపుతున్నా ఈ యాప్ ద్వారా ఆర్టీసీకి ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఇప్పటివరకు దూర ప్రాంతాలకు వెళ్లే గరుడ, సూపర్ లగ్జరీ, లగ్జరీ బస్సులకు మాత్రమే ఈ విధానం అందుబాటులో ఉండగా తాజాగా పల్లె వెలుగు బస్సులకు కూడా అమర్చారు.


ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి 
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు చేపట్టిన ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ఈ మేరకు ఓఆర్‌ఆర్ నిర్మాణంలో చివరి దశ అయిన కండ్లకోయ జంక్షన్‌ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు మే 1న ప్రారంభించారు. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఓఆర్‌ఆర్‌గా హైదరాబాద్ ఓఆర్‌ఆర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కనుంది.
2004 అక్టోబర్ 19న నాటి ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు పనులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. 2006 మే 29న వైయస్‌ఆర్‌తో కలిసి అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఓఆర్‌ఆర్ పనులకు శంకుస్థాపన చేశారు. 12 ఏళ్లలో మొత్తం 158 కి.మీ. మార్గంను రూ.6,696 కోట్ల వ్యయంతో నిర్మించారు.


నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి మూడో ర్యాంకు 
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై)కింద గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పనకు సంబంధించి ఉత్తమ పనితీరు కనబరచిన మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఒడిశా మొదటి స్థానంలోనూ, కేరళ రెండో స్థానంలోనూ నిలిచాయి.

ఏప్రిల్ 2018 రాష్ట్రీయం

రైతుబంధు పథకంపై ఎంఐటీ అధ్యయనం తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు ప్రారంభించనున్న ‘రైతుబంధు’ పథకం అమలు తీరుపై అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అధ్యయనం చేయనుంది. 120 మండలాలను కంప్యూటర్ ద్వారా ర్యాండమ్‌గా పరిశీలించి ‘హై ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ ఎవాల్యువేషన్’ పేరిట ఒక నివేదిక రూపొందించనుంది. ఈ అధ్యయనంలో పథకం అమలులో వ్యవసాయ, రెవెన్యూ శాఖల పనితీరు, సామర్థ్యాలను అంచనా వేయడంతో పాటు రైతుల జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలను తెలుసుకుంటారు.


జీహెచ్‌ఎంసీకి పీఎం ఎక్సలెన్సీ అవార్డు
ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎంపికైంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో జీహెచ్‌ఎంసీ కి ఈ అవార్డు ఇవ్వనున్నట్లు ఏప్రిల్ 19న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 21న ఢిల్లీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అవార్డును స్వీకరించారు.


డిప్యూటీ కలెక్టర్‌గా కిడాంబి శ్రీకాంత్
భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా నియమితుడయ్యాడు. ఈ మేరకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) అనిల్ చంద్ర పునీత ఏప్రిల్ 19న నియామక పత్రాలు అందజేశారు. ఏపీ ప్రభుత్వం క్రీడల కోటాలో ఇదివరకే బ్యాడ్మింటన్ మహిళా క్రీడాకారిణి పి.వి. సింధును కూడా డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది.


చంద్రన్న పెళ్లి కానుక పథకం ప్రారంభం 
పేద ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు పథకానికి సంబంధించిన లోగో, వెబ్‌సైట్‌ను ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 18న ఆవిష్కరించారు. పథకంలో భాగంగా ఎస్టీ, మైనారిటీలకు రూ. 50,000, ఎస్సీలకు రూ.40,000, బీసీలకు రూ.35,000, దివ్యాంగులకు లక్ష రూపాయలను కానుకగా ఇస్తారు. కులాంతర వివాహాలు చేసుకునే దళితులకు రూ.75,000, బీసీలకు రూ.50,000 లను అందజేస్తారు. మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 20 శాతం, పెళ్లి రోజున 80 శాతం ఆర్థిక సాయాన్ని అందిస్తారు.


మే 10 న రైతుబంధు పథకం ప్రారంభం
తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన రైతు బంధు పథకం మే 10న ప్రారంభం కానుంది. దాదాపు 58 లక్షల మంది రైతులకు అదే రోజున కొత్త పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ మేరకు ఏప్రిల్ 21న ప్రగతిభవన్‌లో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా వ్యవసాయాధికారులకు పథకం అమలుపై కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు.
ఈ పథకం కోసం 2018-19 బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఇందులో మొదటి దశ వర్షాకాలం పంట (ఖరీఫ్) పెట్టుబడి కోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తారు.


తెలంగాణలో 12,751 గ్రామపంచాయతీలు
తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త పంచాయతీలు, వార్డుల సంఖ్యకు సంబంధించిన తాజా సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 21న విడుదల చేసింది. దీని ప్రకారం అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 12,751 గ్రామపంచాయతీలు, 1,13,380 వార్డులు ఉన్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 844, అతి తక్కువగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో 61 గ్రామపంచాయతీలున్నాయి.
కొత్త జిల్లాలకు ముందు ఒక గ్రామపంచాయతీలో ఒకటి, అంతకంటే ఎక్కువ రెవెన్యూ గ్రామాలు ఉండగా పునర్విభజన తర్వాత ఒక రెవెన్యూ గ్రామంలో ఒకటి కంటే ఎక్కువగా గ్రామాలు ఉన్నాయి. గతంలో 500 జనాభాకంటే ఎక్కువ ఉన్న ఆవాసాలు మాత్రమే గ్రామపంచాయతీలుగా ఉండేవి. పునర్విభజన తర్వాత 300 కంటే తక్కువ జనాభా ఉన్న ఆవాసాలు కూడా గ్రామ పంచాయతీలుగా మారాయి.


వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంత్ కన్నుమూత
ప్రముఖ వాగ్గేయకారుడు, రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు (98) ఏప్రిల్ 22న విజయవాడలో కన్నుమూశారు. సంగీత, సాహిత్యాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రజనీకాంతరావు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు. ఆకాశవాణి రజనీకాంతరావుగా ప్రసిద్ధులైన ఆయన 1920 జనవరి 29న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. 1941లో మద్రాస్ ఆలిండియా రేడియోలో ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా చేరి స్టేషన్ డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. 1947 ఆగస్ట్ 15న బాలాంత్రపు స్వయంగా రచించిన ‘‘మోగించు జయభేరి..వాయించు నగారా’’ గీతం మద్రాసు ఆకాశవాణి నుంచి ప్రసారమైంది.
రజనీకాంత్ రచించిన ‘వాగ్గేయకార చరిత్ర’కి 1961లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దీంతోపాటు కళారత్న అవార్డు, కళాప్రపూర్ణ, ప్రతిభామూర్తి జీవితకాల సాఫల్య బహుమతి, నాథ సుధార్ణవ, పుంభావ సరస్వతి, నవీన వాగ్గేయకార వంటి పురస్కారాలను ఆయన అందుకున్నారు. 2015లో ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు వెలుగు పురస్కారంతో సత్కరించింది.


తూర్పు గోదావరిలో వంద శాతం ఎల్‌ఈడీ దీపాలు
దేశంలోనే వంద శాతం ఎల్‌ఈడీ దీపాలు అమర్చిన తొలి జిల్లాగా తూర్పుగోదావరి నిలిచింది. సుమారు మూడు లక్షలకు పైగా ఎల్‌ఈడీ దీపాలను ఈ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ద్వారపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపినందుకు విజయనగరం కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు ఉత్తమ కలెక్టర్ అవార్డు ను ప్రదానం చేశారు.


శ్రీసిటీకి అంతర్జాతీయ అవార్డు
చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీకి ‘గోల్డన్ గ్లోబ్ టైగర్స్’ అంతర్జాతీయ అవార్డు లభించింది. ఇంటిగ్రేటడ్ టౌన్‌షిప్ ఆఫ్ ది ఇయర్-ఇండియా విభాగంలో వచ్చిన ఈ అవార్డును ఏప్రిల్ 23న మలేషియాలో జరిగిన కార్యక్రమంలో శ్రీసిటీ ఫౌండేషన్ అధ్యక్షుడు రమేష్ సుబ్రమణ్యం అందుకున్నారు. అలాగే మలేషియాకు చెందిన యూఎస్‌బీ బొరాల్ కంపెనీ కూడా ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే శ్రీసిటీ రెండు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.


తెలంగాణకు ఈ పంచాయతీ’ అవార్డు 
తెలంగాణకు జాతీయ స్థాయిలో ‘ఈ పంచాయతీ’ పురస్కారం దక్కింది. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖలోని పలు పథకాల వెబ్‌సైట్లను ఏర్పాటుచేసి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్ చేయడంలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఈ అవార్డు దక్కింది. పంచాయతీరాజ్ దివస్‌ను పురస్కరించుకుని ఏప్రిల్ 24న మధ్యప్రదేశ్‌లోని రాంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ అవార్డును అందుకున్నారు. 2016-17లో పంచాయతీల పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.


క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏప్రిల్ 21న ప్రకటించారు. 

తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు
తెలంగాణలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఏప్రిల్ 20న అధికారిక లేఖ పంపింది. లేఖలో సత్వరమే ఆసుపత్రికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించాలని రాష్ట్రాన్ని సూచించింది.

సింగరేణి సీఎండీకి ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అవార్డు సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆసియా పసిఫిక్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అవార్డు వరించింది. ఆసియాలోని వివిధ ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల పనితీరు ఆధారంగా గనులు, ఇంధనం విభాగాల్లో ఉత్తమ ప్రతిభ, అసమాన కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డు ప్రకటిస్తున్నట్లు ఎంటర్‌ప్రైజ్ ఆసియా కంపెనీ ప్రకటించింది.

ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న చంద్రబాబు
సింగపూర్‌లో ఏప్రిల్ 13న జరిగిన ‘ హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్’ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఈశ్వరన్, ఇతరపముఖులతో సమావేశమయ్యారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ కార్యకలాపాలను విస్తరించేందుకు త్వరలో ఏపీకి తమ బృందాన్ని పంపుతామని టోనీ బ్లెయిర్ చెప్పారు.


డిండి’ ప్రాజెక్టుకు విద్యాసాగర్ రావు పేరు 
ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటి రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం’’గా పరిగణిస్తారు.
‘సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన వివక్షను విద్యాసాగర్‌రావు ఎలుగెత్తి చాటారు. సంక్లిష్టమైన విషయాలను సులువుగా అర్థమయ్యేలా చెప్పి ప్రజలను చైతన్య పరిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాకు తాగునీరు, తెలంగాణలో బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందివ్వాలనేది ఆయన జీవితాశయంగా ఉండేది.


హైదరాబాదీ చిన్నారుల ప్రపంచ రికార్డు
హైదరాబాద్‌లోని 28 మంది విద్యార్థులు 11 నెలల్లోనే ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 15న ఎంఎస్ హిఫ్జ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఖురాన్‌లోని వ్యాఖ్యలను పఠించారు. గతంలో ఈ రికార్డు ఈజిప్టు పేరిట ఉండేది. 


ప్రముఖ వైద్యుడు ఏపీ రంగారావు కన్నుమూత
108, 104 అంబులెన్స్ సహాయ సేవల వ్యూహకర్త డాక్టర్ అయితరాజు పాండు రంగారావు (75) ఏప్రిల్ 15న కన్నుమూశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన రంగారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ కార్యదర్శిగా, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రి చైర్మన్‌గా, భద్రాచలం ట్రైబల్ ఏరియా ఆస్పత్రి వైద్యాధికారిగా పలు సేవలందించారు. జోగినీ వ్యవస్థ నిర్మూలనకు, వారి పిల్లల చదువుల కోసం విశేషంగా కృషి చేశారు. ‘హాపింగ్ మెమరీస్’ పేరుతో ఈయన ఆత్మకథ కూడా ప్రచురితమైంది.


ఏపీ ఐఎంఏకు జాతీయ అవార్డు
ఉత్తమ సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అవార్డు అందుకుంది. ఏప్రిల్ 15న అహ్మదాబాద్‌లో జరిగిన సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రవి వన్‌కేడ్కర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు కి ఈ అవార్డును అందజేశారు.


ఆంధ్రప్రదేశ్ నేర గణాంక నివేదిక-2017
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 12న మంగళగిరిలో రాష్ట్ర నేర గణాంక నివేదిక-2017ను విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో సగటున రోజుకు 311 కేసులు నమోదవుతున్నాయి. 2016తో పోల్చితే 2017లో నేరాలు 19.97 శాతం పెరిగాయి. 

భూధార్ కార్యక్రమం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో భూధార్ ప్రయోగాత్మక పథకాన్ని ఏప్రిల్ 11న విజయవాడలో ప్రారంభించారు. దీన్ని కృష్ణా జిల్లా ఉయ్యూరు, జగ్గయ్యపేట మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. భూములు, ఆస్తుల లావాదేవీల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం భూధార్‌ను ప్రారంభించింది. 

