Sunday, 9 July 2017

జూన్ 2017 రాష్ట్రీయం

తెలంగాణ పోలీస్‌కు ‘పాస్‌పోర్టు’ పురస్కారంపాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో పాటిస్తున్న ప్రక్రియకుగాను తెలంగాణ పోలీస్ శాఖ పాస్‌పోర్ట్ సేవాదివాస్ పురస్కారానికి ఎంపికైంది. ఈ మేరకు జూన్ 24న పాస్‌పోర్టు దివాస్‌ను పురస్కరించుకొని ఢిల్లీలో జూన్ 23న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ శాఖ తరపున హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 
2016లో ఫిక్కీ సైతం పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో హైదరాబాద్ పోలీసులు తీసుకొచ్చిన వెరిఫాస్ట్ అప్లికేషన్‌కు అవార్డు ప్రదానం చేసింది. పాస్‌పోర్టు దరఖాస్తులను పోలీసులు వారం రోజుల్లోనే వెరిఫికేషన్ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. 


ఏపీ పోలీస్‌కు పాస్‌పోర్ట్ అవార్డుపాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. జూన్ 23న ఢిల్లీలో జరిగిన పాస్‌పోర్ట్ దివస్ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చేతుల మీదుగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఈ అవార్డు అందుకున్నారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా చేపట్టి త్వరగా పూర్తి చేస్తున్నందుకు గాను రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. 
 

నేతన్నకు చేయూత పథకం ప్రారంభంచేనేత కార్మికులకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించడానికి త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని (పొదుపు నిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు జూన్ 24న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ‘నేతన్నకు చేయూత’ కొత్త పథకాన్ని మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. పథకం వల్ల రాష్ట్రంలో 30 వేల మంది చేనేత కార్మికులకు ప్రయోజనం కలగనుంది. 50 శాతం సబ్సిడీపై నూలు, రంగులు, రసాయనాలు అందజేస్తారు. 18 ఏళ్లు నిండి చేనేత వృత్తిపై ఆధారపడిన ఎవరైనా పథకంలో చేరవచ్చు. కార్మికుడు వేతనంలో 8 శాతం చెల్లిస్తే ప్రభుత్వం 16 శాతాన్ని మ్యాచింగ్ గ్రాంటుగా అతడి ఖాతాకు జమ చేస్తుంది. 


తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా శివారెడ్డితెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్‌‌సలర్, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఎన్నికయ్యారు. 24 ఏళ్లుగా పరిషత్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ఇటీవల మరణించడంతో ఆయన స్థానంలో శివారెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు పరిషత్ ట్రస్టు కార్యదర్శిగా కొనసాగిన శివారెడ్డి ఆ స్థానానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం పరిషత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ జె.చెన్నయ్య ట్రస్టు కార్యదర్శిగా కూడా కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు.

వాసాల నర్సయ్యకు కేంద్ర బాలసాహిత్య అవార్డుతెలంగాణకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త వాసాల నర్సయ్య కేంద్ర సాహిత్య అకాడమీ అందించే బాలసాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. 45 ఏళ్లుగా బాలసాహిత్యంలో నర్సయ్య చూపుతున్న ప్రతిభను గుర్తించి 2017 సంవత్సరానికిగాను ఆయనను ఎంపిక చేసినట్లు కేంద్ర సాహిత్య అకాడమీ జూన్ 22న ప్రకటించింది. నర్సయ్య జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చౌలమద్దికి చెందినవాడు. అలాగే నల్లగొండకు చెందిన మెర్సీ మార్గరెట్ రచించిన ‘మాటల మడుగు’ కవిత్వం యువ పురస్కార్‌కు ఎంపికై ంది. వీరికి నవంబర్ 14 బాలల దినోత్సవం రోజున న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పురస్కారంతోపాటు రూ.50 వేల నగదు అందజేయనున్నారు. 


గన్నవరం ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ హోదాకు నోటిఫికేషన్ విజయవాడ గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించిన కేంద్రం జూన్ 22న అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలోనే కేంద్ర క్యాబినెట్ గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు అధికారికంగా గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీ నుంచి అంతర్జాతీయ సేవలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అలాగే తిరుపతి విమానాశ్రయానికి కూడా అంతర్జాతీయ హోదా కల్పిస్తూ అధికారికంగా గెజిట్ వెలువరించింది.


సీసీఎంబీలో అటల్ ఇన్నోవేషన్ సెంటర్సృజనాత్మకతను ప్రోత్సాహించే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఏర్పాటు చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌గా హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఎంపికైంది. సంస్థ డెరైక్టర్ డాక్టర్ రాకేశ్ కుమార్ మిశ్రా జూన్ 22న ఈ విషయాన్ని తెలిపారు. వినూత్నమైన ఆలోచనలతో ముందుకొచ్చే ఔత్సాహికులకు సీసీఎంబీలో సౌకర్యాలన్నీ అందుబాటులోకి తేవడం, తద్వారా సామాజిక ప్రయోజనాలున్న ఉత్పత్తి లేదా సేవగా అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రం ప్రయత్నిస్తుందని ఆయన వివరించారు. 
ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన దాదాపు 3,780 సంస్థలు ఈ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేయగా నీతి ఆయోగ్ పదింటిని ఎంపిక చేసింది. ఇందులో సీసీఎంబీ ఒకటి. ఈ కేంద్రంలో బయోటెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తారు. దీని కోసం నీతి ఆయోగ్ ఏడాదికి గరిష్టంగా రూ.పది కోట్ల వంతున ఐదేళ్లపాటు నిధులు అందిస్తుంది. ఆ తరువాత సంస్థ తనంతట తానే మనుగడ సాగించాలి. కాగా సీసీఎంబీలో ఇప్పటికే ఇలాంటి ఇన్‌క్యుబేషన్ కేంద్రం ఒకటి పనిచేస్తోంది. 