మక్కా మసీదు పేలుడు కేసు కొట్టివేత
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు బాంబు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం ఏప్రిల్ 16న కొట్టివేసింది. నిందితులు నేరం చేసినట్టుగా ఆధారాలు చూపలేకపోవడంతో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రవీందర్ రెడ్డి తీర్పు వెలువరించారు.
హైదరాబాద్‌లోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడులో తొమ్మిది మంది మరణించగా 58 మంది గాయపడ్డారు. దీనిపై తొలుత స్థానిక పోలీసులు, అనంతరం సీబీఐ, ఎన్‌ఐఏలు దర్యాప్తు చేసి చార్జిషీట్లు దాఖలు చేశాయి.
నిందితులు - అభియోగాలు
దేవేందర్ గుప్తా: మిగతా నిందితులతో కలసి బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడు.
లోకేశ్ శర్మ: మొబైల్ ఫోన్లు సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. 
స్వామి అసీమానంద: హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా.. మక్కా మసీదు, అజ్మీర్ దర్గాలలో పేలుళ్లు జరపాలని ప్రతిపాదించాడు.
భరత్ మోహన్‌లాల్ రాఠేశ్వర్: పేలుడు కుట్రకు సంబంధించి కీలక పాత్ర పోషించాడు. 
రాజేంద్ర చౌదరి: మక్కా మసీదులో బాంబు పెట్టిన ప్రధాన వ్యక్తి. సంరతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుడు, మాలేగావ్ పేలుళ్ల కేసుల్లోనూ రాజేంద్ర నిందితుడు. 


ఏపీలో మహిళా రిజర్వేషన్లు కుదింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రిజర్వేషన్లను కుదించింది. ఓపెన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలో 1996 నుంచి అమలుచేస్తున్న 33.33 శాతం కోటాలో సవరణలు చేస్తూ ఏప్రిల్ 17 న జీవో జారీ చేసింది. దీంతో మహిళలు ఇకపై మెరిట్ ఉన్నా ఓపెన్, ఆయా రిజర్వ్‌డ్ కేటగిరీ జనరల్ కోటాలో కూడా పోటీపడే అవకాశం లేదు. ఆయా కేటగిరీల్లో నిర్ణీత కోటా ప్రకారమే వారికి పోస్టులు దక్కనున్నాయి.


ఎమ్మెల్యేల బహిష్కరణ న్యాయ విరుద్ధం: హైకోర్టు
కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌లను అసెంబ్లీ నుంచి బహిష్కరించ డం న్యాయ విరుద్ధమని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఏప్రిల్ 17న తీర్పునిచింది. ఈ మేరకు మార్చి 13న అసెంబ్లీ జారీ చేసిన ప్రొసీడింగ్‌‌స, నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. వారికి వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకపోవడం, బహిష్కరణ ప్రొసీడింగ్‌‌సను అందజేయకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఇది వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని జస్టిస్ బి.శివశంకరరావు వ్యాఖ్యానించారు. 2018 మార్చిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్ విసిరి అయనను గాయపరిచారని వీరిని సస్పెండ్ చేశారు.


రాష్ట్ర పండుగగా జగ్జీవన్‌రామ్ జయంతి మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ ఏప్రిల్ 4న జీవో జారీ చేశారు. ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలను నిర్వహించారు.


తెలంగాణ హోంమంత్రికి లోహియా పురస్కారం
రామ్‌మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి లోహియా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఏప్రిల్ 4న రవీంద్రభారతిలో లోహియా విచార్‌మంచ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అయనకు ఈ అవార్డును అందచేశాడు.


ఏపీలో నాలుగు రైల్వేస్టేషన్‌లకు అంతర్జాతీయ హోదా
ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు రైల్వేస్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు రైల్వేస్టేషన్లతో పాటు రాయలసీమలోని కర్నూలు, గుంతకల్ కు ఇందులో చోటు దక్కింది. ఒక్కో రైల్వే డివిజన్ నుంచి ఒక స్టేషన్‌ను ఎంపిక చేసి రూ.25 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలనేది రైల్వేశాఖ ఉద్దేశం.



కడక్‌నాథ్ కోడి కి జీఐ గుర్తింపు
 
కడక్‌నాథ్ కోడి మధ్యప్రదేశ్ కు చెందినదే అని చెన్నైలోని భారత మేధోహక్కుల సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 6న దానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్‌ను జారీ చేసింది. ఈ కోడి తమదంటూ మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు జీఐకు దరఖాస్తు చేశాయి. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన గ్రామ్ వికాస్ ట్రస్ట్ కడక్‌నాథ్ కోడి జీఐ గుర్తింపు కోసం మొదట రిజిస్ట్రేషన్ చేసుకుంది.


హైదరాబాద్‌లో బస్తీ దవాఖానా ప్రారంభం
హైదరాబాద్‌లో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ఉద్దేశించిన బస్తీ దవాఖానా ఏప్రిల్ 6న ప్రారంభమైంది. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ దవాఖానాను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. నగరంలో ప్రతి 10వేల మందికి ఒక దవాఖానా చొప్పున వెయి్య బస్తీ దవాఖానాలను దశలవారీగా ఏర్పాటు చేస్తారు.


ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామా 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు ఏప్రిల్ 6న రాజీనామా చేశారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి తమ రాజీనామా లేఖలను సభాపతి సుమిత్రా మహాజన్‌కు అందచేశారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ దీక్ష ప్రారంభించారు.


ఆకాశం కోల్పోయిన పక్షి’ కవితా సంపుటి ఆవిష్కరణ 
జర్నలిస్టు, కవి ఎ.కృష్ణారావు రచించిన ‘ఆకాశం కోల్పోయిన పక్షి’ కవితా సంపుటి ఆవిష్కరణ ఏప్రిల్ 7న హైదరాబాద్ లో జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర కంబార దీనిని ఆవిష్కరించారు.


తెలంగాణ చరిత్ర-నూతన కోణం’ పుస్తకావిష్కరణ
ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ రచించిన ‘తెలంగాణ చరిత్ర-నూతన కోణం’ పుస్తకావిష్కరణ ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ ఉద్యమంలో బడుగు, బలహీన వర్గాల పాత్ర, స్వాతంత్య్రానికి ముందు, తర్వాత తెలంగాణను విలీనం చేసే విషయం, సాయుధ పోరాటం తర్వాత భూస్వాములే పాలించి, దళితులు, మైనారిటీలను అణిచివేతకు గురిచేసిన విధానం, తెలంగాణలోని మిశ్రమ సంస్కృతిని ఈ పుస్తకంలో పొందుపరిచారు.


తెలంగాణ యువతుల బైక్ యాత్ర విజయవంతం 
తెలంగాణ యువతులు జయభారతి, ప్రియా బహదూర్, శిల్పా బాలకృష్టన్, ఏఎస్‌డీ శాంతి చేపట్టిన సాహసయాత్ర ‘రోడ్ టు మెకాంగ్ ఎక్స్‌పెడిషన్’ ను విజయవంతంగా పూర్తిచేశారు. రెండు నెలల కాలంలో ఆరు దేశాల్లో 17 వేల కిలోమీటర్ల దూరాన్ని మోటార్ బైక్‌పై చుట్టి ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు చేరుకున్నారు. మన దేశంలోని 15 రాష్ట్రాలతో పాటు మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, వియత్నాం, కాంబోడియా, బంగ్లాదేశ్‌ల మీదుగా ఈ యాత్ర జరిగింది.


అమరావతిలో సంతోష నగరాల సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సంతోష నగరాల సదస్సు (హ్యాపీ సిటీస్ సమిట్) ఏప్రిల్ 10న ప్రారంభమైంది. సదస్సును ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ప్రారంభించాడు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 37 దేశాల నుంచి దాదాపు 1200 మంది ప్రతినిధులు హాజరై అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు పరిష్కార మార్గాలు, ఆవిష్కరణలపై చర్చిస్తారు. 


తెలంగాణ డీజీపీగా మహేందర్‌రెడ్డి 
తెలంగాణ రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ఎం.మహేందర్ రెడ్డి ఏప్రిల్ 9న నియమితులయ్యారు. ఈ మేరకు 2017 నవంబర్ 12 నుంచి ఇన్‌చార్జి డీజీపీగా ఉన్న ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీని నియమించుకునే అధికారాన్ని రాష్ట్రానికే కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఆయనను నియమించారు.


తితిదే చైర్మన్‌గా సుధాకర్ యాదవ్
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. ఏపీఎస్‌ర్‌టీసీ చైర్మన్‌గా వర్ల రామయ్యను నియమించారు. ఈ మేరకు రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది.
కార్పోరేషన్లు - చైర్మన్‌ల జాబితా
సంస్థ
పేరు
జిల్లా
తిరుమల తిరుపతి దేవస్థానం
పుట్టా సుధాకర్ యాదవ్
వైఎస్సార్ కడప
ఏపీఎస్ ఆర్‌టీసీ
వర్ల రామయ్య
కృష్ణా
ఆర్‌టీసీ విజయనగరం
తెంటు లక్ష్మీనాయుడు
విజయనగరం
ఆర్‌టీసీ విజయవాడ
మెంటే పార్థసారథి
పశ్చిమగోదావరి
ఆర్‌టీసీ నెల్లూరు
సుభాష్‌చంద్రబోస్
చిత్తూరు
ఆర్‌టీసీ కడప
చల్లా రామకృష్ణారెడ్డి
కర్నూలు
ఏపీ గ్రంథాలయ పరిషత్
దాసరి రాజారావు
గుంటూరు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ(శాప్)
పి. అంకమ్మచౌదరి
కృష్ణా
ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి
చిత్తూరు
ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
డాక్టర్ దివి శివరాం
ప్ర కాశం
ఏపీ స్టేట్ మైనారిటీస్ కమిషన్
ఎస్‌ఎం జీయావుద్దీన్
గుంటూరు
ఏపీ మైనారిటీ ఫైనాన్‌‌స కార్పొరేషన్
ఎండీ హిదాయతుల్లా
గుంటూరు
ఏపీ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్
వై నాగేశ్వరరావు యాదవ్
కర్నూలు
ఏపీ మినిమం వేజెస్ బోర్డు
రఘుపతుల రామ్మోహనరావు
తూర్పుగోదావరి
ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్
నామన రాంబాబు
తూర్పుగోదావరి
ఏపీ ఎస్‌సీ కో-ఆపరేటివ్ ఫైనా న్స్ కార్పొరేషన్
జూపూడి ప్రభాకర్
ప్రకాశం
ఏపీ కాపు కార్పొరేషన్
కొత్తపల్లి సుబ్బారాయుడు
పశ్చిమగోదావరి


దక్షిణ మధ్య రైల్వేకు 7 అవార్డులు
దేశంలోని 16 భారతీయ రైల్వే జోన్లలో దక్షిణ మధ్య రైల్వే అగ్రస్థానంలో నిలిచి ప్రతిష్టాత్మక పండిత్ గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డుకు ఎంపికైంది. ప్రయాణికుల సేవలు, మౌలిక సదుపాయాలు, ఆదాయ సముపార్జన తదితర అంశాల్లో సాధించిన ప్రగతికి ఉత్తమ రైల్వేజోన్‌గా గుర్తింపు పొంది ఏడు ప్రధాన విభాగాల్లో అవార్డులనూ దక్కించుకుంది. 
లాలాగూడ రైల్వే వర్క్‌షాపు ఉత్తమ వర్క్‌షాపు, విశాఖపట్టణం రన్నింగ్ రూమ్ అత్యుత్తమ రన్నింగ్‌రూమ్‌గా గుర్తింపు పొందాయి. రైల్వేలైన్‌ల విద్యుదీకరణ, డబ్లింగ్, కొత్త లైన్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా రంగంలోనూ మొదటిస్థానంలో నిలిచింది. ఏప్రిల్ 16న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరగనున్న 63వ రైల్వే వారోత్సవాల్లో అవార్డులు స్వీకరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ తెలిపారు.


హైదరాబాద్‌లో జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 నుంచి జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఏటా ఏప్రిల్‌లో జరిగే ఫంటాస్టిక్ 5 ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఈసారి జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. ఈ ఉత్సవంలో అగ్విరా రత్ ఆఫ్ గాడ్ (1972), ఫిజ్కారాల్డో (1981), చోస్ ఫ్రమ్ ఏ సంబర్ ఎంపైర్ (1990), ఫతా మోర్గానా (1970), బెల్స్ ఫ్రమ్ ద డీప్ (1993) అనే 5 చిత్రాలను 5 రోజులపాటు ప్రదర్శిస్తారు.


ప్రైవేటు వర్సిటీల బిల్లుకు ఆమోదంతెలంగాణలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును మార్చి 28న శాసనసభ ఆమోదించింది. ఈ యూనివర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలనే నిబంధనను బిల్లులో పొందుపరిచారు. సామాజిక రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వీటికి వర్తించవు. తెలంగాణ విద్యార్థులకు కూడా ప్రైవేట్ రంగంలో నాణ్యమైన విద్య అందించే ఉద్దేశంతోనే ఈ బిల్లు తెచ్చామని, దీనిపై ఎలాంటి ఆందోళన, అపోహ అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.


ఏపీలో ఫైళ్ల మార్పిడికి ఈ-ఆఫీస్ తప్పనిసరిఆంధ్రప్రదేశ్‌లో గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లోనే ఫైళ్ల మార్పిడికి ఉద్దేశించిన ఈ-ఆఫీస్ వ్యవస్థ ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరి కానుంది. ఈ మేరకు ఫైళ్లను ఇ-ఆఫీస్ ద్వారానే ఆన్‌లైన్‌లోనే పంపించాలని, ఫిజికల్ ఫైళ్లు ఎవరు పంపినా తీసుకోకూడదని, బయోమెట్రిక్ హాజరునే పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు.


కేజీబీవీలను 12వ తరగతి వరకు విస్తరించాలి: కేబ్ కమిటీదేశవ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ను 12వ తరగతి వరకు విస్తరించనున్నారు. ఇప్పటివరకు కేజీబీవీల్లో 6, 7, 8 తరగతుల్లో (ఏపీ, తెలంగాణలో పదో తరగతి వరకు) నివాస వసతితో కూడిన విద్యను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకపై 12వ తరగతి వరకు విద్యను అందించాలని నిర్ణయించింది. దీంతో సామాజిక, ఆర్థిక కారణాల వల్ల డ్రాపవుట్స్‌గా మిగిలిపోతున్న వారి సంఖ్య తగ్గిపోనుంది.
దేశవ్యాప్తంగా బాలికా విద్యకు ప్రోత్సాహం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై 2017లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (కేబ్) సబ్ కమిటీని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఏర్పాటు చేసింది. అస్సాం మంత్రి హేమంత బిస్వాశర్మ, జార్ఖండ్ మంత్రి నీరా యాదవ్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది.


కుఫ్టి బహుళార్థ్ధ సాధక ప్రాజెక్టుకు అనుమతికడెం ప్రాజెక్టు కింది ఆయకట్టుకు సమృద్ధిగా నీటి లభ్యతను పెంచే లక్ష్యంతో కుఫ్టి బహుళార్థ్ధ సాధక ప్రాజెక్టును చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య కుఫ్టి గ్రామం వద్ద 5.32 టీఎంసీల సామర్ధ్యంతో రూ.870 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే, లోయర్ పెన్‌గంగ నదిపై రూ.369 కోట్లతో 1.42 టీఎంసీల సామర్థ్యంతో పిప్పల్‌కోటి, రూ.215 కోట్లతో 0.7 టీఎంసీల సామర్థ్యంతో గోముత్రి రిజర్వాయర్ నిర్మాణానికి కూడా అనుమతిచ్చింది. దీంతో అదిలాబాద్‌లో మొత్తం మూడు కొత్త ప్రాజెక్టులు రానున్నాయి.


ప్రముఖ ఇంజనీర్ ఆచార్య శివాజీరావు కన్నుమూత
ప్రముఖ ఇంజనీర్, ఆంధ్రా విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యుడు తిపిరినేని శివాజీరావు మార్చి 31న మృతి చెందారు. 1932లో కృష్ణాజిల్లా ముదినేపల్లిలో జన్మించిన శివాజీరావు బెంగళూర్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. టెక్సాస్‌లోని రైస్ యూనివర్సిటీలో ఎంఎస్ ఎన్విరాన్‌మెంటల్ సైన్‌‌స అండ్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. అనంతరం రెండేళ్ల పాటు నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణానికి ఫీల్డ్ ఇంజనీర్‌గా సేవలందించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. ఆచార్యుడిగా, సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, ఏయూ ఇంజ నీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా సేవలందించి పదవీ విరమణ పొందారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును అందుకున్న శివాజీరావు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా, బోర్డు టెక్నికల్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. తాజ్‌మహల్, పోలవరంతో పాటు అనేక పర్యావరణ సంబంధిత అంశాలకు సంబంధించి 85కు పైగా ఆయన రచనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమయ్యాయి.


మూమెంటమ్ ఇండెక్స్‌లో హైదరాబాద్‌కు అగ్ర స్థానంస్వల్ప కాలంలో వృద్ధి పరంగా అంతర్జాతీయంగా టాప్ 30 నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, పుణె 4, కోల్‌కతా 5, ఢిల్లీ 8, చెన్నై 14, ముంబై 20వ స్థానంలో ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్ (జోన్‌‌స లాంగ్ లాసల్లే) తెలిపింది. ఈ మేరకు భారత నగరాలు స్వల్పకాలంలో వృద్ధిని సూచించే జేఎల్‌ఎల్ సిటీ ‘మూమెంటమ్ ఇండెక్స్ 2018’ ని జేఎల్‌ఎల్ ఏప్రిల్ 1న విడుదల చేసింది. ఈ సూచీ పట్టణాల ఆర్థిక వృద్ధి, రియల్టీ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది.


తెలంగాణ జన సమితి పార్టీ ఆవిష్కరణ
తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అసంతృప్త పాలనకు ప్రత్యామ్నాయంగా ‘తెలంగాణ జన సమితి-టీజేఎస్’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు కోదండరాం ఏప్రిల్ 2న ప్రకటించారు.


విద్యుదుత్పత్తిలో సింగరేణికి ఐదో స్థానంమంచిర్యాలలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టీపీపీ) 2017-18లో 91.1 శాతం విద్యుదుత్పత్తి సామర్థ్యం (పీఎల్‌ఎఫ్) సాధించి జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. ఉత్పత్తి ప్రారంభించిన 18 నెలల్లోనే సింగరేణి ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఈ మేరకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) జాతీయ స్థాయిలో అత్యుత్తమ 25 థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాను ఏప్రిల్ 2న ప్రకటించింది. ఈ కేంద్రం ఉత్పత్తి సామర్థ్యం 1200 మెగావాట్లు. 


పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణకు ఆమోదంపంచాయతీరాజ్ చట్ట సవరణ, పురపాలక చట్ట సవరణ బిల్లులను తెలంగాణ రాష్ట్ర శాసనసభ మార్చి 29న ఆమోదించింది. పంచాయతీలు, మున్సిపాలిటీల స్వరూపాన్ని మార్చేందుకే నూతన చట్టం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.





మార్చి 2018 రాష్ట్రీయం

పెట్టుబడి పథకానికి 'రైతుబంధు' పేరు ఖరారు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెట్టుబడి పథకానికి 'రైతుబంధు'అని నామకరణం చేసింది. గతంలో దీని పేరు రైతులక్ష్మి పథకంగా ప్రచారం జరిగినా, చివరకు ముఖ్యమంత్రి రైతుబంధు పేరుని ఖరారు చేశారని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. రైతు బంధు పథకంపై బ్యాంకు అధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహిచారు. ప్రతీ రైతుకు సాగు భూమి అంతటికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు.


ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రపంచ రికార్డు 
తమిళనాడులోని రామనాథపురం సమీపంలో తలైమన్నార్-ధనుష్కోటి మధ్య ఉన్న పాక్ జలసంధిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మోదుకూరి తులసి చైతన్య అనే పోలీసు 8 గంటల 25 నిమిషాల్లో ఈది ప్రపంచ రికార్డు సృష్టించారు. మార్చి 25 తెల్లవారుజామున తలైమన్నార్ హార్బర్ నుంచి ఈదడం ప్రారంభించిన తులసి చైతన్య ఉదయం 9.25 గంటలకు ధనుష్కోటికి చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకూ నమోదైన గణాంకాల ప్రకారం అతి తక్కువ సమయంలో పాక్ జలసంధిని ఈదిన తొలివ్యక్తిగా చైతన్య రికార్డు సృష్టించారు.


చిత్తూరులో హీరో మోటార్‌కార్ప్ పరిశ్రమకు శంకుస్థాపన
చిత్తూరులోని శ్రీసిటీ సమీపంలో హీరో మోటార్‌కార్ప్ చిత్తూరు ప్లాంటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 23న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో తిరుపతి, నెల్లూరు, అనంతపురం ప్రాంతాలను కలుపుతూ ఆటోమొబైల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని చెప్పారు. ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో ఉందన్నారు. చిత్తూరు ప్లాంటు నిర్మాణం కోసం రూ.1,600 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హీరో మోటార్‌కార్ప్ సీఎండీ పవన్ ముంజాల్ చెప్పారు.
 

చిత్తూరు శ్రీసిటిలో 'క్రియా' యూనివర్సిటీ 
రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. కొందరు కార్పొరేట్లతో కలిసి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో జేఎస్‌డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఉన్నారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో రానున్న ఈ యూనివర్సిటీకి 'క్రియా' అని పేరు పెట్టారు. క్రియా యూనివర్సిటీకి తొలుత రూ.750 కోట్ల నిధులు సమకూరతాయని ఇండస్‌ఇండ్ బ్యాంక్ చైర్మన్, యూనివర్సిటీ సూపర్‌వైజరీ బోర్డు చైర్మన్ ఆర్.శేషసాయి తెలిపారు. దాతృత్వంలో భాగంగా కార్పొరేట్లు ఈ యూనివర్సిటీకి ఖర్చు చేస్తారన్నారు. యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సలహాదారుగా రఘురామ్ రాజన్ వ్యవహరిస్తారు. రాజన్ ప్రస్తుతం.. యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ సబ్జెక్టును బోధిస్తున్నారు. 
క్లాసులు 2019 నుంచి..: యూనివర్సిటీలో 2019 జూలై నుంచి తొలి బ్యాచ్ ప్రారంభమవుతుంది. హాస్టల్ వసతితో కలిపి ఫీజు రూ.7-8 లక్షలు ఉండనుంది. లిబరల్ ఆర్‌‌ట్స, సెన్సైస్‌లో బీఏ హానర్స్, బీఎస్సీ హానర్స్ డిగ్రీ కోర్సులు ఆఫర్ చేస్తారు. మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లుంటాయి. తాత్కాలికంగా శ్రీసిటీలోని ఐఎఫ్‌ఎంఆర్ క్యాంపస్‌లో క్లాసులు ప్రారంభిస్తారు. తర్వాత సొంత భవనంలోకి మారుస్తారు. 200 ఎకరాల్లో నిర్మించే క్రియా యూనివర్సిటీ సొంత భవనం 2020 నాటికి సిద్ధమవుతుంది.


డీజీపీ నియామక బిల్లుకి ఆమోదం 
డీజీపీని నియమించుకునే అధికారం రాష్ట్రానికే కల్పిస్తూ పోలీసు చట్టానికి తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు రూపొందించిన కొత్త పోలీసు చట్టం బిల్లుని మార్చి 25న శాసనమండలి ఆమోదించింది. సీఎం కేసీఆర్ తరపున మంత్రి కె.తారక రామారావు సభలో బిల్లును ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 
అలాగే... తెలంగాణ అసైన్‌‌డ భూముల చట్టం-1977ను సవరించే బిల్లును ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. వీటితో పాటు తెలంగాణ విద్య, వృత్తిదారుల రిజిస్ట్రేషన్ చట్టం-1968 ను సవరించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రవేశ పెట్టిన బిల్లును, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కేంద్ర పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టిన బిల్లును సభ ఆమోదించింది. తెలంగాణ న్యాయవాదుల గుమాస్తాల సంక్షేమ నిధి చట్టం-1992ను, తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం-1987లను సవరించేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పెట్టిన రెండు బిల్లులను సభ ఆమోదించింది.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ గ్యారేజ్
ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో గ్యారేజ్‌ని ప్రారంభించింది. తెలంగాణ ఐటీ శాఖమంత్రి కె. తారక రామారావు మార్చి 26న దీనిని ప్రారంభించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స (ఐవోటీ), రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలు, ఉత్పత్తుల పరిష్కరణ వంటి వాటి కోసం ఈ గ్యారేజీ పనిచేస్తుంది. 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గ్యారేజ్ దేశంలోనే మొదటిది.


తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రాజీనామా
తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి మార్చి 26న తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణకు సంబంధించిన కేసు విషయంలో వచ్చిన స్పర్ధల కారణంగా ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు ప్రకాష్ రెడ్డిని తప్పించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశ్‌రెడ్డి 2017 జూలై 17న అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 27న ప్రకటించింది. మొత్తం 224 శాసనసభ స్థానాలకు మే 12న ఒకే దశలో పోలింగ్ నిర్వహించి మే 15న ఫలితాలు వెల్లడించనుంది. ఏప్రిల్ 17న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లకు ఏప్రిల్ 24 వరకు గడువు ఉంటుందని ప్రధాన ఎన్నికల కమీషనర్ ఓపీ రావత్ తెలిపారు. ఈ ఎన్నికల్లో అన్నీ ఈవీఎంలకు వీవీపీఏటీ (ఓటు రశీదు యంత్రం)లను అనుసంధానించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్-2018
మొత్తం స్థానాలు
224
నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్ 17
నామినేషన్లకు చివరి తేది
ఏప్రిల్ 24
ఉపసంహరణకు గడువు
ఏప్రిల్ 27
పోలింగ్ తేది
మే 12
ఓట్ల లెక్కింపు
మే 15

తెలుగును తప్పనిసరి చేసే బిల్లుకు ఆమోదం
తెలంగాణలో ఒకటి నుంచి పదోతరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు శాసనసభ మార్చి 24న ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ఇతర మాధ్యమాలు (ఉర్దూ, తమిళం, మళయాలం), కేంద్ర, అంతర్జాతీయ విద్యాసంస్థల్లో తెలుగును మొదటి భాషగా బోధించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 2018-19 విద్యా సంవత్సరం నుంచి అన్ని రకాల పాఠశాలల్లో ఒకటి, ఆరో తరగతిల్లో తెలుగును మొదటి భాషగా అమలుచేయనున్నారు. క్రమంగా ఒక్కో ఏడాది తరగతులను పెంచనున్నట్లు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు శంకుస్థాపన
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచి.. నూతన సౌకర్యాలు కల్పించేలా యాజమాన్య సంస్థ విమానాశ్రయ విస్తరణకు శ్రీకారం చుట్టుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న కోటిన్నర మంది(సంవత్సరానికి) ప్రయాణీకుల సామర్థ్యాన్ని 4 కోట్లకు పెంచనున్నారు. దీనికి సంబంధించిన పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ మార్చి 23న శంకుస్థాపన చేశారు. విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్ట్ సిటీ, 12 వేల మందికి ఒకేసారి ఆతిథ్యం ఇవ్వగల కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ కేంద్రాలను నిర్మించనున్నారు.

ప్రజలకు ఉగాది కానుకగా "తెలంగాణ వెలుగు"రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా కరదీపిక పేరుతో హ్యాండ్ బుక్ తీసుకొచ్చింది. ఇందులో 20 రకాల అంశాలను పొందుపరిచారు. వర్ణమాల, తెలుగు సంవత్సరాలు, తిథులు - వారాలు, పక్షాలు - ఆయనాలు, మాసాలు, రుతువులు, కార్తెలు, నక్షత్రాలు - రాశులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, యుగాలు, ప్రాచీన కాలగణనం, తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు, ప్రాచీన సంఖ్యామానం, పండుగలు, పండుగల పాటలు, రాష్ట్ర చిహ్నాలు, తెలంగాణ కళలు, వాయిద్య పరికరాలు, మన పంటలు - ఆహారం, మన ఆటలు, నీతి పద్యాలు, తెలంగాణను పరిపాలించిన రాజవంశాలు ఉన్నాయి. మొత్తం 56 పేజీల పుస్తకం సమగ్ర సమాచారంతో అందరినీ ఆకట్టుకొంటోంది. పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిన నేటి తరానికి మన ప్రాచీన జ్ఞానం తెలియాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కరదీపికను ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి ఇంటికీ దీన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన 1.30 కోట్ల కుటుంబాలకు ఈ కరదీపికను డీఈవోలు, రెవెన్యూ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయనున్నారు. 


మైనర్‌పై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణశిక్ష
అరుణాచల్‌ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణశిక్ష లేదా 14 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించేలా రూపొందించిన బిల్లుకు అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ మార్చి 16న ఆమోదముద్ర తెలిపింది. క్రిమినల్ లాస్(అరుణాచల్ ప్రదేశ్) సవరణ బిల్లు-2018ను రాష్ట్ర హోంమంత్రి కుమార్ వాయి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం 12 ఏళ్లలోపు బాలికల(మైనర్)పై అత్యాచారానికి పాల్పడే వ్యక్తులకు మరణశిక్ష లేదా 14 ఏళ్లకు తగ్గకుండా కఠిన కారాగారశిక్ష విధిస్తారు. ఈ శిక్షను యావజ్జీవశిక్షగా కూడా మార్చవచ్చు. వీటితో పాటు దోషులకు జరిమానా కూడా విధించవచ్చు. 
2015 నుంచి 2017 నవంబర్ వరకూ రాష్ట్రంలో 225 రేప్ కేసులు నమోదుకాగా.. ఒక్క 2016లోనే 91 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీంతో మహిళలకు తగిన రక్షణ కల్పించడంలో భాగంగా పలువురు సభ్యుల సిఫార్సుతో అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. 


కల్యాణలక్ష్మి’ సాయం రూ.1,00,116కు పెంపు
కల్యాణలక్ష్మి పథకం కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి అందజేస్తున్న సాయాన్ని ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.75,116గా ఉన్న మొత్తాన్ని రూ.1,00,116కు పెంచుతున్నట్టు ప్రకటించింది. మార్చి 19న శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట అందజేస్తున్న సాయాన్ని మరింత పెంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 
 

స్టీఫెన్ హాకింగ్ పేరుతో పోస్టల్ కవర్ విడుదల
ఇటీవల కన్నుమూసిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరుతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్‌ను విజయవాడలో విడుదల చేసింది. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇస్రో వైస్‌చైర్మన్ డాక్టర్ కేవీ రమణ ఈ కవర్‌ను విడుదల చేశారు. 
అంతకముందు.. తపాలా శాఖ అంధ్రప్రదేశ్ సర్కిల్.. దీన్‌దయాల్ స్పర్శ యోజన కింద స్కాలర్‌షిప్పులను విద్యార్థులకు అందజేశారు. స్టాంపుల సేకరణను ప్రోత్సహించే క్రమంలో పోస్టల్ శాఖ పాఠశాల విద్యార్థులకు పరీక్ష నిర్వహించింది. ఇందులో ఎంపికైన మొత్తం 40 మంది విజేతలకు ఒక్కొక్కరికి రూ.6 వేలు చొప్పున ఈ ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. 


సూర్య’ ప్రయోగాన్ని వీక్షించనున్న తెలంగాణ విద్యార్థి 
సూర్యుడిపై ఉన్న ఉష్ణోగ్రతను అధ్యయనం చేయడానికి నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) త్వరలో రాకెట్‌ను సూర్యునిపైకి పంపనుంది. ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ప్రపంచ దేశాల నుంచి 110 మందిని ఎంపిక చేసింది. వీరిలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన విద్యార్థి అబీర్ మనీష్ గోదాగోమంకర్ ఉన్నారు. 
గోదాగోమంకర్‌కు ప్రయోగాలంటే చాలా ఇష్టం. సూర్యుడి ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి నాసా రాకెట్ పంపుతోందన్న విషయం తెలుసుకున్నాడు. వెబ్‌సైట్‌లో నాసా అడిగిన 10 ప్రశ్నలకు అబీర్ సమాధానాలు ఇవ్వడంతో నాసా నుంచి ఆహ్వానం అందింది. భారత్ నుంచి మొత్తం 13 మంది విద్యార్థులకు ఈ అవకాశం దక్కింది. ఎంపికైన వారి పేర్లను రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు.

క్వాలిటీ ఆఫ్ లివింగ్‌లో అగ్రస్థానంలో హైదరాబాద్ హైదరాబాద్ నగరం మరోసారి అరుదైన ఘనతను దక్కించుకుంది. దేశంలోని మహానగరాలను వెనక్కునెట్టి ఈసారి కూడా ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్’ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్-2018’ పేరుతో మెర్సర్ ఈ జాబితాను విడుదల చేసింది. నేరాల శాతం తక్కువగా ఉండటం, ఏ కాలంలోనైనా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రేటింగ్ ఇస్తారు. భాగ్యనగరంతో పాటూ పుణె కూడా ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. 
ఇక దేశ రాజధాని ఢిల్లీ వరుసగా మూడోసారి అట్టడుగు స్థానానికే పరిమితమైంది. వాయు కాలుష్యం, భారీ ట్రాఫిక్‌తో దేశ రాజధాని ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతోంది. 
ప్రపంచవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ 142వ ర్యాంక్ దక్కించుకుంది. హైదరాబాద్‌తోపాటు పుణె కూడా ఇదే ర్యాంక్‌లో ఉంది. పుణె కూడా 151వ ర్యాంక్ నుంచి 142వ స్థానానికి వచ్చింది. బెంగళూరు 149, చెన్నై 151, ముంబై 154, కోల్‌కతా 160, ఢిల్లీ 162 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఆస్ట్రియా రాజధాని వియన్నా ఉత్తమ నగరంగా తొలి ర్యాంకు దక్కించుకుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ రెండో ర్యాంక్‌లో నిలిచింది.

20 మంది మహిళకు తెలంగాణ అవార్డులు వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన 20 మంది ప్రముఖ మహిళలకు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అవార్డులను అందజేసింది. అవార్డులకు ఎంపికై న వారిలో విద్య, వైద్య, క్రీడా, సాహిత్యం, నాట్యం, సంగీతం, వ్యవసాయం, సమాజసేవ తదితర రంగాలకు చెందిన వారు ఉన్నారు. 
ఇటీవల జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో రజత పతకం సాధించిన అరుణారెడ్డితో పాటు, సినిమా డెరైక్టర్ నందినీరెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ డ్రైవర్ సుప్రియ సనమ్, ఢిల్లీ ఆర్టీసీ డ్రైవర్ సరిత, ఉద్యమ గాయకురాలు ఎదునూరి పద్మ, మహిళా సాధికారతలో యాప భద్రమ్మ తదితరులు అవార్డుకు ఎంపికయ్యారు. వీరందరికీ లక్ష రూపాయల నగదు రివార్డుతో ప్రభుత్వం సత్కరించింది.


మహిళా రైల్వేస్టేషన్‌గా బేగంపేట్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బేగంపేట్ రైల్వేస్టేషన్‌ను ‘మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్’గా సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ప్రకటించారు. బేగంపేట్‌లో 8 మంది కమర్షియల్ ఉద్యోగులు, నలుగురు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లు, మరో ఆరుగురు పాయింట్స్ ఉమెన్, ఇద్దర్ ఆర్‌పీఎఫ్ మహిళా పోలీసులను నియమించనున్నట్లు పేర్కొన్నారు. వీరు రైల్వేస్టేషన్ నిర్వహణ, టిక్కెట్ బుకింగ్, ప్రయాణికుల భద్రత తదితర కార్యకలాపాలను నిర్వహిస్తారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే చంద్రగిరి స్టేషన్‌ను మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేశారు. త్వరలో ఫిరంగిపురం స్టేషన్ కూడా మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్‌గా మారనుంది.


వీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 
కొత్తగా పరిశ్రమలు పెట్టే వారి కోసం ఇప్పటికే టీహబ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా వీహబ్ (ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ హబ్) ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీ హబ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఈ వీ హబ్ ఇంక్యుబేటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. వీహబ్‌కు కొత్త ఆలోచనలతో వచ్చే మహిళలకు అక్కడే యూనిట్ ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వడంతోపాటు పెట్టుబడి కోసం రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు సాయాన్ని అందజేయనుంది. దీనికి తొలుత ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను వీహబ్‌కు తెలియజేయాలి. ప్రాజెక్టు రిపోర్టు సమర్పించిన అనంతరం పారిశ్రామిక రంగంలో పేరొందిన నిపుణుల ఆధ్వర్యంలో వారికి మార్గనిర్దేశనం చేస్తారు. ఈ మేరకు వీహబ్ ఆరు ప్రముఖ సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. 


కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక జెండా
కర్ణాటక రాష్ట్రం కోసం రూపొందించిన అధికారిక జెండాను ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఆవిష్కరించారు. ‘నాద ధ్వజ’గా పేర్కొంటున్న ఈ జెండాలో పసుపు, తెలుపు, ఎరుపు వర్ణాలతోపాటు మధ్యలో రాష్ట్ర చిహ్నమైన ‘గండభేరుండ’ ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండాలన్నది కన్నడిగుల అభిప్రాయం, ఆకాంక్ష అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. దీనిని మార్చి 9న రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది. 
ప్రస్తుతం దేశంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేక జెండా ఉంది. 


రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా 
తెలంగాణ రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమిస్తూ మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు సమన్వయ సమితిని లాభాపేక్షలేని సంస్థ(కార్పొరేషన్)గా నమోదు చేసినట్లు ఉత్తర్వులో పేర్కొంది. రైతు సమన్వయ సమితిలో ఐదుగురిని డెరైక్టర్లుగా నియమించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి డెరైక్టర్, చైర్మన్ హోదాలో ఉంటారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్‌మోహన్‌ను రైతు సమన్వయ సమితి ఎండీగా, ఉద్యాన శాఖ డెరైక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ జి.లక్ష్మీబాయి, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సి.హెచ్.వి.సాయిప్రసాద్‌ను రైతు సమన్వయ సమితి డెరైక్టర్లుగా నియమించారు. నియామక ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, విధి విధానాలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు.