తెలంగాణ రుణ ప్రణాళిక రూ. 1.14 లక్షల కోట్లు2017-18లో పలు రంగాలకు రూ.1,14,353 కోట్ల మేర రుణాలివ్వాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 23న ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి వార్షిక ప్రణాళికను విడుదల చేశారు. ఇందులో సగం, అంటే రూ.54,198 కోట్లు వ్యవసాయ రుణాలే. 
ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.39,752 కోట్ల పంట రుణాలివ్వాలని ఎస్‌ఎల్‌బీసీ లక్ష్యంగా పేర్కొనగా ఇందులో ఖరీఫ్‌కు రూ.23,851 కోట్లు, రబీకి రూ.15,901 కోట్లివ్వనున్నారు. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు రూ.14,446 కోట్లు కాగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.16,465 కోట్లు, విద్యా రుణాలు రూ.1,663 కోట్లు, గృహ రుణాలకు రూ.3,885 కోట్లు కేటాయించారు.


పట్టణ సంస్కరణలో ఏపీకి తొలిస్థానం 2016-17 పట్టణ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. జూన్ 23న ఢిల్లీలో జరిగిన పట్టణ పరివర్తన జాతీయ సదస్సులో భాగంగా పట్టణ సంస్కరణలు చేపట్టిన 16 రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రోత్సాహకాలు అందించింది. అమృత్ పథకంలో భాగంగా ఈ-గవర్నెన్‌‌స, ఆడిటింగ్, ఇంధన, నీటి ఆడిట్, తదితర అంశాలను పరిశీలించి రాష్ట్రాలకు మార్కులు ఇచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ అత్యధిక మార్కులు సాధించింది. తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. 


ఏపీ మెట్రో రైలుకు బీఓఐ 500 కోట్ల రుణం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ)కు రూ.500 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) అంగీకారం తెలిపింది. మెట్రో ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,859 కోట్లు భరించాల్సి ఉంది. అయితే ఈ సొమ్మును బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకోవాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు పలు బ్యాంకులతో చర్చలు జరపగా బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 


తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు సినిమా థియేటర్లలో టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. కనిష్టంగా రూ.10 నుంచి రూ.20 వరకు ధరలు పెంచింది. 
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏసీ సినిమా థియేటర్‌లో బాల్కనీ టికెట్ ధర రూ.120. కింది క్లాసు రూ.40. నాన్ ఏసీ బాల్కనీ రూ.60, లోయర్ క్లాస్ రూ.20.
  • మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లలో బాల్కనీ రూ.80. లోయర్ క్లాసు రూ.30. నాన్ ఏసీలో బాల్కనీ రూ.60. లోయర్ క్లాస్ రూ.20.
  • గ్రామ పంచాయతీల్లోని ఏసీ థియేటర్‌లో బాల్కనీ ధర రూ.70. లోయర్ క్లాస్ రూ.20.
  • థియేటర్ల ఆధునీకరణ ఖర్చులకు రూ.2 నుంచి రూ.7 పెంచుకునే అవకాశం.

మహిళా ఖైదీల పెట్రోల్ బంకు ప్రారంభందేశంలోనే తొలిసారిగా మహిళా ఖైదీలు నిర్వహించే పెట్రోల్ బంకును హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైల్ ప్రాంగణంలో జూన్ 23న ప్రారంభించారు. మహా పరివర్తన పేరుతో జైళ్లల్లో అమలుచేస్తున్న సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ బంకును ప్రారంభించింది.

ఏపీలో విద్యకు నీతిఆయోగ్ ‘సాత్’దేశవ్యాప్తంగా విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టి నాణ్యమైన మానవ వనరులు అభివృద్ధి చేసేందుకు నీతి ఆయోగ్ ‘సాత్’ (సస్టెయినబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్‌‌సఫార్మింగ్ హ్యూమన్ కేపిటల్- ఎస్‌ఏటీహెచ్) పేరుతో కార్యాచరణ చేపట్టింది. ఈ కార్యకమ్రాన్ని అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేసిన మెకన్సీ అండ్ కంపెనీ, ఐపీఈ గ్లోబల్ కన్సార్టియంలతో కలసి నీతి ఆయోగ్ అమలు చేస్తుంది. రాష్ట్రాలకు సాంకేతికపరమైన మద్దతు ఇచ్చేందుకు కార్యక్రమం అమలు దశ నుంచే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. ఇందుకుగానూ మార్గదర్శక రాష్ట్రాలుగా తయారు చేసేందుకు వివిధ రాష్ట్రాల ప్రజంటేషన్లను నీతి ఆయోగ్ పరిశీలించింది. ఇందులో విద్యా రంగంలో మార్గదర్శక రాష్ట్రాలుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో మూడింటిని ఎంపిక చేసి కార్యాచరణ అమలు చేస్తారు. అలాగే వైద్యరంగంలో యూపీ, బిహార్, అస్సాం, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలను షార్ట్‌లిస్ట్ చేసింది. జూలైలో తుది ఎంపిక జరిగి రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకొని ‘సాత్’ అమలు చేపడతామని నీతి ఆయోగ్ వెల్లడించింది. 


సింగపూర్ కన్సార్టియంకు అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియంకు అప్పగించే ఒప్పందానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జూన్ 15న సమావేశమైన కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. 
కేబినెట్ నిర్ణయాలు 
  • ఏపీ రైల్వే మౌలిక వసతుల కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపన. రైల్వే ప్రాజెక్టులు త్వరిత గతిన పనిచేసేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది.
  • ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు రూ.969 కోట్లతో క్లౌడ్ ఆధారిత సీసీ టీవీ విధానం అమలుకు నిర్ణయం.
  • ఆంధ్రప్రదేశ్ ఇనిస్టిట్యూట్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్, అమరావతి స్టార్టప్ అభివృద్ధికి సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందానికి ఆమోదం.


‘అక్షయపాత్ర’కు మధ్యాహ్న భోజన కాంట్రాక్టుకుప్పం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే బాధ్యతను ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్‌కు అప్పగిస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జూన్ 15న ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకోసం రూ. 7.99 కోట్లను ఆ సంస్థకు అడ్వాన్సుగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఫౌండేషన్ కేంద్రీకృత వంటశాల ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని 412 స్కూళ్లకు మధ్యాహ్న భోజనాన్ని అందించనుంది. 


విజయరాయిలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రంపశ్చిమ గోదావరి జిల్లా విజయరాయిలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి జూన్ 15న నిర్ణయించింది. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఏర్పాటయిన మొక్కజొన్న పరిశోధన కేంద్రం తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో ఏపీలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి విజయరాయిని ఎంపిక చేశారు. కేంద్రం ఏర్పాటుతో పాటు అవసరమైన శాస్త్రవేత్తలను నియమించాలని సమావేశంలో తీర్మానించారు. 


తెలంగాణ, ఏపీలకు ఆకాశవాణి అవార్డులుఆకాశవాణి 2014-15 వార్షిక అవార్డుల్లో తెలంగాణ, ఏపీలోని కేంద్రాలకు వివిధ విభాగాల్లో అవార్డు దక్కాయి. గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో మూగజీవాలు ఏ విధంగా మమేకమై ఉంటాయన్న దానిపై నిర్మాత మురళీ కృష్ణ, రచయిత దుర్గయ్య, సహ రచయిత శివప్రసాద్‌లు చేసిన ‘గంగి రెద్దు’ కార్యక్రమానికి రేడియే ప్లే విభాగంలో (హైదరాబాద్ కేంద్రం) మొదటి బహుమతి దక్కింది. ‘విశ్వగురు’కార్యక్రమానికి ఇన్నోవేటివ్ అవార్డు దక్కింది. మహిళా సాధికారతపై నిర్మాత కె.కామేశ్వర్‌రావు, రచయిత వి.ప్రతిమ తీసిన ‘గంగ జాతర’కు ఉత్తమ మహిళా కార్యక్రమం విభాగంలో (విశాఖపట్నం కేంద్రం) అవార్డు దక్కింది. పారిశుధ్యంపై విజయవాడ కేంద్రంలో ప్రసారమైన ‘బాపు బాటలో’కార్యక్రమానికి మరో అవార్డు దక్కింది. 


తెలంగాణలో మెడికల్ డి వెజైస్ పార్కు ప్రారంభం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో 250 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ డివెజైస్ పార్కును మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావు జూన్ 17న ప్రారంభించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ పార్కు దేశంలోనే అతి పెద్దది. దీని ద్వారా 4 వేల మందికి ప్రత్యక్షంగా.. 8 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం మనదేశం 75 శాతం వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోందని ఈ పార్కుతో రానున్న రోజుల్లో పూర్తిస్థాయి వైద్య పరికరాలు ఇక్కడే తయారవుతాయని, చికిత్స ఖర్చులు చాలావరకు తగ్గుతాయన్నారు. 


తెలుగు రాష్ట్రాల్లో పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలుతెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 7 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించాలని విదేశాంగ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలో ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, సిద్దిపేట, నల్లగొండ, ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళంలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 
దేశంలోని హెడ్ పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సంబంధిత సేవలను అందించడానికి అనువుగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ భాగస్వామ్యంతో 149 కొత్త కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 235కు చేరుతుంది. 


జోనల్ వ్యవస్థ రద్దుకు టీఎస్ కేబినెట్ నిర్ణయంతెలంగాణలో జోనల్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర మంత్రివర్గం.. దీనిపై రాష్ట్రపతి అనుమతి కోరనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జూన్ 17న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 
కేబినెట్ నిర్ణయాలు 
భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం నేపథ్యంలో రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలు రద్దు చేస్తూ తీసుకువస్తున్న ఆర్డినెన్‌‌సకు ఆమోదం. 
కల్తీకి పాల్పడితే పీడీ యాక్ట్
ప్రస్తుతం అమల్లో ఉన్న పీడీ యాక్టులోకి మరో పది అంశాలను చేరుస్తూ ఆర్డినెన్‌‌స జారీకి అంగీకారం తెలిపింది. ఆయా మోసాలకు పాల్పడేవారిని కూడా పీడీ యాక్టు కింద అదుపులోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ పది అంశాలు..
  • కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రేతలు
  • పాలు, నూనె, పప్పు, కారం తదితర ఆహార కల్తీకి పాల్పడేవారు
  • నకిలీ డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు తయారుచేసేవారు
  • రేషన్ బియ్యం అక్రమార్కులు
  • అడవుల నరికివేత
  • దురాక్రమణదారులు
  • స్మగ్లర్లు, ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసేవారు
  • లైంగిక దాడులకు పాల్పడేవారు
  • సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు
  • గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్‌కు పాల్పడే వారు

ఆన్‌లైన్ పేకాటపై నిషేధంప్రభుత్వం పేకాట క్లబ్బులను మూసివేసినా ఆన్‌లైన్‌లో గేమింగ్, గ్యాంబ్లింగ్ జరుగుతున్న నేపథ్యంలో... రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో రమ్మీ, పేకాట ఆడటంపై నిషేధం. ఈ మేరకు గ్యాంబ్లింగ్, గేమింగ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్‌‌స తేనుంది. 


ఏపీలో డ్వాక్రా మహిళ ఆదాయం నెలకు రూ.4 వేలేరాష్ట్రంలో డ్వాక్రా మహిళలు మొత్తం 89 లక్షల మంది ఉంటే సగం మంది డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుటుంబ సభ్యులందరీ, అన్ని రకాల ఆదాయం కలిపినా కూడా రూ.నాలుగు వేలకు మించడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో 8,97,184 డ్వాక్రా సంఘాల్లో మొత్తం 89,12,339 మంది మహిళలు సభ్యులుగా ఉంటే అందులో కేవలం ఐదు లక్షల మంది మహిళల కుటుంబాలు మాత్రమే నెలకు రూ. పది వేల ఆదాయం పొందుతున్నాయి. మహిళల కుటుంబానికి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిపై వచ్చే ఆదాయంతోపాటు మహిళ భర్తకు సంబంధించిన ఇతర ఆదాయాలన్నీ కలిపితేనే ఈ రూ.పది వేలు అవుతున్నాయి. డ్వాక్రా మహిళల కుటుంబంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛనుదారులుంటే వారికి ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే పింఛన్ డబ్బులను కూడా కుటుంబ ఆదాయంలో లెక్కగట్టారు. 