మహారాష్ట్రలో వేలాది మంది రైతుల ఆందోళన 
మండుటెండలో బొబ్బలెక్కిన పాదాలతో ఆరు రోజులపాటు 180 కిలో మీటర్లు నడిచి తమ సమస్యల పరిష్కారం కోసం ముంబైకి చేరుకున్న వేలాది మంది రైతుల ఆందోళనకు మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతుల డిమాండ్లలో దాదాపు అన్నింటినీ నెరవేరుస్తామని రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ మార్చి 12న ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ఫడ్నవిస్ అసెంబ్లీ బయట మాట్లాడుతూ.. రైతులు, ఆదివాసీల ప్రతినిధులతో సమావేశమయ్యామని.. ఆదివాసీలు సాగుచేస్తున్న అటవీ భూములను వారికే బదిలీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. అయితే 2005కు ముందు నుంచి ఆ భూమిని తామే సాగు చేస్తున్నట్లు గిరిజనులు ఆధారాలు చూపించాలని వెల్లడించారు. 
సీపీఎం అనుబంధ సంస్థ అయిన అఖిల భారత కిసాన్ సభ రైతుల పోరాటానికి నేతృత్వం వహించింది. 

కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వం రద్దు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో శాసనసభలో అనుచితంగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), ఎస్‌ఏ సంపత్‌కుమార్ (అలంపూర్) ల సభ్యత్వం రద్దయింది. సభా హక్కుల ఉల్లంఘన, సభ గౌరవానికి భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడ్డారనే కారణంగా ప్రస్తుత అసెంబ్లీ ముగిసే వరకు వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మార్చి 13న అసెంబ్లీ తీర్మానించింది. అలాగే కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసింది.
మార్చి 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నర్సింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్స్ సెట్‌ను విసిరేయగా.. అది తగిలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది.


9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మార్చి 13న మావోయిస్టులు జరిపిన భారీ దాడిలో తొమ్మిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సీఆర్పీఎఫ్ 212 బెటాలియన్‌కు చెందిన జవాన్లు రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో సమీపంలోని కాసారం అనుబంధ క్యాంపునకు వెళ్తుండగా మావోయిస్టులు అత్యంత శక్తివంతమైన మందుపాతర (ఐఈడీ) పేల్చారు. ఇటీవల 20 మంది మావోయిస్టులు మరణించిన తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు.


కొత్త పథకం హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ 
తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఏటా ఉచిత వైద్య పరీక్షలు జరిపేందుకు త్వరలోనే ‘హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఏటా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఆ సమాచారాన్ని కంప్యూటరీకరించి, లబ్ధిదారులకు కార్డు అందిస్తారు. దీంతోపాటు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేయిస్తారు.


2018-19 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19 సంవత్సరానికి ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 8న శాసన సభలో ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్‌ను రూ.1,91,064 కోట్లతో రూపొందించారు.
ముఖ్యాంశాలు 
రెవెన్యూ వ్యయం: రూ.1,50,272 కోట్లు
మూలధన వ్యయం: రూ.28,678 కోట్లు
రెవెన్యూ మిగులు: రూ.5,235.24 కోట్లు
ద్రవ్యలోటు : రూ.24,205 కోట్లు
సమకూరే ఆదాయం
కేంద్ర పన్నుల్లో వాటాల రూపంలో: రూ.33,930 కోట్లు
గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ద్వారా: రూ.50,696 కోట్లు
ఠిప్రభుత్వ సొంత పన్నుల ద్వారా: రూ.65,535 కోట్లు
ప్రాధాన్య రంగాలు- నిధులు
గ్రామీణాభివృద్ధి: రూ.20,815.98 కోట్లు
నీటిపారుదల, వరద నియంత్రణ: రూ.16,978.23 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.12,355.32 కోట్లు
సాధారణ విద్య: రూ.24,185.75 కోట్లు
సంక్షేమం: రూ.13,722.98 కోట్లు
వైద్యం: రూ.8,463.51 కోట్లు
విద్యుత్: రూ.5,052.54 కోట్లు
గృహ నిర్మాణం: రూ.3,679.53 కోట్లు
రవాణా: రూ.4,653.74 కోట్లు.

ఏపీ సామాజిక ఆర్థిక సర్వే: 2017-18
2017-18 ఆర్థిక సర్వేని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 8న శాసనసభలో ప్రవేశపెట్టింది. సర్వే ప్రకారం- ఏపీ తలసరి ఆదాయం రూ.1,42,054గా అంచనా. ఇది 2015-16లో రూ.1,07,276గా ఉంది. ఏపీ 2017-18లో దేశంలో రొయ్యల ఎగుమతి; పండ్లు, సుగంధ ద్రవ్యాలు, కోకో, నిమ్మ, ఆయిల్‌పామ్, బొప్పాయి, టమోటా ఉత్పత్తిలో మొదటి స్థానంలో; జీడిమామిడి, మామిడి, బత్తాయి, మాంసం, పాల ఉత్పత్తిలో రెండోస్థానంలో నిలిచింది.

బ్రహ్మానందానికి ‘హాస్య నట బ్రహ్మ’ అవార్డు 1,100 సినిమాల్లో నటించిన ప్రముఖ హాస్యనటుడు కె.బ్రహ్మానందాన్ని ‘హాస్య నట బ్రహ్మ’ అవార్డుతో సత్కరించారు. టీఎస్‌ఆర్ కాకతీయ లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి 11న మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో స్పీకర్ మధుసూదనాచారి, కళాబంధు సుబ్బరామిరెడ్డి, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీనటులు జయప్రద, రాజశేఖర్, జీవిత, బాబుమోహన్, అలీ, శ్రద్ధాదాస్, రఘుబాబు, శ్రీనివాస్‌రెడ్డిలకు కాకతీయ పురస్కారాలు అందజేశారు. కళారంగంలో సేవలు అందిస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఎల్లూరి శివారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, గోరటి వెంకన్న, చిక్కా హరీశ్, జంగిరెడ్డి, వంగీశ్వర నీరజ, పద్మాలయ ఆచార్యను ‘కాకతీయ అవార్డు’లతో సత్కరించారు. 


హైదరాబాద్‌లో టాటా బోయింగ్’ ప్రారంభం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలో ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌లో రూ. 400 కోట్లతో నెలకొల్పిన టాటా బోయింగ్ ఏరోస్పేస్ విమానాల తయారీ పరిశ్రమను మార్చి 1న కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతోపాటే ఏహెచ్-64 బోయింగ్ విమానాలు, హెలికాప్టర్లకు ప్యూస్‌లేజ్ (ప్రధాన భాగాల)ను తయారు చేసే యూనిట్‌ను ప్రారంభించారు. ఈ పరిశ్రమకు 2016 జూన్ 19న నాటి రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్‌లో టాటా అడ్వాన్‌‌సడ్ సిస్టమ్స్, టాటా లాకిడ్ మార్టిన్, టాటా సికోర్‌స్కై లాంటి సంస్థలు ఉన్నాయి. 


కేన్సర్ నియంత్రణకు టాటా ట్రస్టుతో తెలంగాణ ఒప్పందం
కేన్సర్ వ్యాధి నియంత్రణకు టాటా ట్రస్టుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మార్చి 1న శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కె. తారకరామారావు, టాటా సంస్థల అధినేత, మాజీ చైర్మన్ రతన్ టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు.. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఉచిత పరీక్షల నిర్వహణకు కూడా ప్రభుత్వం యోచిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని ఆధార్‌తో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. 


కరీంనగర్ అధ్యాపకుడికి జాతీయ పురస్కారం 
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ పురస్కారం 2018 కి కరీంనగర్‌కు చెందిన మహ్మద్ ఆజమ్ ఎంపికయ్యారని హైదరాబాద్ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ తెలిపారు. సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు కలిగి ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని నాలుగేళ్లుగా సేవలందిస్తున్న ఆజమ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డును మార్చి 15న తిరుపతిలో జరిగే సభలో ప్రదానం చేస్తారు. ఆజమ్ ప్రస్తుతం జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 


ఏపీలో హెల్త్ బులెటిన్, పలకరింపు కార్యక్రమాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలిపేందుకు 'హెల్త్ బులిటెన్', చిన్నారులకు టీకాలు వేసేందుకు ఉద్దేశించిన 'పలకరింపు' కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 4న ప్రారంభించారు. మార్చి 5 నుంచి 30వ తేదీ వరకూ ‘పలకరింపు’ కార్యక్రమం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టనున్నారు. 57 వేల మందికి పైగా సిబ్బంది 1.22 కోట్ల ఇళ్లకు వెళ్లి ఈ ‘పలకరింపు’ కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్రంలో ఆర్థరైటిస్(ఎముకలు, కీళ్లజబ్బులు), ఆస్తమా, హైపర్ టెన్షన్ జబ్బులు తీవ్రంగా ఉన్నట్టు సీఎం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడైంది. జిల్లాల వారీగా చూస్తే.. విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండగా పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో మధుమేహం తీవ్రంగా ఉంది. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ఆస్తమా జబ్బుతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువ ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండగా.. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఆర్థరైటిస్ జబ్బు అధికంగా ఉన్నట్టు తేలింది. నెల వారీగా విడుదల చేసే బులెటిన్‌లో ఈ జబ్బులకు పరిష్కారం సూచించారు.

మొదటిసారి ఇనుము వాడింది ఏపీలోనే
దేశంలో మొదటిసారిగా ఇనుము వాడింది సింధు నాగరికత ప్రజలని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ వారి కంటే 500 ఏళ్ల ముందే.. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో.. ముందుగా ఇనుమును వాడారని ఏపీ పురావస్తు పరిశోధనల ద్వారా వెల్లడైంది. గోదావరి నదీ తీరాన మెగాలిథిక్ నాగరికత కాలంలో ఇనుప పనిముట్లు వాడినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సింధు నాగరికత కాలం నాటి ప్రజల కంటే దక్షిణ భారతదేశంలో విలసిల్లిన మెగాలిథిక్ నాగరికత కాలం నాటి ప్రజలు ఆధునికంగా ముందున్నారని స్పష్టమైంది. పుణేకు చెందిన డెక్కన్ కాలేజీ సహకారంతో పురావస్తు శాఖ పోలవరం ముంపు గ్రామాల్లో జరుపుతున్న పరిశోధనలు ఈ విషయాన్ని నిర్ధారించాయి.
మెగాలిథిక్ నాగరికత అంటే..
ఆదిమానవ దశ నుంచి పరిపక్వతతో కూడిన కుటుంబ జీవనానికి మధ్య ఉన్న సంధి దశనే మెగాలిథిక్ నాగరికత అంటారు. క్రీ.పూ.3,000 నుంచి క్రీ.పూ.1,000 మధ్య ఈ నాగరికత దక్షిణ భారతదేశంలో విలసిల్లింది. సింధులోయ నాగరికతలో క్రీ.పూ.2,500 నుంచి క్రీ.పూ.1,750 మధ్య ఇనుము వాడినట్లు పరిశోధకులు నిర్ధారించారు. కానీ అంతకంటే దాదాపు 500 ఏళ్ల క్రితమే మెగాలిథిక్ నాగరికతలో ఇనుము వాడినట్లు పురావస్తు పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో నాటి మానవుల జీవన శైలి మీద పరిశోధనలు చేస్తే మరింత సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. తవ్వకాల్లో బయల్పడిన ఎముకల ఆధారంగా అప్పటి మానవుల డీఎన్‌ఏ మ్యాపింగ్ చేయించాలని పురావస్తు శాఖ కమిషనర్ వాణీమోహన్ నిర్ణయించారు. 

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్ 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్ మార్చి 6న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రజత్‌కుమార్‌ను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రాకు పర్యావరణ, అటవీ శాఖ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. 


తొలి మహిళా రైల్వేస్టేషన్.. చంద్రగిరి
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో తొలి మహిళా రైల్వేస్టేషన్‌గా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ఎంపికైంది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకిచ్చే ప్రత్యేక కానుకగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ దీన్ని ప్రకటించారు. మార్చి 6న చంద్రగిరి రైల్వేస్టేషన్‌కు మహిళా రైల్వేస్టేషన్‌గా నామకరణం చేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే రెండు మహిళా రైల్వేస్టేషన్‌లు ఉన్నాయని, చంద్రగిరి మూడోదని పేర్కొన్నారు. 


విశాఖ కలెక్టర్‌కు తొలి విద్యుత్ కారు
దేశంలోనే తొలిసారిగా విద్యుత్ కారును విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా అందజేసింది. విశాఖలోని వివిధ శాఖల అధికారులకు దాదాపు 110 ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం కేటాయించనుంది. దేశంలోనే తొలిసారిగా అధికారికంగా విద్యుత్ కారును ఉపయోగించిన ఘనత విశాఖ జిల్లాకు దక్కిందని, ఈ వాహనాన్ని ప్రథమంగా తానే నడపడం సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు. 
10 మంది మావోయిస్టులు మృతి
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో 2018, మార్చి 2న జరిగిన ఎన్‌కౌంటర్లో 10 మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్‌‌స కమాండో మరణించారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వెంకటాపురం మండలం తిమ్మాపురం సమీపంలోని తడపల గుట్టల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫిబ్రవరి 2018 రాష్ట్రీయం

తెలంగాణ అమరవీరుల స్తూపం డిజైన్ ఖరారు 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను శాశ్వతంగా గుర్తుచేసుకునేందుకు ప్రమిద ఆకారంలో ఏడు అంతస్తులతో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఇందుకు సంబంధించిన నమూనా ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద ఈ స్తూపాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఇందులో సందర్శకుల కోసం అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం భారీ స్తూపాన్ని నిర్మించాలని నిర్ణయించడం తెలిసిందే. 


కమల్‌హాసన్ పార్టీ మక్కళ్ నీది మయ్యం’ 
తమిళనాట మరో నటుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రఖ్యాత హీరో, లోకనాయకుడుగా పేరుగాంచిన కమల్ హాసన్ ఫిబ్రవరి 21న మదురైలో పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. ‘మక్కళ్ నీది మయ్యం (ప్రజా న్యాయ వేదిక)’ పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆరు చేతులు ఒకదాన్కొకటి మణికట్టు దగ్గర పట్టుకున్నట్లుగా, వర్తులాకృతిలో ఉన్న చిత్రం, మధ్యలో నక్షత్రం ఉండేలా పతాక రూపకల్పన చేశారు. ఆ చేతులు ఎరుపు, తెలుపు రంగుల్లో ఒకదాని తరువాత మరొకటి ఉండేలా చిత్రించారు. ఆ ఆరు చేతులు ఆరు దక్షిణాది రాష్ట్రాలకు ప్రతీకలని తన ప్రసంగం సందర్భంగా కమల్ వివరించారు. సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సైతం హాజరయ్యారు.
పెనుకొండలో కియా మోటార్స్’ ప్రారంభం 
అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ఏర్పాటు చేస్తున్న ‘కియా మోటార్స్’ ఫ్రేమ్‌వర్క్ ఇన్‌స్టలేషన్ విభాగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 22న ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెంగళూరు, హైదరాబాద్, కృష్ణపట్నానికి దగ్గరగా ఏర్పాటవుతున్న ఈ కార్ల ప్లాంట్ భారత్‌లోనే అతిపెద్దది అవుతుందన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ భారత్‌లో 15వదని కియా ప్రెసిడెంట్, సీఈఓ హాన్-వూపార్క్ తెలిపారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోపు పనులు పూర్తి చేసి ద్వితీయార్థంలో కార్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని.. ఏటా 3 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. త్వరలో 3 వేల మంది ఉద్యోగులను నియమిస్తామని.. 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పిస్తామని అన్నారు. 


డబుల్ బెడ్రూం పథకానికి హడ్కో పురస్కారం
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకంలో ప్రభుత్వం రూపొందించిన తీరు, వాటి నమూనా తదితరాలను పరిశీలించిన హడ్కో.. 2017 సంవత్సరానికి హడ్కో డిజైన్ అవార్డును ప్రకటించింది. పేదలకు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో, ప్రత్యేక డిజైన్‌ను అనుసరిస్తున్నందుకు ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఏప్రిల్ చివరి వారంలో ఢిల్లీలో పురస్కార ప్రదానం ఉంటుందని వెల్లడించింది. ఇటీవల హడ్కో బృందం గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట, ఖమ్మం, నారాయణ్‌పేటల్లోని ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించింది. 

టీఎస్ కాప్’కు ఎన్‌సీఆర్‌బీ ట్రోఫీ 
ఎన్‌సీఆర్‌బీ-2017 ట్రోఫీని తెలంగాణ పోలీస్ శాఖ గెలుచుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ జాయింట్ డెరైక్టర్ సంజయ్ మాథుర్ వెల్లడించారు. ఈ నెల 28న చెన్నైలో జరిగే కాన్ఫరెన్‌‌సలో ఈ ట్రోఫీని అందించనున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏటా నిర్వహించే టెక్నాలజీ అమలు, వినియోగం, పోలీస్ శాఖలో కంప్యూటరీకరణ తదితర అంశాలపై రాష్ట్రాలకు పోటీలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఎన్‌సీఆర్‌బీ-2017 ట్రోఫీ కోసం గత నవంబర్‌లో నామినేషన్‌‌స అడిగారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రారంభించబోతున్న టీఎస్ కాప్ యాప్‌ను నామినేషన్‌కు పంపించారు. ఏపీ, చండీగఢ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పలు టెక్నాలజీ అంశాలపై నామినేషన్లు వచ్చాయి. ఈ నెల 9న అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నామినేషన్లను కమిటీ పరిశీలించింది. ఇందులో ‘ది బెస్ట్ ఐటీ ప్రాజెక్ట్-2017’గా టీఎస్ కాప్ ఎంపికై నట్లు తెలిపింది. 


తమిళనాడులో అమ్మ టూవీలర్’ పథకం తమిళనాడు దివంగత సీఎం జయలలిత 70వ జయంతి సందర్భంగా మహిళా ఉద్యోగులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందించే పథకం ‘అమ్మ టూవీలర్’ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న చెన్నైలో ప్రారంభించారు. ఐదుగురు లబ్ధిదారులకు తాళాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అందించారు. గవర్నర్ బన్వరీలాల్, సీఎం పళనిస్వామి, డెప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2016 ఎన్నికల్లో జయలలిత ఈ పథకాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దీని ప్రకారం.. స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్న ఉద్యోగినికి మొత్తం వ్యయంలో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సుమారు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన జరుగుతోందని అధికార అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. అనంతరం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎంలు జయలలిత విగ్రహాన్ని ఆవిష్కరించారు. 


విశాఖపట్నంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు 
ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. సదస్సుకి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతు.. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ పురోగతిలో ఉందని.. ఏపీని 2022 నాటికి దేశంలో మూడో రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నంబర్‌వన్‌గా నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు. గత మూడేల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి 1,946 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా రూ. 13.54 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 31 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసినట్టు సీఎం తెలిపారు. ఇప్పటికే 531 పరిశ్రమలు ఉత్పత్తిలోకి వచ్చాయని, రూ. 1.03 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందని, 2.65 లక్షల మందికి ఉపాధి లభించిందని ప్రకటించారు. మరో 1,143 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, వీటి ద్వారా రూ. 5.69 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందని, పారిశ్రామిక పెట్టుబడుల పురోగతి దేశంలోనే అత్యధికంగా 59 శాతం నమోదైందని చెప్పారు. మరో ఐదేళ్లలో 20 లక్షల మంది ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం తెలిపారు. 


హైదరాబాద్‌లో 15వ బయో ఆసియా సదస్సు 
15వ బయో ఆసియా సదస్సు హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 22న ప్రారంభమైంది. సదస్సుకి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. ఫార్మా, జీవశాస్త్ర రంగాల్లో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 200కుపైగా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, స్టార్టప్‌లతో కూడిన జినోమ్ వ్యాలీని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీనిని జినోమ్ వ్యాలీ 2.0 (రెండో దశ)గా ఆయన అభివర్ణించారు.

ప్రొఫెసర్ హాల్‌కు ఎక్సలెన్సీ అవార్డు 

జీవశాస్త్ర రంగంలో విశిష్ట సేవలందించే వారికి బయో ఆసియా అందించే జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును ఈ ఏడాది ప్రొఫెసర్ మైకేల్ ఎన్ హాల్‌కు అందించారు. స్విట్జర్లాండ్‌లోని బేసిల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న హాల్ కణాల పెరుగుదలలో ర్యాపమైసిన్ ప్రోటీన్ల పాత్రపై పరిశోధనలు చేశారు. అందుబాటులో ఉన్న ముడి పదార్థాలకు అనుగుణంగా శరీరంలోని ఒక వ్యవస్థ కణాల సైజును తగ్గిస్తుందన్న ఈయన పరిశోధన.. అవయవ మార్పిడిని మరింత సులభతరం చేసింది. రోగ నిరోధక వ్యవస్థ కొత్త అవయవాన్ని తిరస్కరించకుండా చూసేందుకు ఉపయోపడింది. 
మూడు రోజుల పాటు జరిగే బయో ఆసియా సదస్సులో దేశవిదేశాల నుంచి వచ్చిన 1,600 మంది పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు. 


రైతు కార్పొరేషన్ మార్గదర్శకాలు జారీ
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఇందులో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, శాఖ కమిషనర్ జగన్‌మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ డెరైక్టర్ లక్ష్మీబాయిలను డెరైక్టర్లుగా నియమించింది. కార్పొరేషన్‌కు రూ.200 కోట్లతో మూలధన నిధిని ఏర్పాటు చేసింది. ఇందులో గవర్నర్ పేరుతో రూ.199,99,99,300ను, మిగతా మొత్తాన్ని బోర్డు డెరైక్టర్ల పేరిట కేటాయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైతు సమన్వయ సమితి ఎండీగా వ్యవసాయ శాఖ కమిషనర్ కొనసాగనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలకు సంబంధించి జిల్లా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.
ఇవీ ప్రధాన మార్గదర్శకాలు..
  • రాష్ట్రంలో ప్రధానమైన వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు అనుగుణంగా పంట కాలనీలను ఏర్పాటు చేయాలి. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలి.
  • రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పండించిన ఆహార పదార్థాల సరఫరా.
  • రైతు సమితుల సభ్యులకు శిక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటు చేయడం. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు పంపడం.
  • సన్న, చిన్నకారు రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి సాగు ఖర్చు తగ్గించడం.
కార్పొరేషన్ లక్ష్యాలు, ఉద్దేశాలివీ..
  • వ్యవసాయ రంగాన్ని వేగంగా అభివృద్ధిపర్చడం
  • వివిధ పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం
  • రాష్ట్రంలో రెండో హరిత విప్లవం తరహాలో కీలక అడుగు వేయడం
  • రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం
  • కేంద్ర సంస్థలతో కలిసి ఆయా పంటలను కొనుగోలు చేయడం
  • మార్కెట్‌లో మద్దతు ధర లభించనపుడు జోక్యం చేసుకుని మంచి ధర అందేలా చూడడం
  • ఆహార పంటల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ చేపట్టడం ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించడం
  • నాణ్యమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం
  • అవసరమైతే సొంత ఔట్‌లెట్లను ఏర్పాటు చేయడం
  • వ్యవసాయ, దాని అనుబంధ శాఖలతో కలసి పనిచేయడం


జినోమ్ వ్యాలీలో మరో బయోకాన్ యూనిట్
బయో టెక్నాలజీ దిగ్గజం బయోకాన్ హైదరాబాద్ నగరంలో కొత్తగా యూనిట్ ప్రారంభించనుంది. దీంతోపాటు ప్రస్తుత యూనిట్‌ను మరింత విస్తరించనుంది. హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 23న బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షాతో సమావేశమయ్యారు. తమ అనుబంధ కంపెనీ సింజెన్ ద్వారా జినోమ్ వ్యాలీలో బయోకాన్ కొత్త ఆర్ అండ్ డి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 1,000 హై స్కిల్డ్ ఉద్యోగాలు వస్తాయన్నారు. దీంతోపాటు బయోకాన్లోని సిబ్బందిని రెట్టింపు చేస్తామని తెలిపారు. 

బి.నాగిరెడ్డి పేరుతో తపాలా బిళ్ల ఆవిష్కరణ
భారతీయ సినీ పితామహుడు, దివంగత సినీ దర్శక, నిర్మాత.. వాహినీ స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి పేరుతో తపాలా బిళ్లను ఫిబ్రవరి 23న చెన్నైలో ఆవిష్కరించారు. నాగిరెడ్డి 105 వ వర్ధంతి (ఫిబ్రవరి 25) పురస్కరించుకుని ఈ తపాలా బిళ్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ హాజరయ్యారు. ఐదు రూపాయల విలువైన ఈ తపాలా బిళ్లను వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ ‘బి.నాగిరెడ్డి ది లెజెండ్’పుస్తకాన్ని ఆవిష్కరించారు.


హైదరాబాద్‌లో ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు 
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఫిబ్రవరి 26న ఈ-గవర్నెన్‌‌స జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు.. డిజిటల్ ప్రజాస్వామ్యానికి ప్రజలు డిజిటల్ విప్లవం బాట వేయాలని, సాంకేతిక విజ్ఞాన ఫలాలను ప్రజలు ఆర్థికాభివృద్ధికి వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 180 రకాల పౌర సేవలను మొబైల్ ద్వారా అందించేందుకు ‘టీ యాప్ ఫోలియో’ పేరుతో త్వరలో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇది మీ-సేవ ప్రాజెక్టుకు 2.0 (ఆధునిక వెర్షన్) అన్నారు. ఏడేళ్ల కిందట ప్రారంభమైన మీ-సేవ కేంద్రాల ద్వారా రాష్ట్రంలో జరిగిన లావాదేవీల సంఖ్య ఇటీవలే 10 వేల కోట్లు దాటిందని చెప్పారు. రాష్ట్రంలో 4,500 మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 1.5 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. 