గొర్రెల పంపిణీ పథకం ప్రారంభంతెలంగాణలో గొల్ల, కురుమలకు గొర్రెలు పంపిణీ చేసే పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో జూన్ 20న ప్రారంభించారు. పథకంలో భాగంగా 825 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు పంపిణీ చేశారు. నాలుగు లక్షల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేయాలని పథకంలో నిర్ణయించగా 7.61 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 7.18 లక్షల మందికి రెండున్నరేళ్లలో కోటిన్నర గొర్రెలు పంపిణీ చేస్తారు. 18 సంవత్సరాలు పైబడినవారు దీనికి అర్హులు. గొర్రెలకు ఏదైనా రోగం వస్తే 1962 నంబర్‌కు ఫోన్ చేస్తే అర్ధగంటలోపే డాక్టర్లు వచ్చి చికిత్స అందిస్తారు. 


బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా కృష్ణారావు తొలగింపుసోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక సమాచారాన్ని పంచుకున్నారన్న ఆరోపణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్, అర్చక సంక్షేమ సంఘం చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లు, షేరింగ్‌లపై ప్రభుత్వం ఎలాంటి వివరణ అడగకుండా తనను పదవి నుంచి తొలగించిందని కృష్ణారావు ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా పదవీ విరమణ చేసిన కృష్ణారావును ఏపీ ప్రభుత్వం 2016లో బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. 


తెలంగాణ వ్యవసాయ ప్రణాళిక విడుదల పంటల సాగు, దిగుబడుల లక్ష్యాలను వివరిస్తూ 2017-18 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం జూన్ 13న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వానాకాలం(ఖరీఫ్), యాసంగి(రబీ) సీజన్లలో కలిపి 90.89 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడిని లక్ష్యంగా పెట్టుకుంది. దిగుబడి లక్ష్యాన్ని గతేడాది (93.57 లక్షల టన్నులు) కంటే తగ్గించారు. 


తెలంగాణ సెర్ప్‌కు జాతీయ పురస్కారంయువతకు ఉపాధి కల్పించడంలో విశేష కృషి చేసిన తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు జాతీయ పురస్కారం దక్కింది. బ్యాంకుల సహకారంతో గ్రామీణ స్వయం ఉపాధిశిక్షణ సంస్థల ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది. ఈ మేరకు జూన్ 7న ఢిల్లీలో జరిగిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ 4వ జాతీయ దివస్‌లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా సెర్ప్ డెరైక్టర్ బాలయ్య ఈ అవార్డు అందుకున్నారు. 


ఆన్‌లైన్‌లోనే వాహన యజమాని పేరు మార్పుఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఆన్‌లైన్‌లోనే వాహన యజమాని పేరు మార్చే ప్రక్రియను విశాఖపట్నం జిల్లా రవాణా శాఖలో ప్రవేశపెట్టారు. వాహన క్రయ, విక్రయాల సమయంలో యజమాని రవాణా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా జూన్ 7 నుంచి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. వాహన పత్రాలు తదితర వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో సులభంగా పేరు మార్పిడికి అవకాశం ఏర్పడింది. 
మొట్టమొదటిగా 2016 మార్చి నుంచి కొత్త వాహనాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను విశాఖ జిల్లాలోనే ప్రారంభించారు. 


కాకినాడలో మహాసంకల్ప దీక్ష జూన్ 2న కృష్ణా జిల్లా విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ప్రారంభించిన నవ నిర్మాణ దీక్షను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూన్ 8న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ముగించారు. ఈ సభకు హాజరైన జనంతో మహా సంకల్ప దీక్ష పేరుతో సీఎం ప్రతిజ్ఞ చేయించారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ను పొగరహిత వంట ఇంధన వినియోగ రాష్ట్రంగా ప్రకటించారు. 
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. 2022 నాటికి దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా చేసి తలసరి ఆదాయాన్ని మూడు లక్షలకు పెంచుతానన్నారు. 2029 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా చేసి తలసరి ఆదాయాన్ని రూ.10 లక్షలకు తీసుకు వెళతానని.. 2050 నాటికి కోటి ఏడు లక్షల తలసరి ఆదాయంతో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన కాఫర్ డ్యామ్ పనులను 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 
అమ్మకు వందనం పథకం..
అ అంటే అమ్మ, ఆమెను ఎంతో గౌరవించాలనే ఉద్దేశంతో తల్లులకు పాదాభివందనం చేసేలా ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ పథకం ద్వారా అమ్మకు బడి పిల్లలతో వందనం చేయించే ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు. 


ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూతకాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (80) జూన్ 9న కన్నుమూశారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి సహచర ఎంపీలతో కలసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూకు వెళ్లిన ఆయన.. అక్కడ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలంలోని ఇడికుడ పాల్వాయి స్వగ్రామం. ముక్కుసూటి స్వభావమున్న నేతగా పేరుపొందిన పాల్వాయిది ఐదున్నర దశాబ్దాల రాజకీయ జీవితం. నెహ్రూ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. 1967లోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. తొలి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పోరాడి.. జైలుకు వెళ్లారు. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ఏరువాక పౌర్ణమిఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో జూన్ 9న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాడెద్దులు తోలి వేరుశనగ విత్తనం వేశారు. ఆపై ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో ఏరువాకను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని చెప్పారు.


ఏపీలో ఫిజికల్ లిటరసీ పాలసీ ఖరారు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం (2017-18) నుంచి ఫిజికల్ లిటరసీని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి 8 అంశాలతో కూడిన పాలసీని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9న ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జీఓ 35ని విడుదల చేశారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపు, శారీరక దారుఢ్యం, నైపుణ్యాలు పెంపొందించడంతోపాటు క్రమశిక్షణ అలవడేందుకు ఫిజికల్ లిటరసీ దోహదపడుతుందని జీవోలో పేర్కొన్నారు. 
వ్యాయామ విద్యలు 
యోగనిద్ర, ప్రాణాయామం, ధ్యానం, తాయ్‌చీ (మార్షల్ ఆర్‌‌ట్స), సంగీతం, రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్, కినేస్తిటిక్. గ్లయిడింగ్, కేచింగ్, కికింగ్, స్ట్రయికింగ్, కోలాటం, డప్పు, కర్రసాము, ఏరోబిక్ తరగతులు, ట్రెక్కింగ్, వాటర్, స్నోలాండ్, సర్ఫింగ్ రివర్ రాఫ్టింగ్, వేవ్ బోర్డింగ్, డైవింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, తొక్కుడు బిళ్ల, బిళ్లంగోడు, ఖోఖో, కబడ్డీ, కూచిపూడి, భరతనాట్యం. 


ఏపీలో కృష్ణా నదిపై ఆరు లేన్ల వంతెనఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖద్వారంగా కృష్ణా నదిపై ఆరు లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు రూ.800 కోట్ల వ్యయంతో వేలాడే వంతెన (హ్యాంగింగ్ బ్రిడ్జి) నిర్మించనున్నారు. ఇక్కడి చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా కూచిపూడి ముద్ర, కూచిపూడి నాట్య భంగిమ ఇమిడి ఉండేలా రెండు అంతస్తుల్లో ఈ వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 
కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం మండలంలోని పవిత్ర సంగమం నుంచి తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మాణానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) త్వరలో టెండర్లు పిలవనుంది. ఈ వంతెనకు సంబంధించి ఇప్పటికే ఎల్ అండ్ టీ ఆరు కాన్సెప్ట్ డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించింది. 


ఏపీ ట్రెజరీలో "ఈ కుభేర్" ద్వారా చెల్లింపులు ట్రెజరీల్లో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు, అవినీతిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు పర్యవేక్షణలో నిర్వహించే ‘ఈ కుభేర్’ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం వల్ల ట్రెజరీల్లో కుంభకోణాలు జరిగే అవకాశం లేకుండా కాంప్రహెన్సివ్ ఫైనాన్సియల్ మానిటరింగ్ సిస్టం (సీఎఫ్‌ఎమ్‌ఎస్)ను ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకు సంబంధించిన రాష్ట్ర విభాగాన్ని విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న డెరైక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. 
ప్రస్తుతం బ్యాంకుల వారు ట్రెజరీలకు పంపిస్తున్న ఈ చెక్‌ను ఆయా ఖాతాలకు జనరేట్ చేసే సందర్భంలో నిధులు స్వాహా అవుతున్నందున ఈ విధానాన్ని సమగ్రంగా పరిశీలించి ప్రక్షాళన చేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సీఎఫ్‌ఎమ్‌ఎస్ సిస్టం అమలు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 


ప్రముఖ రచయిత సి. నారాయణరెడ్డి కన్నుమూతప్రముఖ కవి, సాహితీ వేత్త సింగిరెడ్డి నారాయణరెడ్డి(86) జూన్ 12న కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సినారెకు నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, క్రిష్ణవేణి ఉన్నారు. 
సినారె అసలు పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. ఆయన 1931 జూలై 29న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో సింగిరెడ్డి మల్లారెడ్డి, బుచ్చమ్మ రైతు దంపతులకు జన్మించారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, సినీ గేయ రచయితగా, మహా వక్తగా, గజల్ కవిగా, గాయకుడిగా, సాహిత్య బోధకుడిగా, పరిశోధకుడిగా ప్రసిద్ధి చెందారు.
  • 1952-54లో ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎంఏ తెలుగు పూర్తి చేశారు.
  • సినారెది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. 30 ఏళ్ల క్రితమే మరణించిన ఆమె పేరు మీద ‘సుశీల నారాయణరెడ్డి సాహిత్య పురస్కారాన్ని ప్రారంభించారు.
  • చిన్నప్పట్నుంచే కవిత్వం పట్ల ఆసక్తిని, ఇష్టాన్ని ఏర్పర్చుకున్న సినారె ఆరేడు తరగతుల వయస్సులోనే కవితలు రాశారు. 1953లో వచ్చిన ‘నవ్వని పువ్వు’సినారె తొలి రచన.
  • ఎంఏ పూర్తయ్యాక కొంతకాలం సికింద్రాబాద్ ఆర్‌‌ట్స అండ్ సైన్స్ కాలేజీలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా సినారె పనిచేశారు.
  • 1955లో ఆంధ్రోపన్యాసకుడిగా, 1958లో నిజాం కాలేజీలో ఉపన్యాసకుడిగా చేరారు.
  • ఆ సమయంలోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి సూచన మేరకు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికాంధ్ర కవిత్వం -సంప్రదాయములు, ప్రయోగములు’అంశంపై పరిశోధన చేశారు. 1962లో పీహెచ్‌డీ పట్టా పొందారు.
  • అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా 1981 నుంచి 1985 వరకు పని చేశారు. 1985 నుంచి 1989 వరకు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
  • భాషా సాంస్కృతిక సలహాదారుడిగా కొంతకాలం, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా 1987 నుంచి 2004 వరకు విధులు నిర్వహించారు.
  • 1997లో రాజ్యసభ సభ్యుడిగా సినారెకు అవకాశం లభించింది. ఆరేళ్లు ఆ పదవిలో కొనసాగారు.
  • సినారె రాసిన గ్రంథాలు, రచనలు ఇంగ్లిషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడ మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. మొత్తం 18 రకాల సాహిత్య ప్రక్రియల్లో 90కి పైగా గ్రంథాలు రాశారు.
  • ‘కర్పూర వసంతరాయలు’, ‘నాగార్జున సాగరం’, ‘తెలుగు గజళ్లు’, ‘కావ్యగానాలు’ప్రముఖమైనవి.
  • ‘విశ్వనాథ నాయకుడు’, ‘రుతుచక్రం’పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి.
  • 1990లో యుగోస్లేవియాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నారు.
  • ‘విశ్వంభర’వచన కావ్యానికి 1988లో జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. ‘ఋతుచక్రం’కావ్యానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
  • 1977లో పద్మశ్రీ పురస్కారం, 1992లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
సినారె అందుకున్న అవార్డులు
  • జ్ఞానపీఠ్ అవార్డు
  • పద్మశ్రీ, పద్మవిభూషణ్
  • కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు
  • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
  • రాజాలక్ష్మీ పురస్కారం
  • సోవియట్-నెహ్రూ పురస్కారం
  • ఉస్మానియా నుంచి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్
  • కళాప్రపూర్ణ, సినీకవిగా నంది పురస్కారాలు
  • పలు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు
  • 2014లో సాక్షి ‘జీవన సాఫల్య పురస్కారం’


తెలంగాణ వాణిజ్య శాఖ పురోగతి నివేదిక 2016-17 తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం ‘టీఎస్ ఐపాస్’ ప్రారంభించిన నాటి నుంచి రూ.73 వేల కోట్ల పెట్టుబడులతో 3,828 కొత్త పరిశ్రమలు వచ్చాయని ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. దీంతో 2.46 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు 10 లక్షల వరకు పరోక్ష ఉపాధి అవకాశాలు సాధించగలిగామని చెప్పారు. ఈ మేరకు టీఎస్ ఐపాస్ ప్రారంభించి రెండేళ్లయిన సందర్భంగా రూపొందించిన తెలంగాణ వాణిజ్య శాఖ పురోగతి నివేదిక 2016-17ను జూన్ 12న విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లోగోను ఆవిష్కరించారు.


ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంపు కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను 50% మేర పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.12వేలు తగ్గకుండా వేతనం ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తింపచేయనున్నారు. 
అదే సమయంలో వేతనాల పెంపు వర్తింపునకు ప్రభుత్వం కొన్ని షరతులను విధించింది. మంజూరైన రెగ్యులర్ ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, ఆర్థిక శాఖ అనుమతితో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే పెంపుదల వర్తింప చేస్తారు. ఎలాంటి అలవెన్సులు, ఇంక్రిమెంట్లు ఉండవని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కన్సల్టెంట్లకు, సలహాదారులకు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవని పేర్కొన్నారు. 


అమరావతిలో ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో రూ.100 కోట్ల వ్యయంతో వంద ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందుకు సహకరించాలని ప్రముఖ ప్రకృతి సేద్యరంగ నిపుణుడు సుభాష్ పాలేకర్‌ను ఆహ్వానించిన సీఎం ప్రకృతి సాగుకి రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా ఆయన్ను నియమించారు. ఈ మేరకు పాలేకర్ జూన్ 14న ఉండవల్లిలో సీఎం చంద్రబాబుని కలిసి రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ స్థితిగతుల గురించి చర్చించారు. 
పెట్టుబడి లేని వ్యవసాయ విజ్ఞానాన్ని రాష్ట్రం నలుదిశలా వ్యాప్తి చేసేందుకు త్వరలో పాలేకర్‌తో రైతులకు పాఠాలు చెప్పిస్తామని, వీడియో కాన్ఫరెన్స్‌లతో రైతుల సందేహాలను నివృత్తి చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. పాలేకర్ సూచన మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు నీటి సంరక్షణ విధానాలను నీరు-ప్రగతిలో చేర్చాలని అధికారులకు సూచించారు. 


తెలంగాణ రాష్ట్రావతరణ పురస్కారాలు - 2017జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 52 మందికి అవార్డులు ప్రకటించింది. ఈ పురస్కారం కింద ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున పారితోషకంతో పాటు శాలువా, జ్ఞాపికను అందించి సత్కరిస్తారు. 
పురస్కార గ్రహీతలు 1. సాహిత్యం - వెలపాటి రమారెడ్డి, అశారాజు, జుపాక సుభద్ర, అస్లాం ఫర్షోరి(ఉర్దూ)
2. శాస్త్రీయ నృత్యం - రాఘవరాజ్ భట్-మంగళా భట్, బి. సుదీర్ రావు
3. పేరిణి - పేరిణి కుమార్
4. జానపదం - దురిశెట్టి రామయ్య, కేతావత్ సోమ్లాల్, గడ్డమ్ సమ్మయ్య
5. సంగీతం - ఎం. రాజోల్కర్, వార్సి సోదరులు
6. సామాజిక సేవ - వందేమాతరం ఫౌండేషన్, యాకుబ్ బీ
7. జర్నలిజం - పీవీ శ్రీనివాస్, ఏ రమణకుమార్, బిత్తిరి సత్తి- సావిత్రి (రవి - శివజ్యోతి) ఎలక్ట్రానిక్ మీడియా, వి.సతీష్, మహ్మద్ మునీర్
8. ఫొటో జర్నలిజం - అనిల్ కుమార్
9. సినిమా జర్నలిజం - హెచ్. రమేశ్ బాబు
10. వైద్య రంగం - డాక్టర్ బిరప్ప, నిమ్స్, డాక్టర్ చారి (వెంకటాచారి), సిద్ధా మెడికల్ ఆఫీసర్
11. టీచర్స్ - డాక్టర్ ఏ వేణుగోపాల్ రెడ్డి, టీఎస్‌ఎం అండ్ జీ జూనియర్ కాలేజీ, వీణవంక, కరీంనగర్
12. అంగన్‌వాడీ టీచర్ - ఎం బిక్షపమ్మ
13. ఉద్యమ గానం- కోడారి శ్రీను, వొళ్లాల వాణి, అవునూరి కోమల, అభినయ శ్రీనివాస్
14. పెయింటింగ్ - తోట వైకుంఠం
15. శిల్పకళలు - శ్రీనివాస్ రెడ్డి
16. శాస్త్రవేత్త - డా. ఎస్ చంద్రశేఖర్, ఐఐసీటీ డెరైక్టర్
17. కామెంటరీ/ యాంకరింగ్ - మడిపల్లి దక్షిణామూర్తి
18. అర్చకుడు - పురాణం నాగయ్య స్వామి, కొక్కెర కిష్టయ్య (మేడారం)
19. ఆధ్యాత్మికవేత్త - ఎం సంగ్రామ్ మహరాజ్, ఉమాపతి పద్మనాభ శర్మ, మహ్మద్ ఖాజా షరీఫ్ షేక్ ఉల్ హదీస్ (మౌల్వీ), ప్రొఫెసర్ పెనుమాళ్ల ప్రవీణ్ ప్రబు సుధీర్ (బిషప్/ ఫాదర్)
20. థియేటర్ - దెంచనాల శ్రీనివాస్, వల్లంపట్ల నాగేశ్వర్ రావు
21. క్రీడలు - తెలంగాణ స్పోర్‌‌ట్స స్కూల్ - హకీంపేట్, ఎండల సౌందర్య (హాకీ)

మిషన్ అంత్యోదయకు ఏపీ నుంచి 2,584 గ్రామాలు 
కేంద్రం ప్రకటించిన మిషన్ అంత్యోదయ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2,584 గ్రామాలు ఎంపిక కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని మండలాల నుంచి 4 - 5 గ్రామాల చొప్పున ఎంపిక చేసి, 2019 అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆయా గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్రంలో మిషన్ అంత్యోదయ కార్యక్రమ అమలు విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం మే 31న ఉత్తర్వులు జారీ చేసింది. నేరాలు తక్కువగా ఉండే గ్రామాలతో పాటు ఇప్పటికే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వసతి ఉన్న గ్రామాలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. 
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి దేశవ్యాప్తంగా కనీసం 50 వేల గ్రామాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం మిషన్ అంత్యోదయ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. 
మిషన్ అంత్యోదయ లక్ష్యాలు - ఎంపికైన ప్రతి ఇంటికి పది వేల రూపాయల ఆదాయం కల్పించడం 
- ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరికైనా ఏదైనా ఉపాధి రంగంలో నైపుణ్య శిక్షణ ఇప్పించడం. 
- జీవనోపాధికి గ్రామంలో ప్రతి ఇంటికి బ్యాంకు రుణం కల్పించడం
- గ్రామానికి మెరుగైన రోడ్డు వసతి కల్పించడం 
- ఎంపిక చేసిన గ్రామంలో ప్రతి ఒక్కరికీ విద్య, ఆరోగ్య సౌకర్యం అందుబాటులో ఉంచడం. 
 

వైద్యుల పదవీ విరమణ వయసు 63 ఏళ్లకు పెంపు
వైద్యులకు 60 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 63 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మే 31న ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య విద్యా సంచాలకులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్న పీజీ వైద్యులు, పీజీ డిప్లొమో వైద్యులందరికీ ఈ పెంపు వర్తిస్తుంది. 2014లో రాష్ట్రం విడిపోకముందు వరకు పదవీ విరమణ వయసు 58 ఏళ్లుగా ఉండేది. ఆ తర్వాత దీన్ని 60 ఏళ్లకు పెంచారు. తాజాగా 63 ఏళ్లకు పెంచారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లుగా ఉంది. 
ఎంబీబీఎస్ అర్హతతో మాత్రమే పనిచేసే వైద్యులకు ఈ పెంపు వర్తించదు. 


సుధీర్ చంద్రారెడ్డికి గోపాలరత్న అవార్డు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన వెదిరె సుధీర్ చంద్రారెడ్డి గోపాలరత్న పురస్కారానికి ఎంపికయ్యారు. మే 31న ప్రపంచ పాలదినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. పురస్కారం కింద రూ.3 లక్షల నగదు బహుమతి కూడా పొందారు. పాడి పరిశ్రమలో మెరుగైన ఫలితాలు సాధించిన వారికి ఏటా గోపాలరత్న జాతీయ అవార్డులను అందజేస్తారు.


తెలంగాణ పోలీసులకు సీఎం సర్వోన్నత పతకాలురాష్ట్ర పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక శాఖ, విజిలెన్స్‌, ఎస్పీఎఫ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. అత్యున్నతమైన ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకంతో పాటు మరో ఐదు విభాగాల్లో పతకాలకు ఎంపికైన వారి జాబితాను జూన్ 1న విడుదల చేశారు. ముగ్గురికి సీఎం సర్వోన్నత పోలీసు పతకం, 20 మందికి శౌర్య పతకాలు, ఐదుగురికి రాష్ట్ర మహోన్నత సేవా పతకాలు, 43 మందికి ఉత్తమ సేవా పతకాలు, 197 మందికి పోలీసు సేవా పతకాలు, 31 మందికి కఠిన సేవా పతకాలు దక్కాయి. 
ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం
ఎన్.మల్లారెడ్డి, ఏసీబీ డిప్యూటీ డెరైక్టర్
పి.రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీ, ఇంటెలిజెన్స్‌
పి.జగదీశ్వర్, ఇన్‌స్పెక్టర్, మైలార్ దేవులపల్లి


తెలంగాణ ఐటీ రంగం పురోగతి నివేదిక 2016-172022 నాటికి రాష్ట్ర ఐటీ ఉత్పత్తుల ఎగుమతులను రూ.1.20 లక్షల కోట్లకు పెంచడంతో పాటు 8 లక్షల కొత్త ఐటీ కొలువులు సృష్టిస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రకటించారు. జూన్ 1న హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ రంగ పురోగతి వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. 
నివేదికలోని ముఖ్యాంశాలు- 2016- 17లో తెలంగాణ ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు రూ.85,470 కోట్లకు పెరిగి, 13.85 శాతం వృద్ధి సాధించాయి. ఇది జాతీయ సగటు కంటే 4% అధికం. 
- రాష్ట్రంలో 2016లో కొత్తగా 24,506 మందికి ఐటీ కొలువులు లభించాయి. దీంతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 4,31,891కు పెరిగింది. 
- త్వరలో ఖమ్మంలో ఐటీ పార్కు ప్రారంభం. 
‘టీ-వాలెట్’ ప్రారంభం 
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘టీ-వాలెట్’ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ- గవర్నెన్స్‌, ఎం- గవర్నెన్స్‌ (మొబైల్- గవర్నెన్స్‌)ను ప్రోత్సహిం చేందుకు ఈ యాప్‌ను ప్రవేశపెట్టారు.


విశాఖలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జూన్ 1న సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖ జిల్లా అచ్చుతాపురంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, సాగునీటి సంఘాలకు ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహించడం, రేషన్ షాపుల్లో చక్కెర పంపిణీ ఆపాలని నిర్ణయం తీసుకున్నారు.
మంత్రివర్గ నిర్ణయాలు
- విశాఖ జిల్లా అచ్యుతాపురంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అచ్చుతాపురం, రాంబిల్లి మండలాల్లో సుమారు 2,884.66 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రిమండలి తీర్మానం. 
- విజయవాడ మెట్రోకార్పోరేషన్‌కు రుణ పరిమితిని రూ.1859కోట్లనుంచి రూ.2,175 కోట్లకు పెంచుతూ నిర్ణయం. ఈ రుణాన్ని మెట్రో కార్పోరేషన్ హడ్కో నుంచి తీసుకోనుంది.


లాంఫాంలో జియో స్పేషియల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు సమీపంలో ఉన్న లాంఫాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన భౌగోళిక సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం (జియో స్పేషియల్ టెక్నాలజీ సెంటర్) జూన్ 1న ప్రారంభమైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ సెంటర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ నలుమూలల నుంచి తెలుసుకునేందుకు వీలుంటుంది. 


ఏపీలో బసవతారకం మదర్ కిట్లు
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి జులై 1 నుంచి బసవతారకం మదర్ కిట్లు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ కిట్‌లో మఫ్లర్స్, రెండు ఫీడింగ్ గౌన్లు, ఫ్లాస్కు, బ్లాంకెట్ ఉంటాయి. జూన్ 20 నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో మరణించిన వారిని ఇళ్లకు చేర్చేందుకు మహాప్రస్థానం కార్యక్రమం ప్రారంభించనున్నారు.


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుతెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జూన్ 2న హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు దళాల వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వచ్చే యాసంగి (రబీ) నుంచే వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. మాతాశిశు సంరక్షణకు ఉద్దేశించిన రూ.15 వేల విలువైన ‘కేసీఆర్ కిట్’ పథకం జూన్ 3 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఇటీవల కాగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 17.82 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని కొనియాడారు.



కేసీఆర్ కిట్ పథకం ప్రారంభంప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, సిజేరియన్ల సంఖ్యను తగ్గించేందుకు ఉద్దేశించిన కేసీఆర్ కిట్ పథకంను ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 3న హైదరాబాద్‌లో ప్రారంభించారు. రెండు కాన్పులకు వర్తించే ఈ పథకంలో ఒక్కో కాన్పునకు రూ.2 వేల విలువైన కేసీఆర్ కిట్‌ను అందజేస్తారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు అందిస్తారు. రాష్ట్రంలోని 9 బోధన, ఆరు జిల్లా ఆసుపత్రులతో సహా మొత్తం 841 ఆసుపత్రుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు.
కిట్‌లో అందించే వస్తువులు..
శిశువు కోసం..దోమతెర బేబీ బెడ్, దుస్తులు 
రెండు టవల్స్ బేబీ న్యాప్కిన్స్‌
బేబీ పౌడర్ బేబీ షాంపూ
బేబీ ఆయిల్ బేబీ సబ్బు
బేబీ సోప్‌బాక్స్ ఆట వస్తువులు
తల్లి కోసం
రెండు చీరలు రెండు సబ్బులు
కిట్ బ్యాగ్ ప్లాస్టిక్ బకెట్


తెలంగాణ ఇంటి పార్టీ ఆవిర్భావంసామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా ‘తెలంగాణ ఇంటి పార్టీ’ని స్థాపిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమ నాయకుడు చెరుకు సుధాకర్ అన్నారు. ఈ మేరకు జూన్ 2న హైదరాబాద్‌లో జరిగిన ఆవిర్భావ సభలో పార్టీ ఏర్పాటును ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, పలువురు మలిదశ తెలంగాణ ఉద్యమకారులతో ఈ పార్టీ ప్రారంభమైంది.


ఏపీలో సర్పంచ్ పదవికి టెన్త్ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ తదితర పదవుల పోటీకి టెన్త్ విద్యార్హతను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గ్రామ సర్పంచులకు చెక్‌పవర్ ఉండడం స్థానికంగా గెలిచిన వారి స్థానంలో వేరొకరు పెత్తనం చెలాయించడం వంటి కారణాలతో కేంద్రం ఈ నిబంధనను ప్రతిపాదించింది. హర్యానా తదితర రాష్ట్రాల్లో కనీస విద్యార్హత ఉండడం వల్ల.. స్థానిక పాలన మెరుగ్గా ఉందని అధ్యయనం చేసిన లోక్‌సభ అంచనాల కమిటీ.. స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి దేశవ్యాప్తంగా కనీస విద్యార్హత ఉండాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి నివేదిక అందజేసింది.


ఉత్తమ ‘డిజిటల్ సేవకుడు’బెజ్జంకి రవితెలంగాణలోని సిద్ధిపేట జిల్లా బెజ్జంకిలోని కామన్ సర్వీస్ సెంటర్‌లో డిజిటల్ సేవకుడిగా పనిచేస్తున్న మానాల రవి ప్రతిష్టాత్మకమైన స్కోచ్ సీఎస్‌సీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 20న ముంబైలో ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నుంచి రవి ఈ అవార్డును అందుకోనున్నారు.


మెడికల్, టూరిజం హబ్‌గా అరకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అరకును మెడికల్, టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు జూన్ 6న రాజధాని అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అరకులో నవనిర్మాణ దీక్ష, ఇంటింట దీపం పథకాలని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అర్హులైన అన్ని పేద కుటుంబాలకు 2018 నాటికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి పొగరహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పిస్తున్నామని చెప్పిన సీఎం... త్వరలో విశాఖ జిల్లాను సంపూర్ణ పొగరహిత జిల్లాగా చేయనున్నట్టు తెలిపారు. 
రాష్ట్రంలో గిరిజనుల ఆరోగ్యం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ‘ట్రై’(టీఆర్‌వై) అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, ఇందులోకి అన్ని శాఖల్ని తీసుకొచ్చి మూడు నెలలకొకసారి ప్రగతిని సమీక్షిస్తానని సీఎం చెప్పారు. వచ్చే ఆరునెలల్లో విశాఖ జిల్లాలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో ఫైబర్ నెట్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. అనంతరం ఆ ప్రాంతాల్లోని పాఠశాలలకు డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 

No comments:

Post a Comment