విశాఖ సీఐఐ సదస్సులో 734 ఒప్పందాలు 
వరుసగా మూడవ ఏడాది విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ఫిబ్రవరి 26న ముగిసింది. ముగింపు సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది భాగస్వామ్య సదస్సులో 4,253 మంది పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా రూ. 4.39 లక్షల కోట్ల విలువైన 734 ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. 50 దేశాల నుంచి 280 మంది విదేశీ ప్రతినిధిలు, 3,673 మంది దేశీయ పారిశ్రామికవేత్తలు, 30 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఈ సమావేశాల్లో భాగస్వామ్యులు కావడానికి విదేశీయులు ఆసక్తి చూపిస్తున్నారని, ఈసారి జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ కంట్రీల సెషన్‌‌స జరిగాయని, వచ్చే ఏడాది శ్రీలంక, రష్యా సెషన్‌‌స కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడున్నరేళ్లలో మొత్తం 1,946 ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా రూ.13.54 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 31 లక్షల మందికి ఉపాధి లభించనుందన్నారు. 


ఘంటా చక్రపాణికి తెలుగు వర్సిటీ సాహిత్య పురస్కారం
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి సాహిత్య ప్రక్రియలో తెలుగు వర్సిటీ సాహిత్య పురస్కారం లభించింది. చక్రపాణి రచించిన తెలంగాణ జైత్రయాత్ర అనే రచనకు ఈ పురస్కారం దక్కింది. 2015 సంవత్సరానికి గాను ఎంపికైన ఈ పురస్కారాన్ని ఫిబ్రవరి 26న నాంపిల్లిలోని పొట్టి శ్రీ రాములు తెలుగు వర్సిటీలో అందజేశారు. అవార్డు కింద రూ.20,116 నగదు, ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు. 
 

టీఎస్ ఆర్టీసీకి జాతీయ పురస్కారాలు
ఇంధన పొదుపు, వాహన ఉత్పాదకతలో టీఎస్‌ఆర్టీసీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కొన్నేళ్లుగా ఈ విభాగాల్లో ఉత్తమ రవాణాసంస్థగా పురస్కారాలు సొంతం చేసుకుంటున్న ఆర్టీసీ ఈసారీ అవార్డులను దక్కించుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను పలు విభాగాల్లో ఎంపిక చేసిన రవాణా సంస్థలకు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్‌‌సపోర్ట్ అండర్‌టేకింగ్‌‌స (ఏఎస్‌ఆర్టీయూ) ఢిల్లీలో జరిగిన 62వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో పురస్కారాలు ప్రదానం చేసింది. వాహన ఉత్పాదకత, ఇంధన పొదుపు లో టీఎస్‌ఆర్టీసీ ఉత్తమ రవాణా సంస్థగా పురస్కారాలు దక్కించుకుంది. వాహన ఉత్పాదకతలో 318.27 కి.మీ. నుంచి 328.27 కి.మీ.(కి.మీ./వెహికల్/డే)కు మెరుగుపరుచుకుని టాప్‌లో నిలిచింది. ఇక 7,500 వాహనాలు ఉన్న రవాణాసంస్థల కేటగిరీలో ఇంధనపొదుపునకు సంబంధించి 5.51 కేఎంపీఎల్‌తో ఉత్తమంగా నిలిచింది. 


తెలంగాణలో 3 ఏళ్లలో 1,149 రైతుల ఆత్మహత్య 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూడేళ్లలో 1,149 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు నివేదికను సిద్ధం చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,066 రైతు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయని గుర్తించింది. అందులో వ్యవసాయ సంబంధిత కారణాల వల్ల ఎందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న దానిపై 1,808 కేసులను తీసుకొని జిల్లాల్లో త్రిసభ్య కమిటీలు విచారణ చేపట్టాయి. చివరకు 1,149 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. 
ఈ కేసుల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 168 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 144 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 109 మంది ఆత్మహత్య చేసుకోగా, ఇప్పటికే 846 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించినట్లు నివేదికలో వెల్లడించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం అందజేశారు. 


బీఎస్‌ఈలో చేరిన జీహెచ్‌ఎంసీ
హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఫిబ్రవరి 22న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో చేరింది.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ మైనింగ్ సదస్సు హైదరాబాద్‌లో 4 రోజుల అంతర్జాతీయ మైనింగ్ సదస్సు జరిగింది. మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు, ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గనులేమీ అక్షయ పాత్రలు కావని.. దుర్వినియోగం చేస్తే వైపరీత్యాలు, ఆపదలు తప్పవని గవర్నర్ అన్నారు. గనుల తవ్వకాల కోసం ధ్వంసం చేసిన అడవులను తప్పనిసరిగా పునరుద్ధరించాలని, లేదంటే కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకురావాలన్నారు. 


హైదరాబాద్‌లో ఇరాన్ అధ్యక్షుడి పర్యటన 
భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ.. ఫిబ్రవరి 16న (శుక్రవారం) చారిత్రక మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతు.. భారతదేశానికి పెట్రోల్, గ్యాస్ విక్రయించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. తమ దేశంలో చబహార్ ఓడరేవు ప్రారంభమైందని, దీని వల్ల భారత్‌కు రవాణా మార్గం దగ్గర అవుతుందని పేర్కొన్నారు. 
భారతదేశం ఓ పుష్పగుచ్ఛం లాంటిదని, ఓ పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులూ ఉంటాయని, అలాగే భారత్‌లో ఎన్నో మతాలు, కులాలు, తెగలు ఐకమత్యంతో ఉంటున్నాయని రౌహానీ పేర్కొన్నారు. ఇరు దేశాలు టెక్నాలజీ, వైజ్ఞానిక రంగాల్లో సహాయ, సహకారాలు అందించుకోవాలని సూచించారు. 


కావేరీ జలాల్లో కర్ణాటకకు మరో 14.75 టీఎంసీలు
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17న కీలక తీర్పునిచ్చింది. 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) కేటాయించిన నీటి వాటాల్లో మార్పులు చేస్తూ కర్ణాటకకు మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశమిచ్చింది. అంతే పరిమాణంలో తమిళనాడుకు కోత విధించింది. కేటాయింపుల్లో తాగు నీటికే తొలి ప్రాధాన్యత అని సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తేల్చింది. బెంగళూరుకు ఉన్న ‘ప్రపంచ స్థాయి నగరం’ హోదాను దృష్టిలో పెట్టుకుని తాజా కేటాయింపులు చేస్తున్నామంది. 14.75 టీఎంసీల్లో బెంగళూరు నగర అవసరాలకోసం 4.75 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ తీర్పుతో ఇరు రాష్ట్రాల సరిహద్దులోని బిలిగుండ్లు నుంచి తమిళనాడుకు కర్ణాటక 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. 
జాతీయ ఆస్తి.. రాష్ట్రాల సొత్తు కాదు 
అంతర్జాతీయ నదీ జలాల సమాన పంపకాలకు సంబంధించిన హెల్సింకి, కాంపియన్, బెర్లిన్ నిబంధనలను తాజా తీర్పులో ఉటంకించిన కోర్టు.. నదులు జాతీయ ఆస్తులనీ, ఏ రాష్ట్రం కూడా ఒక నది పూర్తిగా తనకే చెందుతుందని చెప్పుకోజాలదని స్పష్టం చేసింది. ప్రకృతి వరప్రసాదాలైన నదీ జలాలను బాధ్యతాయుతంగా వాడుకునే హక్కు ఆ నది పారుతున్న ప్రతి రాష్ట్రానికీ ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 363 ప్రకారం ఈ కేసును సుప్రీంకోర్టు విచారించకూడదన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కావేరీ జలాల వివాదం విషయమై 2016లో కర్ణాటక, తమిళనాడుల్లో ఘర్షణలు జరిగాయి. 
తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75
సీడబ్ల్యూడీటీ 2007లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలకు వరుసగా 419, 270, 30, 7 టీఎంసీల నీటిని కేటాయించింది. తాజా తీర్పుతో తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75 టీఎంసీల నీళ్లు దక్కనున్నాయి. కేరళ, పుదుచ్చేరిల కేటాయింపుల్లో మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి మార్పులూ చేయలేదు. అలాగే నదీ పరీవాహక ప్రాంతం నుంచి 10 టీఎంసీల భూగర్భ జలాలను తోడుకునేందుకు తమిళనాడుకు అనుమతినిచ్చింది. తీర్పును అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రానికి ధర్మాసనం ఆరు వారాల గడువిచ్చింది. 15 ఏళ్ల వరకు ఈ కేటాయింపులు అమలవుతాయని ధర్మాసనం తెలిపింది. 
1881 నుంచి వివాదం
  • 1881వ సంవత్సరంలో కావేరీ నదిపై డ్యామ్ నిర్మించాలన్న అప్పటి మైసూర్ సంస్థానం ప్రయత్నాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ అడ్డుకోవటంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఆ తర్వాత నదీ జలాల పంపిణీపై రెండు ప్రభుత్వాలు 1892, 1924వ సంవత్సరాల్లో వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోవటంతో వివాదం పరిష్కారమయింది. ఈ ఒప్పందాల కాల పరిమితి 1974లో ముగిసింది.
  • 1990 - తమిళనాడు కోరిక మేరకు కేంద్రం కావేరీ జల వివాద ట్రిబ్యునల్(సీడబ్ల్యూడీటీ)ను ఏర్పాటు చేసింది.
  • 1991 - అత్యవసర సాయంగా కొంతనీరు విడుదల చేయాలన్న తమిళనాడు వినతిని సీడబ్ల్యూడీటీ తిరస్కరించింది. దీంతో తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం సూచనల మేరకు.. తమిళనాడుకు 205 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీడబ్ల్యూడీటీ కోరగా కర్ణాటక పట్టించుకోలేదు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కర్ణాటక దిగిరాలేదు. ఈ పరిణామంతో కేంద్రం సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను గెజిట్‌లో ప్రచురించింది.
  • 1998 - సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను అమలు పరిచేందుకు ప్రత్యేకంగా కేంద్రం కావేరి నదీ ప్రాధికార సంస్థ(సీఆర్‌ఏ)ను ఏర్పాటు చేసింది.
  • 2007 - ఏర్పాటైన 17 ఏళ్ల తర్వాత కావేరి జలాల పంపిణీ తుది అవార్డును సీడబ్ల్యూడీటీ ప్రకటించింది. నదీ జలాల పంపిణీపై 1892, 1924 సంవత్సరాల్లో కుదిరిన ఒప్పందాల అమలే సరైన పరిష్కారమని అందులో పేర్కొంది.
  • 2013 - కావేరి యాజమాన్య బోర్డు(సీఎంబీ) ఏర్పాటు చేయాలని తమిళనాడు కోరడంతో ఆ మేరకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
  • 2013 మే 28 - సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయనందుకు తనకు కలిగిన రూ.2,480 కోట్ల నష్టాన్ని కర్ణాటక చెల్లించాలంటూ తమిళనాడు సుప్రీంకు వెళ్లింది.
  • 2013 - నీటి విడుదలపై సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయాలన్న తమిళనాడు డిమాండ్ సహేతుకం కాదని కావేరీ పర్యవేక్షక కమిటీ పేర్కొంది.
  • 2016 సెప్టెంబర్ 11 - కావేరి నీటి విడుదలపై ఉత్తర్వులను సవరించాలని కర్ణాటక వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

హైదరాబాద్‌లో వరల్డ్ ఐటీ కాంగ్రెస్
‘ఐటీ పరిశ్రమ ఒలింపిక్స్’గా ఖ్యాతిగాంచిన ప్రతిష్టాత్మక ప్రపంచ ఐటీ కాంగ్రెస్ మూడు రోజుల సదస్సు హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 19న ప్రారంభమైంది. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగుతున్న ఈ సదస్సుని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలు ప్రసంగించారు. వరల్డ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్‌‌స (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సదస్సును నిర్వహిస్తున్నాయి. 40 ఏళ్లగల చరిత్రగల ఈ సదస్సును తొలిసారి భారత్‌లో నిర్వహిస్తుండటంతో దీనికి ప్రత్యేకత సంతరించుకుంది. 1978లో తొలిసారి ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరగ్గా 22వ సమావేశానికి హైదరాబాద్ వేదికైంది.


తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్ 
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో ఎన్నికల కమిషనర్ల పానెల్ సమావేశమై తెలంగాణకు కొత్త సీఈవోగా ఆయనను ఎంపిక చేసింది. 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రజత్‌కుమార్ ప్రస్తుతం అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న రీ నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఈవోగా రజత్‌కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఈవోగా వ్యవహరించిన భన్వర్‌లాల్ ఏపీ విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాలకు సీఈవోగా కొనసాగారు. భన్వర్‌లాల్ పదవీ విరమణ పొందాక ఏపీ సీఈవోగా సిసోడియా బాధ్యతలు చేపట్టారు.


హైదరాబాద్‌లో అడోబ్ కార్యాలయం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రంగా కొనసాగుతున్న హైదరాబాద్‌లో మరో ఐటీ దిగ్గజ సంస్థ ఏర్పాటు కానుంది. ప్రముఖ ఐటీ సంస్థ అడోబ్ తమ కార్యాలయాన్ని హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా ఐటీ దిగ్గజం అడోబ్ చైర్మన్, సీఈఓ శంతన్ నారాయణ్‌తో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 19న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అడోబ్ కార్యాలయాన్ని నెలకొల్పాల్సిందిగా కేటీఆర్ కోరారు. 2015, మే నెలలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో శంతన్ నారాయణ్‌తో తొలిసారి సమావేశమైన కేటీఆర్, తర్వాత పలుమార్లు ఆయన్ను కలిశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో అడోబ్ కార్యకలాపాలను విస్తరించాల్సిందిగా కోరిన విషయాన్ని ఐటీ కాంగ్రెస్ సమావేశంలో గుర్తుచేశారు. దీనికి స్పందించిన శంతన్ నారాయణ్ అడోబ్ కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానమిస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే అడోబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌‌స కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పుతామని తెలిపారు. 


వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో పాల్గొన్న రోబో సోఫియా 
ప్రపంచంలోనే అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’.. హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ రోబో సృష్టికర్త, హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సీఈవో డేవిడ్ హాన్సన్‌తో కలసి ఫిబ్రవరి 20న సోఫియా సదస్సుకి హాజరైంది. ప్రసంగించడమే కాదు.. ప్రశ్నలు అడిగితే చకచకా సమాధానాలూ ఇచ్చింది. బాలీవుడ్‌లో నీకు ఇష్టమైన హీరో ఎవరనే ప్రశ్నకి.. షారూక్ ఖాన్ అంటు సమాధానం ఇచ్చింది. 
హ్యూమనాయిడ్ రోబో సోఫియాకి సౌదీ అరేబియా 2017లోనే పౌరసత్వం ఇచ్చింది. 


ప్రమాదంలో 40 భాషలు
దేశంలోని 40కి పైగా భాషలు/మాండలికాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 17న వెల్లడించింది. ఈ భాషలను (ఒక్కో భాష) మాట్లాడేవారి సంఖ్య 10 వేల కంటే తక్కువగా ఉందని తెలిపింది. ఈ జాబితాలో అండమాన్-నికోబార్ దీవులకు చెందిన భాషలు/ మాండలికాలు 11 ఉండగా, తర్వాతి స్థానాల్లో మణిపూర్ 7; హిమాచల్‌ప్రదేశ్ 4 ఉన్నాయి. అంధ్రప్రదేశ్‌కు చెందిన గడాబా, నైకీ భాషలు కూడా ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి.

తెలంగాణలో 17 పులులు ఉన్నట్లు ప్రాథమిక అంచనారాష్ట్ర అడవుల్లో పెద్ద పులులు, చిరుతల లెక్కలపై అటవీ శాఖ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. మొత్తం 17 పులులు, 125 చిరుతలు ఉన్నాయని జాతీయ జంతు గణనలో భాగంగా సేకరించిన పాదముద్రల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అత్యధికంగా నల్లమలలోని రాజీవ్ టైగర్ ప్రాజెక్టు పరిధిలో 21 పెద్ద పులులు, 57 చిరుతల అడుగు జాడలను సేకరిం చగా.. అవి 13 పులులు, 45 చిరుతల పాదముద్రలని భావిస్తున్నారు. రెండో స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ ప్రాజెక్టు పరిధిలో 4 పులులు, 25 చిరుతల అడుగుజాడలను గుర్తించారు. కచ్చితమైన నిరూపణ కోసం పాదముద్రలను డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు, పెంటిక (మలం) నమూనాలను సీసీఎంబీ హైదరాబాద్‌కు పంపించారు. కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులోని జన్నారం దట్టమైన ఫారెస్టు పరిధిలో ఒకటంటే ఒక్క పులి అడుగు జాడ కనిపించలేదు. 

ఈ-ప్రగతి ప్రాజెక్టుకు పెగా సాఫ్ట్‌వేర్
సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేంద్రీకృత పోర్టల్ ‘ఈ-ప్రగతి’కి సాంకేతిక సేవలందించే ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఈ-ప్రగతి పోర్టల్ ద్వారా 33 ప్రభుత్వ విభాగాలు, 315 ఏజెన్సీలు, 745 పౌర సేవల్ని ఒకే గొడుగు కిందికి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,398 కోట్లు. ఒకే పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో పౌర సేవల్ని అందించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఈ-ప్రగతి సీఈవో ఎన్.బాలసుబ్రమణ్యం చెప్పారు. కేంద్రీకృత వ్యవస్థ కావడంతో ఏపీలో డిజిటైజేషన్‌కు ఇది ఊతమిస్తుందని, అన్ని విభాగాలపై నియంత్రణ ఉంటుందని తెలియజేశారు. కాగా, భారత్‌లో పెగాసిస్టమ్స్‌కు ఇదే తొలి ప్రాజెక్టు. 


హైదరాబాద్‌లో ముస్లిం పర్సనల్ లా ప్లీనరీ సమావేశాలు
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ 26వ ప్లీనరీ సమావేశాలు ఫిబ్రవరి 9-11 వరకు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సమావేశాలకు కోర్ కమిటీ సభ్యుడు మౌలానా సల్మాన్ నద్వీ గైర్హాజరై బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించడానికి శ్రీ శ్రీ రవిశంకర్‌ను బెంగళూరులో కలవడం వివాదానికి దారి తీసింది. దీంతో సల్మాన్ బోర్డు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో పాటు కొత్త బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చివరి రోజైన ఫిబ్రవరి 11న బోర్డు హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో కొన్ని నిర్ణయాలను ప్రకటించింది.


హైదరాబాద్‌లో తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు
చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విచారణకు దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటవుతోంది. నాంపల్లిలోని హాకా భవన్‌లో ఉన్న భరోసా కేంద్రం ఆధీనంలోనే ఫిబ్రవరి 24న దీన్ని ప్రారంభించనున్నారు. నగర కమిషనరేట్ పరిధిలో అత్యాచారం, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు, తీవ్రమైన గృహహింస కేసుల్లో బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి భరోసా కేంద్రాన్ని 2016, మే 7న ఏర్పాటు చేశారు.


7 దేశాల్లో తెలంగాణ మహిళల బైక్ యాత్రతెలంగాణ రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా రాష్ట్రానికి చెందిన నలుగురు మహిళలు బైక్‌లపై సాహసయాత్ర చేపట్టారు. ఈ మేరకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఫిబ్రవరి 11న యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రా బృందానికి ప్రముఖ బైక్ రైడర్ జై భారతి నాయకత్వం వహిస్తుండగా ప్రియా బహదూర్, శిల్ప బాలకృష్ణన్, సుజన్ శాంతిలు సభ్యులుగా ఉన్నారు.
ఈ బృందం 50 రోజుల యాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి మేకాంగ్ వరకు భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం వంటి 7 దేశాల్లో రోడ్డు మార్గం ద్వారా సుమారు 17 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వీరు 19 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు, 35 యునెస్కో సైట్లను సందర్శించి తెలంగాణ టూరిజం ప్రమోషన్‌తో పాటు, పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం నిర్వహిస్తారు. వీరికి 400 సీసీ బైకులను బజాజ్ ఆటో కంపెనీ స్పాన్సర్ చేసింది.


తెలంగాణలో బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫాక్చరింగ్ పార్కు
తెలంగాణలో కన్‌స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటుకు యూఏఈకి చెందిన కెఫ్ ఇన్‌ఫ్రా (కేఈఎఫ్ ఇన్‌ఫ్రా), రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకోసం కెఫ్ ఇన్‌ఫ్రా సంస్థ రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 1,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అలాగే పార్కులో ఏర్పాటు కానున్న 60-70 అనుబంధ పరిశ్రమలతో మొత్తం 10 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, దాదాపు 30 వేల మందికి పరోక్ష ఉపాధి దొరకనుంది.


హైదరాబాద్‌లో ఫ్రెంచ్ ఏరియల్ షో
దేశంలోనే తొలిసారి హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫ్రెంచ్ ఏరియల్ షో నగరవాసులను మంత్ర ముగ్ధులను చేసింది. భారీ క్రేన్ సాయంతో 50 అడుగుల ఎత్తులో గాలిలో తేలియాడుతూ.. మరోపక్క మనసుకు పులకరించే సంగీతం మధ్యన సాగిన విన్యాసాలను కేరింతలు, చప్పట్లతో సందర్శకులు స్వాగతించారు. ‘మన్సూర్ ఇండియా కల్చరల్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో నిర్వహిస్తున్న ఫ్రెంచ్ ఏరియల్ షో తొలి ప్రదర్శనను నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఫిబ్రవరి 13న రాత్రి నిర్వహించారు. ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో 18 మంది కళాకారుల సంగీతం, నృత్యం, క్రాఫ్ట్, ఆర్కెస్ట్రా, సర్కస్ తదితర ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. 


తెలంగాణ నూతన సీఎస్‌గా శైలేంద్ర కుమార్ జోషి రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం జనవరి 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్పీ సింగ్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన స్థానంలో ఎస్‌కే జోషిని నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాలుగో సీఎస్‌గా జోషి నియమితులయ్యారు. 
1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జోషి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవారు. 1959 జనవరి 20న జన్మించిన ఆయన రూర్కీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్‌‌సడ్ స్టడీస్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 


ఏటా ఏపీకి వచ్చే పర్యాటకులు 10 కోట్ల మంది 
ఏటా రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య 2.84 లక్షలు పెరిగింది. తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)కి పర్యాటక రంగం అండగా నిలుస్తోంది. 2017-18 (ఏప్రిల్-నవంబర్)లో రాష్ట్రానికి పర్యాటకుల ద్వారా రూ.36,034 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ కాలంలో రాష్ట్రాన్ని 10,62,80,739 మంది సందర్శించారని అధికారిక లెక్కల ద్వారా వెల్లడైంది. 
రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా ఎక్కువ ఆదాయం చిత్తూరు జిల్లా నుంచే వస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. గతేడాది తిరుపతి సందర్శించిన పర్యాటకులతో పోల్చితే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య 2.84 లక్షలు పెరిగింది. 

ముగిసిన మేడారం జాతర
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. ఫిబ్రవరి 2న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం చేరుకొని వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ‘‘మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తామన్నారు. జాతర కోసం 200 నుంచి 300 ఎకరాల స్థలం సేకరిస్తామని తెలిపారు.
తెలంగాణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే గిరిజన ఉత్సవం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జరిగే ఈ జాతర ప్రతి రెండేళ్లకొకసారి జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 3న ముగుస్తుంది.


అమరావతిలో సీఎస్‌ఐఆర్ ప్రయోగ కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) ప్రయోగ, ప్రదర్శన కేంద్రం ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. సీఎస్‌ఐఆర్ డెరైక్టర్ జనరల్ గిరీశ్ సాహ్నీ, సీనియర్ శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 6న సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్‌ఐఆర్ ప్రయోగశాలల్లో కనుగొన్న పరిశోధన ఫలాల్ని, సరికొత్త ఆవిష్కరణలను పరీక్షించి, ప్రదర్శించడానికి వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రతిపాదించగా.. సీఎం అంగీకారం తెలిపారు. ‘సెంటర్ ఫర్ స్కేలింగ్ అప్ అండ్ డిమాన్‌స్ట్రేషన్ ఆఫ్ రెలవెంట్ సీఎస్‌ఐఆర్ టెక్నాలజీస్’ పేరుతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో రెండు నెలల్లో సవివర కార్య ప్రణాళికను సిద్ధం చేసి తీసుకొస్తామని సాహ్ని తెలిపారు. కాగా, బౌద్ధ ఆలయం నిర్మాణానికి అమరావతిలో పదెకరాల స్థలం కేటాయిస్తామని సీఎం చెప్పారు. 

ఏపీ తాత్కాలిక హైకోర్టుకు ఏఎన్‌యూ భవనాలు 
తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ) ప్రాంగణంలోని కొన్ని భవనాలను ఎంపిక చేశామని ఉమ్మడి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. ఆయా భవనాలను పరిశీలించేందుకు రావాలని కోరుతూ ఏపీ తాత్కాలిక హైకోర్టు భవనాల ఏర్పాటు పరిశీలన కమిటీకి సర్కార్ లేఖ రాసింది. యూనివర్సిటీ భవనాలను పరిశీలించిన తర్వాత కమిటీ.. తన అభిప్రాయాలను న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్టు ముందు ఉంచుతుంది. ఫుల్‌కోర్టులో మెజారిటీ నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది.